- గట్టిప్పలపల్లిలో 38 రోజులుగా దీక్షలు
- ఇర్విన్ మండలం ఏర్పాటుతో ఉద్యమాన్ని ఉధృతం చేసిన గ్రామస్తులు
కల్వకుర్తి రూరల్: కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండల పరిధిలోని గట్టిప్పలపల్లి గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ రోజురోజుకు ఉధృతం అవుతుంది. ప్రత్యేక మండలం ఏర్పాటు చేయాలని గ్రామ జేఏసి ఆధ్వర్యంలో గత 38 రోజులుగా దీక్షలు చేపడుతున్నారు. గ్రామ జేఏసి నాయకులు అన్ని రాజకీయ పార్టీలను కలుస్తూ తమ డిమాండ్‌ను ప్రభుత్వానికి, ప్రతిపక్ష వర్గాలకు విన్నవిస్తూ పలు రకాల నిరసనలు తెలుపుతున్నారు.
ప్రత్యేక మండల ఏర్పాటు కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులకు వినతులు అందజేస్తూ ప్రత్యేక మండల ఉద్యమాన్ని రోజు రోజుకు ఉధృతం చేస్తున్నారు. గట్టిప్పలపల్లి ప్రత్యేక మండలం జేఏసి కన్వీనర్ జయమ్మ వెంకటేష్, ఎంపిటిసి శ్రీనివాస్, దామోదర్, రేణురెడ్డి తదితరులు ప్రత్యేక మండలం కోసం కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇర్విన్ మండల ఏర్పాటుతో ఊపందుకున్న గట్టిప్పలపల్లి మండల డిమాండ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మాడ్గుల మండల పరిధిలోని ఇర్విన్ గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేసింది. మాడ్గుల మండలంలో మొత్తం 14 ఎంపిటిసి స్థానాలు ఉన్నాయి. అందులో 7 ఎంపిటిసిలు ఇర్విన్‌కు కేటాయించి ఇర్విన్‌ను ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేశారు. అలాగే తలకొండపల్లి మండలంలో మొత్తం 10 ఎంపిటిసి స్థానాలు ఉన్నాయి. అందులో గట్టిప్పలపల్లి మండలానికి ఎంత మంది ఎంపిటిసిలు మద్ధతు ఇస్తున్నారు అనే దానిపై మండల ఏర్పాటు ఆధారపడి ఉందని పలువురు పేర్కొంటున్నారు.
మండల ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం : తక్కెలపల్లి రాజేందర్
గట్టిప్పలపల్లి గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఎంఆర్‌పిఎస్ నాయకులు తక్కెలపల్లి రాజేందర్ అన్నారు. మండల ఏర్పాటు జేఏసి కమిటీ ఆధ్వర్యంలో పలువురు ప్రజా ప్రతినిధులను కలిశామని, న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం స్వీకరించి మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు.
మండలానికి కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయి: బిఆర్‌ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి
గట్టిప్పలపల్లి గ్రామానికి, మండలానికి కావాల్సిన అన్ని వసతులు, అర్హతలు ఉన్నాయని బిఆర్‌ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రజా ప్రతినిధులు సానుకూలంగా స్పందించి మండలాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
బ్యాంక్ వసతి కల్పించాలి: బిఆర్‌ఎస్ నాయకులు శరత చంద్ర
తలకొండపల్లి మండలంలోనే గట్టిప్పలపల్లి గ్రామం పెద్దదని గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ నాయకులు శరత్ చంద్ర తెలిపారు. మండలంతోపాటు గ్రామంలో బ్యాంక్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.