Friday, November 22, 2024

ఎఐటియుసి విజయం సింగరేణి కార్మికుల మనస్సాక్షిని ప్రతిబింబిస్తోంది

- Advertisement -
- Advertisement -

ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎండి.యూసఫ్, ఎస్. బాలరాజ్

మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి కాలరీస్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎఐటియుసి విజయం సింగరేణి కార్మికుల మనస్సాక్షిని ప్రతిబింబిస్తుందని ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎండి. యూసఫ్, ఎస్. బాలరాజ్ లు పేర్కొన్నారు. సింగరేణి కాలరీస్‌లో కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న యూనియన్‌లను తిరస్కరించి, ఎఐటియుసిని గెలిపించినందుకు సింగరేణి కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి కాలరీస్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎఐటియుసి విజయం సాధించిన సందర్బంగా హైదరాబాద్, హిమాయత్ నగర్, ఎఐటియుసి రాష్ట్ర కార్యాలయం, సత్యనారాయణ రెడ్డి భవన్ వద్ద గురువారం ఎఐటియుసి నేతలు, కార్యకర్తలు, కార్మికులు బాణాసం చాలు పేల్చి, మిఠాయిలు పంచి విజయోత్సవాలు జరుపుకున్నారు.

ఈ సందర్బంగా ఎండి.యూసఫ్ మాట్లాడుతూ బొగ్గు గనుల్లో కార్మికులు పడుతున్న కష్టాలు భరించలేనివని, బూర్జువా యూనియన్ ల కార్మిక వ్యతిరేక వైఖరి కారణంగా వాటిని తిరస్కరించి తమకు నిజమైన పోరాట శక్తి ఎఐటియుసియేనని గుర్తించి ఎఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్‌ను గెలిపించారని తెలిపారు. గత పది సంవత్స రాలుగా గుర్తింపు పొందిన సంఘం ప్రభుత్వాలకు, యాజమాన్యానికి తొత్తులుగా మారి, కార్మికుల సమస్యలను ఫుర్తిగా విస్మరించిందని అయన విమర్శించారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతరేకంగా దేశవ్యాప్తంగా ఎఐటియుసి పెద్దఎత్తున పోరాటాలు చేస్తుందని అయన గుర్తు చేశారు. పని భారం, ప్రతీకార చర్యలతో సహా అనేక అసమానతలను ఎదుర్కుంటున్న సింగరేణి కార్మికులకు అండగా ఎఐటియుసి ఉంటుందని ఎం.డి. యూసఫ్ భరోసా ఇచ్చారు. ఎస్. బాలరాజ్ మాట్లాడుతూ కార్మికులకు మెరుగైన పని పరిస్థితులు, వేతనాలు, సామాజిక భద్రత కల్పించడం, గనుల ప్రైవేటీకరణ కు వ్యతరేకంగా ఎఐటియుసి ముందుండి పోరాడుతుందన్న విశ్వాసంతో సింగరేణి కార్మికులు ఎఐటి యుసి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్‌కు విజయాన్ని అందించారని తెలిపారు.

సింగరేణి బొగ్గు గని కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యల పరిష్కారానికి, గని కార్మికుల హక్కులు, సంక్షేమానికి ఎఐటియుసి గట్టిగా కృషి చేస్తుందని చెప్పారు. గనుల ప్రైవేటీకరణపై ఆందోళనలు తీవ్రతరం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని ఎస్.బాలరాజ్ హెచ్చరించారు. ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ మాట్లాడుతూ ఎఐటియుసి గని కార్మికుల సమస్యలను వాస్తవికంగా పరిష్కరించేందుకు కృషి చేస్తుందన్నారు. సింగరేణిలో శ్రమ దోపిడీ తారాస్థాయికి చేరుకుందని, దీనితోపాటు సింగరేణి ప్రైవేటీకరణతో ఉద్యోగ భద్రత పోతుందని కార్మికులు ఆందోళన చెందుతున్నారని అయన తెలిపారు. ప్రైవేట్ చేతుల్లో బొగ్గు గనులను అప్పగించే విధానాన్ని ఎఐటియుసి అడ్డుకుంటుందని, గని కార్మికుల ఉద్యోగ భద్రత కోసం బలమైన పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎఐటియుసి సీనియర్ నాయకులు ఉజ్జిని రత్నకర్ రావు, ఎఐటియుసి రాష్ట్ర కార్య దర్శి బి.వెంకటేశం, ఆర్‌టిసి ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ.వెంకన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న గౌడ్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి. నరసింహ రెడ్డి, వెంకటరాజం, సివిల్ సప్లైస్ హమాలీస్ యూనియన్ ఉపాధ్యక్షులు జక్రయ్య, నరసింహ, ఎఐటియుసి హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పి. వెంకటయ్య, ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్. జంగయ్య, నేతలు ఏ. బిక్షపతి యాదవ్, ఎస్.కె. లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News