Wednesday, January 22, 2025

ట్రిపుల్ ఐటి సమస్యకు పరిష్కారం

- Advertisement -
- Advertisement -

The solution to the Basara IIIT problem

 

మన తెలంగాణ/బాసర/భైంసా: బాసర ట్రిపుల్ ఐటీలో ఐదు రోజులుగా విద్యార్థులు ఆందోళన బాటపట్టడంతో శనివారం సాయంత్రం దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డిలు ఆందోళన చేస్తున్న విద్యార్థులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యేతోపాటు కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీష్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులతో సుదీర్ఘంగా చర్చలు జరిపామని, సోమవారం నుంచి విద్యార్థులు తరగతులకు హాజరువుతామని హామి ఇచ్చారని.. తరగతులు సజావుగా సాగితే సమస్యలన్నీ పరిష్కరమవుతాయన్నారు. అంతేగాకుండా విద్యార్థులు ఐటీ శాఖ మంత్రి కెటిఆర్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిలు ట్విటర్‌లో హామి పత్రం ఇస్తారని చెప్పారు.

ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేసింది తామేనని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపైనే ఉందని మంత్రి అల్లోల అన్నారు. ట్రిపుల్ ఐటీలో వైస్ చాన్సలర్‌ను నియమించేందుకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని అయితే తాత్కాలికంగా డైరెక్టర్‌ను నియమించామని మంత్రి చెప్పారు. 15,20 రోజుల్లో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఇదిలా ఉండగా, విద్యార్థులతో మంత్రి అల్లోల జరిపిన చర్చల్లో సానుకూల స్పందన రాలేదన్నట్టుగా విద్యార్థుల తీరు ఉంది. రేపటి నుంచి వారు ఏవిధంగా వ్యవహరిస్తారోనన్నది వేచి చూడాల్సిందే.

ఆందోళన విరమించని ట్రిపుల్ ఐటి విద్యార్ధులు

సర్కార్ సీరియస్, ఎవోపై వేటు

బాసర ట్రిపుల్ ఐటి ఎవో రాజేశ్వరరావుపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాహుల్ బొజ్జా వేటు వేస్తూ శనివారం ఉత్తర్యులిచ్చారు. తమ సమస్యల పరిష్కారంపై ట్రిపుల్ ఐటి విద్యార్థులు గత ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ అయింది. గత రెండ్రోజుల క్రితం విద్యార్థులతో పాటు స్థానికులు ట్రిపుల్ ఐటి నిర్వహణ తీరుపై ఏకంగా మంత్రి కెటిఆర్‌కు ట్వీట్ల ద్వారా ఫిర్యాదు చేశారు. కెటిఆర్ ఆదేశాలతో అప్రమత్తమైన విద్యాశాఖ వెనువెంటనే అదే రోజు హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో పాటు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముదోల్ ఎంఎల్‌ఎ విఠల్‌రెడ్డితో పాటు యూనివర్సిటీ ఉన్నతాధికారులు, ఉన్నత విద్యాశాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

ట్రిపుల్ ఐటి నిర్వహణ తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని తక్షణమే ట్రిపుల్ ఐటి అడ్మినిస్ట్రేటివ్ అధికారి రాజేశ్వరరావుపై వేటు వేశారు. శనివారం రాత్రి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంఎల్‌ఎ విఠల్‌రెడ్డితో పాటు రెండ్రోజుల క్రితమే యూనివర్సిటీ డైరెక్టర్‌గా నియమించిన సతీష్‌కుమార్, ఉన్నత విద్యాశాఖ అధికారులు విద్యార్థులతో చర్చించారు. ఆందోళన విరమించి సోమవారం నుంచి తరగతులకు హాజరు కావాలని సూచించారు. సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టమైన హామీనిచ్చారు. అయినప్పటికీ విద్యార్థులు ఆందోళన విరమించమని విజ్ఞప్తి చేసినా ఒప్పుకోకపోవడంతో ఎవోపై వేటు వేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News