జనగామ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం జనగామ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. రాష్ట్ర పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల పాత్ర కీలకమైందని, వారి ప్రాణత్యాగాలు వెలకట్టలేనివన్నారు. 22 రోజులుగా నిర్వహిస్తోన్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రతిఒక్క గ్రా మంలో పండుగ వాతావరణంలో జరుపుకున్నారన్నారు.
మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆ దర్శంగా నిలిచాయన్నారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మొదటి ప్రాధాన్యత కల్పించాలని కలెక్టర్‌కు సూచించారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పాగాల సంపత్‌రెడ్డి మాట్లాడుతూ అనేక ఉద్యమాల పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, వారికేం చేసినా తక్కువేనని అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఎడవెల్లి కృష్ణారెడ్డి మాట్లాడుతూ అమరుల త్యాగాల వల్ల ప్రస్తుతం ప్రశాంత తెలంగాణలో ఉన్నామని, వారి త్యాగాలను స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఏర్పాటుతో పరిష్కారం లభించిందన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. అంతకుముందు అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, రోహిత్‌సింగ్, డీసీపీ సీతారాం, శ్రీకాంతాచారి తండ్రి, అమరవీరుల కుటుంబ సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.