Thursday, January 23, 2025

కాషాయ గోబెల్స్ దళం

- Advertisement -
- Advertisement -

దేశంలో ఏం జరుగుతోంది? కేంద్ర ప్రభుత్వ, పాలకపక్ష భజనరాయుళ్లు ఏమి చెబుతున్నారో బేరీజు వేసుకొని చూడకపోతే జనం మోసపోతూనే ఉంటారు. బుద్ధి జీవులు తమ మెదళ్లు, రాతలకు పదును పెట్టాల్సి ఉంది. ఎన్నికల సంవత్సరం గనుక అవాస్తవాలు, అతిశయోక్తులు, అర్థ సత్యాలను జనం ముందు కుమ్మరిస్తారు, కాషాయ దళాలు గోబెల్స్ ప్రచారంతో వాట్సాప్‌ను నింపేస్తారు. దానిలో భాగంగానే గత తొమ్మిది సంవత్సరాల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో పెట్టుబడులు, నవకల్పనలో ముందు పీఠీన ఉందని ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక ఆర్గనైజర్‌లో జులై 21న అమరజిత్ వర్మ అనే పరిశోధకుడు రాసిన విశ్లేషణలో పేర్కొన్నారు. కియర్‌నే డాట్‌కావ్‌ు నివేదిక ప్రకారం అగ్రశ్రేణిలో ఉన్న పాతిక దేశాల ఎఫ్‌డిఐ కాన్ఫిడెన్స్ (విశ్వాస) సూచిక జాబితాలో 2020, 21, 22 సంవత్సరాల్లో మన దేశానికి చోటు లేదు. అంతకు ముందు 2017లో ఎనిమిది, 2018లో 11, 2019లో 16వ స్థానాల్లో ఉన్నది. 2023 సూచిక ప్రకారం 16వ స్థానంలో ఉంది. 2022లో పదవ స్థానంలో ఉన్న చైనా 2023లో ఏడవ స్థానానికి చేరింది. ఇక నవకల్పనలు అనేవి పరిశోధన అభివృద్ధి రంగాలలో పెట్టే పెట్టుబడులను బట్టి ఉంటాయి.2013లో ఈ సూచికలో మన దేశం 66 వది కాగా, 2022లో 40వ స్థానంలో ఉంది. (ఆర్గనైజర్ పత్రిక విశ్లేషకుడు 2015లో ఉన్న 81వ స్థానాన్ని తీసుకొని 2022లో 40వదిగా ఉందంటే మోడీ పాలనలో ఎంత పెరిగిందో చూడండని జనాన్ని నమ్మించేందుకు చూశారు) ఇదే కాలంలో చైనా 35 నుంచి 11వ స్థానానికి ఎదిగింది.ఈ సూచికలు స్థిరంగా ఉండవు, ఏడాదికేడాది మారుతుంటాయి. ధోరణి ఎలా ఉందన్నదే గీటురాయి. మన దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల పెట్టుబడులను 2007 నాటికి జిడిపిలో 2 శాతానికి పెంచాలని 2003లో నాటి వాజ్‌పేయీ సర్కార్ విధాన పత్రంలో పేర్కొన్నది. తరువాత 2013లో యుపిఎ ప్రభుత్వం 2018 నాటికి ఆ మేరకు పెంచాలని గడువు పెంచింది. దాన్ని నరేంద్ర మోడీ సర్కార్ 2020 విధాన పత్రంలో 2030 సంవత్సరంగా పేర్కొన్నారు. ఇక ఆచరణను చూద్దాం.

ప్రపంచ బాంకు 2022 అక్టోబరు 24న తాజా పరిచిన సమాచారం ప్రకారం 1996లో మన దేశం ఈ రంగానికి చేసిన ఖర్చు జడిపిలో 0.64 శాతం. 2004లో 0.76, 2008లో 0.86, 2014లో 0.7, 2018లో 0.66, 2023లో 0.7 శాతం ఉంది. ప్రపంచ సగటు 1.8లో సగం కూడా మన దేశం ఖర్చు చేయటం లేదు. ఇంత తక్కువగా ఉండటానికి కార్పొరేట్ రంగం తగినంత ఖర్చు చేయకపోవటమే అని చెబుతున్నారు. (2023 ఫిబ్రవరి 24, హిందూ వార్త) సులభతర వాణిజ్యం పేరుతో భారీ మొత్తంలో ఇచ్చిన పన్ను రాయితీల కారణంగా గతంతో పోలిస్తే ఎఫ్‌డిఐలు పెరిగాయి. వాటి మాదిరి మన పారిశ్రామిక ఉత్పత్తి లేదా వస్తు ఎగుమతులు పెరగలేదు. ఆత్మనిర్భరత గురించి ఊదరగొడుతున్నారు. ఉత్పాదకతతో ముడిపెట్టిన బోనస్ పథకం (పిఎల్‌ఐ) పెద్ద ఎత్తున విజయవంతమైందని, 14 రంగాలలో రూ. 2.74 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ పథకం 2020లో ప్రారంభమైంది.

