- మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్: ప్రాథమిక పాఠశాలలు,హైస్కూల్లో పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా నిఘా పెట్టాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రైవేట్ ఆస్పటల్స్ రిజిస్ట్రేషన్, రెన్యువల్, జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం మీద డిటిఎఫ్ డిస్టిక్ టాస్క్ పోర్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిమాసింగ్ మాట్లాడుతూ… ప్రయివేట్ ఆస్పత్రుల యొక్క రిజిస్ట్రేషన్, రెన్యువల్స్ గురించి పరిశీలించారు. వాలిడిటీ దాటిపోయి ఇంకా ఆప్లై చేయని వారికి నోటీసులు జారీ చేయమన్నారు. డివిజన్ వారీగా డిప్యూటీ జిల్లా వైద్యాదికారులు రెగ్యులర్‌గా ప్రయివేట్ ఆస్పత్రులను తనిఖీ చేసి ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూడాలని తెలిపారు. పొగాకు వాడటం వల్ల కలిగే వ్యాధుల గురించి వివరించారు. క్యాన్సర్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులువచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు.
మండల స్థాయిలో కూడా లైన్ డిపార్టెంట్ అందరితో మండల టాస్క్‌పోర్స్ సమావేశం ఏర్పాటు చేయాలని తెలిపారు. పొగాకు వల్ల కలిగే రోగాల గురించి పోస్టర్స్ తయారు చేసి అతికించాలని చెప్పారు. బస్టాండ్లలో రైల్వే స్టేషన్‌లలో నిఘా ఉంచాలని తెలిపారు. పొగ త్రాగేవారికేకాకుండా పొగ పీల్చే వారికి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. 18 సంవత్సరాలలోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా నిఘా పెట్టాలని సూచించారు. ఒకవేళ అమ్మినట్లయితే పెనాల్టీ విధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్. చందు నాయక్, ప్రొగ్రాం ఆఫీసర్ డాక్టర్ రామ్మోహన్, జిల్లా విద్యాధికారి రాధాకిషన్, ఉప జిల్లా వైద్యాదికారులు డాక్టర్ విజయనిర్మల, డాక్టర్ అనిలా, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ ఆశాకుమారి, మెదక్ మున్సిపాలిటీ అధికారులు, లెక్చరర్లు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.