పెద్దేముల్: సర్వేయర్ శ్రీహరి వ్యవహార శైలితో సామాన్య ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఆయన మండలానికి ఎప్పుడు వస్తాడో.. ఎప్పుడు వెళ్తాడో తెలియని గందగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సర్వేకు కట్టిన రైతులు నిత్యం తహసీల్ధార్ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్నారు. అయినప్పటికీ రైతుల పట్ల సర్వేయర్ మాత్రం కనికరించడం లేదు. మండల కేంద్రానికి చెందిన రాజురెడ్డి తన తల్లి నర్సమ్మ పేరు మీద ఉన్నటువంటి 7 ఎకరాల భూమిని సర్వే చేయాలని 28 మార్చి 2023 నాడు సర్వేకు కట్టారు.
ఈ రైతు సర్వేకు కట్టికూడా సుమారు మూడు నెలలు దాటిపోయింది. అయినప్పటికీ సర్వే చేయడానికి సర్వేయర్ మాత్రం రావడం లేదు. సదరు వ్యక్తికి తహసీల్ధార్ కార్యాలయానికి వెళ్ళిన ప్రతిసారి సర్వేచేయడానికి సర్వేయర్ వచ్చే తేదిని ఇస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం సర్వేకు రావడం లేదు. దీంతో తల్లికొడుకులు నిత్యం కార్యాలయానికి వచ్చిపోతున్నారు. వీరికి ఇప్పటికే పలుమార్లు పలు తేదిలను కెటాయించి వస్తామని చెప్పి రాలేదని రైతు వాపోయారు. ఇప్పుడు ఈనెల 7న వస్తామని మరోతేదిని ఇచ్చినట్లు సమాచారం.
మరి ఇప్పుడైనా సర్వేకు వస్తారా.. లేదా అనేది వేచిచూడాలి. ఇదే మాదిరిలో తమ భూములను సర్వేచేయాలని నిత్యం ఐదారుగురు తహసీల్ధార్ ఆఫీస్‌కు వచ్చిపోతునే ఉన్నారు. అయినప్పటికి సర్వేయర్ కనుకరించకుండా మండలంలో అందుబాటులో ఉండటం లేదు. ప్రజలు ఈ విషయాన్ని తహసీల్ధార్ కార్యాలయంలో ఉద్యోగుల దృష్టికి తీసుకొస్తే.. సర్వేయర్ తమకే స్పందించడం లేదని బదులిస్తున్నారు. దీనిని బట్టి సర్వేయర్ పరిస్థితి ఎందనేది అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి మండలంలో ఇప్పటి వరకు సర్వేకు కట్టిన రైతుల భూములను తక్షణమే సర్వేచేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.