ఆరు సంవత్సరాల కాలంలో రూ. 1.9 లక్షల కోట్ల మేర సబ్సిడీ కోసం పక్కన పెట్టినట్లు చెప్పారు.దీని కింద 2023 మార్చి నాటికి రూ. 3,400 కోట్లు తమకు చెల్లించాలని కొన్ని కంపెనీలు కోరగా రూ. 2,900 కోట్లు చెల్లించారు. ఈ పథకం కింద ఇచ్చే సబ్సిడీతో ఉత్పాదక రంగానికి పెద్ద ఊపు వస్తుందని చెప్పారు. ఆపిల్ ఫోన్ల అసెంబ్లింగ్‌ను ఒక విజయగాథగా చెబుతున్నారు. దాని వెనుక ఉన్న అసలు కథేంటి? వివిధ దేశాల్లో ఉత్పత్తి చేసిన విడిభాగాలను దిగుమతి చేసుకొని మన దేశంలో వాటిని ఒక దగ్గర కూర్చటం తప్ప అది ఉత్పత్తి చేసేది కాదు. ఆ ఫోన్లను మన మార్కెట్లో, విదేశాలకూ ఎగుమతి చేస్తున్నది. ఉదాహరణకు మన దేశంలో అసెంబ్లింగ్ చేసిన అలాంటి ఒక ఫోను విలువ రూ. పది వేలు అనుకుందాం. దానిలో తొమ్మిది వేల విలువ గల విడిభాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని మన దేశంలో ఉత్పత్తి అవుతున్న విడిభాగాల విలువ మరొక వెయ్యి జత చేసిందనుకుందాం. దాన్ని రూ. 200 లాభంతో అమ్మింది, లేదు ఎలాంటి లాభం లేకుండా అసలు ధరకే అమ్మిందనుకుందాం. పిఎల్‌ఐ పథకం కింద మన ప్రభుత్వం ఐదు శాతం సబ్సిడీ ఇస్తే ఒక ఫోను మీద రూ. 500 లాభం వచ్చినట్లే. ఆ మేరకు ఇతర దేశాల్లో ధర తగ్గించి ఇతర ఫోన్ కంపెనీలను వెనక్కు నెట్టవచ్చు. ఇంత లాభసాటిగా ఉన్నపుడు చైనా నుంచో మరొక చోట నుంచో కంపెనీలు మన దేశానికి ఎందుకు రావు, అసెంబ్లింగ్ కేంద్రాలను ఎందుకు ప్రారంభించవు. ఈ పథకం కొనసాగినంత కాలం ఇక్కడ ఉంటాయి. తరువాత వేరే చోటకు వెళతాయి.

మన దేశంలో పరిశ్రమలకు ఊపు నిచ్చే రాయితీలు ఆత్మనిర్భర పథకంతో మాత్రమే ప్రారంభం కాలేదు. 1991 నుంచి నూతన ఆర్థిక విధానాల పేరుతో అనేక రాయితీలు ఇచ్చారు, అనుకూల విధానాలు తీసుకువచ్చారు. దీని వలన వచ్చిన ఫలితాలను చూస్తే జిడిపిలో పారిశ్రామిక సంబంధిత సెకండరీ సెక్టర్ వాటా 1991 92లో ఉన్న 24.7 నుంచి 27.3 శాతానికి 2019 20 సంవత్సరం నాటికి పెరిగింది.ఇప్పుడు 24% ఉంది. మనవంటి దేశాల్లో ఉత్పాదక రంగం గణనీయంగా పెరగాల్సి ఉంది. జిడిపిలో సెకండరీ సెక్టర్‌లో భాగమైన ఉత్పాదక రంగ వాటా 17% దాటటం లేదు. పిఎల్‌ఐ పథకం వలన ఉత్పత్తి పెరుగుతుందన్నది నాణేనికి ఒకవైపు మాత్రమే. ఈ సబ్సిడీ పొందేందుకు బడా కంపెనీలతో చిన్న సంస్థలు పోటీ పడలేవు. దాంతో అవి మూతపడతాయి. అసెంబ్లింగ్ రంగంలో యాంత్రీకరణ, రోబోలు రంగంలోకి వస్తున్నందున కార్మికులకు ఉపాధి కూడా పరిమితమే. ఉన్నది కూడా ఊడిపోతుంది. అందుకే ఉపాధి రహిత వృద్ధి అని చెప్పాల్సి వస్తున్నది. దీనితో పాటు పెద్ద మొత్తంలో పన్ను తగ్గింపు కారణంగా ఇటీవలి సంవత్సరాల్లో మన దేశ కార్పొరేట్ల లాభాలు పెరిగాయి, వాటాదార్లకు క్రమం తప్పకుండా డివిడెండ్లు ఇస్తున్నాయి. అందుకే విదేశీ మదుపుదార్లు మన వాటాల మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. తద్వారా వచ్చే డాలర్లను చూపి అది తమ ఘనతే అని ప్రభుత్వం చెప్పుకుంటున్నది.

