వర్గీకరణ చేయకపోతే కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం
ఆగస్టు రెండోవారంలో చలో హైదరాబాద్‌కు పిలుపు
ఎంఆర్‌ఫిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ
హైదరాబాద్ : పార్లమెంటు వర్షాకాల సమావేశారల్లోనే ఎస్‌సి వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలని ఎంఆర్‌ఫిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. ఎస్‌సి వర్గీకరణ కోసం ఆగస్టు రెండోవారంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టి మాదిగల విశ్వరూపం చూపిస్తామన్నారు. శనివారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడారు.
వర్గీకరణ చేయకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడితో ఉద్యమాన్ని ఆరంభిస్తామని హెచ్చరించారు. వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని వర్గీకరణ కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, వైఎస్ జగన్‌లు అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్ళాలని డిమాండ్ చేవారు. ఎస్‌సి వర్గీకరణకు చంద్రబాబునాయుడు మద్దతు తెలిపాలని కోరారు. బిజెపి సాధారణ కార్యకర్త నుండి ప్రధాని మోడి వరకు అందరూ వర్గీకరణకు సమ్మతించినా వర్గీకరణ ఎందుకు కావడం లేదని, జాప్యానికి కారణమేమిటని ప్రశ్నించారు. బిజెపి అధికారంలోకి వస్తే చట్టబద్ధత కల్పిస్తామని 2013 లో ప్రధాని అభ్యర్థిగా మోడి హైదరాబాద్ వచ్చినప్పుడు హామినిచ్చిన విషయాన్ని మందకృష్ణమాదిగ గుర్తు చేశారు. నవంబర్ 28, 2016న పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో వెంకయ్యనాయుడు, కిషన్రెడ్డి సమక్షంలో ప్రధానిగా మోడి ఎస్‌షి వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు.
జూలై 8 న వరంగల్ కి వచ్చిన సందర్భంగా మోడికి వినతిపత్రం ఇచ్చామని వర్గీకరణపై స్పష్టత ఉందని చేస్తామని ఆనాడు ప్రధాని హామినిచ్చారని గుర్తు చేశారు. ప్రధాని హామినిచ్చిన మూడు సందర్భాల్లో నూ కిషన్ రెడ్డి సాక్షిగా ఉన్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఆలస్యం చెయ్యకుండా సమస్యను పరిష్కరించాలని కోరారు. జాప్యం జరిగితే, దక్షిణాదిలో మాదిగలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసిన పార్టీగా బిజెపి మిగులుతుందని, దళితుల్లో ఏ వర్గం కూడా బిజెపిని విశ్వసించే పరిస్థితి ఉండదని మంద కృష్ణ మాదిగ అన్నారు. విశ్వరూప మహాసభ ఆగస్ట్ రెండో వారంలో హైదరాబాద్ శివారులో జరుగుతుందన్నారు. దక్షిణాదిలో మాదిగలను సమీకరిస్తామని, నభూతో నభవిష్యత్ అనే విధంగా విశ్వరూప మహాసభ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. రానున్న సమావేశాల్లో బిల్లు పెట్టకపోతే బిజెపికి వ్యతిరేకంగా దళితులను ఏకం చేస్తామని హెచ్చరించారు. కిషన్ రెడ్డి బాధ్యత నెరవేర్చకపోతే ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తామన్నారు. వర్గీకరణకు లక్ష్మణ్, ఈటెల అందరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ, ఎంఎస్‌పి జాతీయ నాయకులు రాగటి సత్యం మాదిగ, మంద కుమార్ మాదిగ, తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షులు సోమ శేఖర్ మాదిగ, ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రామారపు శ్రీనివాస్ మాదిగ,ఎంఎస్‌పి రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ, జిల్లా ఇంఛార్జి విఎస్ రాజు మాదిగ, ఎంఆర్‌పిఎస్ నాయకులు గణేష్ మాదిగ, జాతీయ నాయకులు బిక్కి మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.