Thursday, January 23, 2025

జూలై చివరినాటికి మహబూబ్‌నగర్‌లో సస్పెన్షన్ బ్రిడ్జి ప్రారంభం

- Advertisement -
- Advertisement -
పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడి

హైదరాబాద్ : మహబూబ్‌నగర్‌లోని మినీ ట్యాంక్ బండ్‌లో చేపట్టిన సస్పెన్షన్ బ్రిడ్జిని ఈ నెలాఖరు నాటికి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం అయన రాష్ట్ర పర్యాటకశాఖ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, సస్పెన్షన్ బ్రిడ్జి కన్సల్టెంట్ పతంజలి భరద్వాజ , మున్సిపల్ చైర్మన్ కే.సీ నరసింహులు ,పర్యాటకశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మహబూబ్‌నగర్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులను తనిఖీ చేశారు. దాదాపుగా సస్పెన్షన్ బ్రిడ్జి పనులన్నీ పూర్తయ్యాయని, ఈ నెలాఖరు నాటికి సస్పెన్షన్ బెడ్జిని ప్రారంభిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో మహబూబ్‌నగర్‌లో పెద్ద ఎత్తున పర్యాటక పనులను చేపట్టడం జరిగిందని, శిల్పారామంలో అతిపెద్ద జాయింట్ వీల్,థీమ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు .ఇటీవల వారం రోజుల తాను దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా తిలకించిన పర్యాటక సౌకర్యాలను శిల్పారామం, ట్యాంక్ బండ్‌లో ఇంకా అధునాతన పద్ధతిలో కల్పించనున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రణాళికను కూడా రూపొందించినట్లు మంత్రి తెలిపారు. మహబూబ్ నగర్ పట్టణాన్ని అత్యంత సుందరపట్టణంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని, పనులన్నీ పారదర్శకంగా నిర్వహించడం జరుగుతున్నదని వెల్లడించారు.

ప్రతి ఒక్కరు ఇందులో పాలుపంచుకోవాలని, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని కోరారు. ఐలాండ్ గ్లోగార్డెన్ పనులు కూడా శర వేగంగా కొనసాగుతున్నాయని, సస్పెన్షన్ బ్రిడ్జికి రోప్‌ను దక్షిణ కొరియా నుండి తీసుకురావడం జరిగిందని, అలాగే దక్షిణ కొరియాలోని చిల్డ్రన్స్ పార్క్ తరహా శిల్పారామంలో అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. శిల్పారామంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా వార్ మెమోరియల్, చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేయనన్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి శిల్పారామం రక్షణ గోడ వెంట ఏర్పాటు చేయనున్న వార్ మెమోరియల్, జాయింట్ వీల్, చిన్నపిల్లల అమ్యూజ్మెంట్ పార్కు, ఇతర సౌకర్యాలపై రూపొందించిన త్రీడి సిడిని తిలకించారు.

శిల్పారామాన్ని పూర్తి స్థాయిలో తీర్చి దిద్దుతామని, చేతివృత్తులు, కేఫటేరియ, ఫుడ్ కోర్టులు, వీటన్నింటితో పాటు, చిన్నపిల్లలతో పాటు, పెద్దవారికి వినోదం కలిగించే విధంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇటీవలే దక్షిణ కొరియాలో పర్యటించడం జరిగిందని, కరీంనగర్, మానేరు రివర్ ఫ్రంట్, కొండపోచమ్మ సాగర్ తదితర ప్రాంతాలలో దక్షిణ కొరియా తరహా పర్యాటక అభివృద్ధిని చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.

మహబూబ్‌నగర్‌లో ఇండోర్ స్టేడియం కూడా పూర్తయినందున త్వరలోనే జాతీయస్థాయి క్రీడలను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇదివరకే కెసిఆర్ పార్కులో జంగిల్ సఫారీ ఏర్పాటు చేశామని, ఇక్కడ చదువుకున్న యువతకు ఇక్కడే ఉపాధి కల్పించి వారికి ఉపాధి కల్పించే విధంగా ఐటి పార్క్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా నిర్మాణంలో ఉందని, మహబూబ్‌నగర్‌కు ఎట్టి పరిస్థితుల్లో వెనకటి కష్టాలు రాకూడదన్నది తమ అభిమతమని, అందువలన ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి పట్టణాభివృద్ధికి సహకరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఎండి మనోహర్, మున్సిపల్ చైర్మన్ కెసి నర్సింహులు, చిల్డ్రన్స్ పార్క్ కన్సల్టెంట్ బజరంగ్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News