వందకు రూ. 30 పెట్టుబడి పెట్టించి రూ. 70 సబ్సిడీ ఇచ్చి ఇరవై రెండు వేల కోట్లకు అమెరికా కంపెనీ మైక్రాన్ను అధిపతిగా చేసిన ప్రధాని నరేంద్ర మోడీ నిర్వాకాన్ని దేశం ఇటీవలనే చూసింది. మేడ్‌లేదా మేకిన్ ఇండియా బదులు ప్యాకిన్ ఇండియా సంస్థను పెట్టించేందుకు, అదీ గుజరాత్‌లో ఏర్పాటుకు అమెరికా వెళ్లి మరీ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటిదే 70% సబ్సిడీని (దాదాపు లక్షా పాతిక వేల కోట్లు) జేబులో వేసుకొనేందుకు చూసిన వేదాంత ఫాక్స్‌కాన్ కంపెనీకి సెమీకండక్టర్లను తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో చివరకు దాన్ని రద్దు చేసుకున్నది. తాజా వార్త ఏమంటే మన దేశ కంపెనీ టాటా సన్స్ బ్రిటన్‌లో 5.2 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ కార్ల బాటరీలను తయారు చేసేందుకు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. అదే కంపెనీ మన దేశంలో పెట్టకుండా అక్కడికి ఎందుకు పెట్టుబడులను తరలిస్తున్నట్లు అన్నది ప్రశ్న. ఒక దేశం నుంచి మరొక దేశానికి పెట్టుబడులు వెళ్లటం ఒక సాధారణ అంశంగా మారింది. తొలిసారిగా ప్రధాని పదవిలోకి వచ్చినపుడు విదేశాలకు తరచూ ఎందుకు వెళుతున్నారన్న ప్రశ్నకు కాంగ్రెస్ ఏలుబడిలో దిగజారిన దేశ ప్రతిష్ఠను తిరిగి తెచ్చేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అని మోడీ మద్దతుదార్లు చెప్పారు. మరోవైపు మోడీ అధికారానికి వచ్చిన తరువాత మన దేశం నుంచి విదేశాలకు వెళ్లిన పెట్టుబడులు పెరిగాయి. బెల్లం ఎక్కడ ఉంటే అక్కడికి చీమలు చేరినట్లు ఎక్కడ లాభం ఉంటే అక్కడికి పెట్టుబడి పరుగులు తీస్తుంది తప్ప ఒక నేత పలుకుబడిని బట్టి ఉండదు.నరేంద్ర మోడీ ప్రపంచ నేత అని అందరూ కీర్తిస్తున్నారని, ఎక్కడకు వెళ్లినా బ్రహ్మరధం పడుతున్నారని భక్తులు తన్మయత్వంతో ఊగిపోతారు. అంత పలుకుబడి ఉంటే టాటా కంపెనీ బ్రిటన్‌లో ఎందుకు పెట్టుబడులు పెడుతున్నట్లు ? ఫాక్స్‌కాన్ ఎందుకు తప్పుకుంది? ఐరాస సంస్థ ఆంక్టాడ్ సమాచారం ప్రకారం 2004లో మన దేశానికి ఐదు వందల కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వస్తే 2021లో అవి 8,300 కోట్లకు పెరిగాయి. ఇదే కాలంలో మన దేశం నుంచి విదేశాలకు వెళ్లిన పెట్టుబడులు 200 నుంచి 1,500 కోట్ల డాలర్లకు చేరాయి.

