కారేపల్లి : కారేపల్లి మండలంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి ఎండ వేడిమి భరించలేక ఉక్కపోతతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ఏం చేయాలో తోచక ప్రజలు బిక్కుబిక్కుమంటూ బయటకు వెళ్లలేక ఇళ్లలోనే గడుపుతున్నారు. నిప్పుల కుంపటిని తలపింస్తుండటంతో ప్రజలు బయటకు రావాడానికి భయపడుతున్నారు. కారేపల్లి మండల కేంద్రంతో పాటు, ప్రధాన రహదారులు, గ్రామాల్లోని వీధులు సైతం జన సంచారం, వాహన సంచారం లేక నిర్మానుష్యంగా మారిపోయాయి.
జూన్ నెలలో ప్రస్తుతం మృగశిర కార్తె ఆరంభమైనప్పటికీ ఈ సరికే వర్షాలు బాగా కురిసి రైతులు వ్యవసాయ పనులు చేసుకునే సమయం ఆసన్నమైనప్పటికీ ఇంకా ఎండ తీవ్రత ఉండడం పట్ల రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎండ వేడిని తట్టుకోవడానికి ప్రజలు బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉంటూ ఫ్యాన్ లను, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. దాహం తీర్చుకునేందుకుగాను కొబ్బరి బోండాలను, పుచ్చకాయలను, శీతల పానీయాలను సేవిస్తున్నారు.
ఉష్ణోగ్రతలు ఇంకా ఎప్పుడు తగ్గుతాయో అని, వాతావరణం ఎప్పుడు చల్లబడి తమ వ్యవసాయ పనులు ప్రారంభించాలి అని రైతులు వాపోతున్నారు. ఏదైనా ఒక వర్షం కురిసి వాతావరణం చల్లబడితే తమ ప్రాణాలకు హాయిగా ఉంటుందని మండల ప్రజలు అంటున్నారు.