తెలంగాణ కాంగ్రెస్‌లో చేతిలో మరోసారి మోసపోయింది.
రాష్ట్ర వ్యాప్తంగా పథకాల అమలుపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 100 రోజుల గడుస్తున్న ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. మరోసారి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ చేతిలో మోస పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ’ పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మోసాలను డిజిటల్ ప్రచారం ద్వారా ప్రజలకు వివరిస్తామని తెలిపారు. పేదలకు నెలకు రూ. 2500 ఇస్తామని హామీ ఇప్పటివరకు ఆపథకం ఊసేలేదని, ఉచిత విద్యుత్ పూర్తిగా అమలు చేయకుండా కొత్తమందికి ఇచ్చి నిజమైన అర్హులకు ఆన్యాయం చేసిందని మండిపడ్డారు. రైతులకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి మాట తప్పిందని, పేద వారికి ఇళ్లు ఇస్తామని అట్టహాసంగా ప్రకటించి ఎలా ఇస్తారో విధి విధానాలు ఇప్పటివరకు చెప్పడం లేదన్నారు.
మాజీ సిఎం కెసిఆర్ కుటుంబాన్ని గద్దె దించడంలో నిరుద్యోగుల పాత్ర పెద్దదని, ఆ నిరుద్యోగులకు కూడా కాంగ్రెస్ ఈ వంద రోజుల పాలనలో వెన్ను పోటు పొడిచిందని ఆరోపించారు. కళాశాల బాలికలకు స్కూటీలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం తప్పించుకుందన్నారు. వంద రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని, పేదలకు నెల వారీ పింఛన్లు రూ. 2 వేల పెన్షన్ రూ.4 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు వారి ఖాతాలో జమ చేయలేదన్నారు. అధికారం చేపట్టగానే అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు వాటి గురించి మాట్లాడటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం గత ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా ఇస్తోందని పేర్కొన్నారు. ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ఎన్నో పథకాలు ఇస్తామని చెప్పారు కానీ వాటిని అమలు చేయలేదని విమర్శించారు. అందుకే బిజెపి తెలంగాణను ప్రశ్నిస్తుందని, ఎవరైతే ఈ గ్యారెంటీల్లో మోసపోయారో వారందరినీ కలుస్తామని తెలిపారు.
తెలంగాణా ప్రజల తరుపున తమ పార్టీ నిలబడి ప్రశ్నిస్తుందని పేర్కొన్నారు. అదే విధంగా బిఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పిస్తూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు చేయడం కోసం ప్రజలు అనేక త్యాగాలు చేశారని, అనేక బలి దానాలు త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ గత 10 సంవత్సారాలు కెసిఆర్ చేతిలో బంది అయ్యిందని ఆరోపించారు. అరాచకాలకు తెలంగాణ సమాజం ఏ రకంగా ఇబ్బంది పడిందో అందరికీ తెలుసునని, ధర్నా చౌక్ లో ధర్నా చేయడానికి కూడా అవకాశం లేకుండా చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం గజ్జె కట్టిన వారే కెసిఆర్ విస్మరించారన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన పూర్తి చేసుకుందని, కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు వచ్చి గ్యారెంటీలు ప్రకటించారని, కానీ ఆ గ్యారెంటీలకు గ్యారెంటీ లేకుండా పోయిందని విమర్శించారు.