చైనా నుంచి కూడా పెట్టుబడులు పెద్ద మొత్తంలోనే ఇతర దేశాలకు వెళుతున్నాయి. అది ప్రపంచ ఫ్యాక్టరీగా మారింది, ఆ క్రమంలో పెట్టుబడులు తరలాయి. మన దేశం నుంచి వెళుతున్న పెట్టుబడుల గురించి రిజర్వుబాంక్ ఇచ్చిన వివరాల ప్రకారం 2007 నుంచి 2021వరకు 68% పెట్టుబడులు విదేశాల్లో ఉన్న ద్రవ్య సంబంధ కేంద్రాలకు వెళుతున్నాయి. వాటి వలన మన దేశానికి సాంకేతిక పరిజ్ఞానం, మరొకటో ఏమీరాదు. పన్నులు తక్కువగా ఉండే సింగపూర్, మారిషస్, బెర్ముడా, కేమాన్ ఐలండ్స్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, నెదర్లాండ్స్ వంటి వాటికి 51% వెళుతున్నాయి. ఈ దేశాలు, ప్రాంతాల్లో నమోదైన కార్పొరేషన్ల మీద అక్కడి ప్రభుత్వాలు నామమాత్ర పన్ను లేదా కొన్ని సార్లు అసలు పన్నే లేకుండా అనుమతిస్తాయి. అంటే పన్నులను తప్పించుకొనేందుకే అన్నది స్పష్టం. ఈ నిధులు చివరికి ఎక్కడికి చేరుతున్నదీ తెలియటం లేదు. హిండెన్‌బర్గ్ నివేదికలో ఇలాంటి డొల్ల కంపెనీలతో లావాదేవీల గురించి ఉంది. మారు పేర్లతో ఎక్కడి నుంచి వచ్చాయో ఆ దేశాలకే విదేశీ పెట్టుబడుల పేరుతో వచ్చి రాయితీలు పొందుతున్నాయి. అక్కడున్న డొల్ల కంపెనీలకు అధికారికంగా లేదా అక్రమ పద్ధతుల్లో పెట్టుబడులు చేరుతున్నాయి. నల్లధనం తెల్లధనంగా మారుతున్నది. మన దేశానికి 2000 నుంచి 2023లో ఇప్పటి వరకు వచ్చిన విదేశీ పెట్టుబడులను చూస్తే మారిషస్ నుంచి 26, సింగపూర్ 23 అంటే రెండు చోట్ల నుంచే 49% వచ్చాయి. దీని వలన మన ఖజానాకు ఎంతో నష్టం జరుగుతోంది. మన ప్రభుత్వానికి ఇచ్చిన హామీ మేరకు విదేశాలకు వెళ్లిన పెట్టుబడులను ఉపయోగిస్తున్నారనేది కూడా స్పష్టంగా తెలియదు. మన దేశం నుంచి వెళుతున్న పెట్టుబడులతో కొన్ని దేశాల్లో అప్పటికే ఉన్న సంస్థల కొనుగోలు లేదా విలీనాలకు పూనుకుంటున్నారు. ఇదంతా సదరు కంపెనీల మార్కెట్ విస్తరణ, లాభాలను పెంచుకొనేందుకు తప్ప మన దేశంలో ఉపాధి కల్పించేందుకు ఏ మాత్రం తోడ్పడదు. ఆర్థిక వ్యవహారాల కేంద్ర ప్రభుత్వ శాఖ సమాచారం ప్రకారం మన దేశం విదేశాల్లో నేరుగా పెట్టిన పెట్టుబడుల మొత్తం 2021 22లో 17.53 బిలియన్ డాలర్లు కాగా, అత్యంత ధనిక దేశమైన అమెరికా పెట్టిన పెట్టుబడులు 12.1 బి.డాలర్లు మాత్రమే. అక్కడి సంస్థలు పన్నులను తప్పించుకొనేందుకు మారిషస్ వంటి పన్నులు లేని చోట్ల నుంచి పెట్టుబడులు పెడతాయి. భారీ మొత్తాల్లో సబ్సిడీలు ఇచ్చి ప్యాకింగ్ కంపెనీలను తెస్తున్న నరేంద్ర మోడీ బాటరీలను ఉత్పత్తి చేసే టాటా కంపెనీ బ్రిటన్ ఎందుకు వెళ్లిందో మన జనాలకు చెప్పాలా లేదా ?

-ఎం కోటేశ్వరరావు, 8331013288.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News