Sunday, December 22, 2024

గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో చర్చించాలి

- Advertisement -
- Advertisement -

విద్యార్థుల మృతికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించాలి
మృతుల కుటుంబాలకు రూ. కోటి ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్:  ప్రభుత్వ సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లో జరుగుతున్న వరుస ఆత్మహత్యలకు సిఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం డిఎస్‌ఎస్ భవన్ ఎదుట గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలపై ఆపార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే విద్యాసంస్థల్లో చదువుతున్న 60 లక్షల మంది పేద విద్యార్థులు బాల్యంలోనే సమాధులయ్యే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని విమర్శించారు. ఉన్నత విద్యావంతులు కావాల్సిన పేద విద్యార్థులు ఉరితాళ్లకు బలవుతున్నారన్నారు. విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ముఖ్యమంత్రిని ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి స్పందించి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలన్నారు. గురుకులాలు జైలు కన్నా దారుణంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య,భోజనం,వసతులు అందడం లేదన్నారు. గత ప్రభుత్వం విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచుతామన్న హామీ ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు.గత ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసినట్లే కొత్త ప్రభుత్వం కూడా చేస్తుందని విమర్శించారు. మృతుల తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న ప్రభుత్వ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు.
గురుకులాల ఉద్యోగులకు జీతాలు రాకపోవడం శోచనీయమన్నారు.సంక్షేమ శాఖలకు మంత్రులు లేకపోతే లక్షలాది మంది విద్యార్థులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు మంత్రులను ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. కేవలం డబ్బున్న శాఖలకే మంత్రులను కేటాయిస్తారా, పేదల సంక్షేమం ముఖ్యమంత్రికి పట్టదా? అని ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీల కంటే, సంక్షేమ గురుకులాల్లో చదివే పేద బిడ్డల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.

ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ ఆర్య, సికింద్రాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి తూర్పు, పడమర, యాదాద్రి జిల్లా రుద్రవరం సునీల్, చరణ్ దాస్, లింగం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News