Sunday, January 19, 2025

టార్గెట్ 370 సీట్లు

- Advertisement -
- Advertisement -

బిజెపి శ్రేణులకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు

వ్యూహ రచనపై పలు సూచనలు

న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికలలో పార్టీ ప్రచార వ్యూహం రూపకల్పన చేయాలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి, నిరుపేదల అనుకూల సంక్షేమ పథకాలు, ప్రపంచం దృష్టిలో భారత్ ఖ్యాతిని పెంచే చర్యలపై దృష్టి కేంద్రీకరిస్తూ పార్టీ వ్యూహ రచన చేయాలని ప్రధా ని మోడీ పిలుపు ఇచ్చారు. 370 సీట్లు గెలవడం పార్టీ కీలక సిద్ధాంతకర్త శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి నిజమైన నివాళి అవుతుందని మోడీ ఉద్ఘాటించారు. బిజెపి జాతీయ సదస్సు ప్రారంభానికి ముందు పార్టీ జాతీయ కార్యనిర్వాహక వర్గ సభ్యుల సమావేశంలో మోడీ ప్రసంగిస్తూ, ప్రతి పార్టీ కార్యకర్త వ-చ్చే 100 రోజులలో పోలింగ్ కేంద్రాలపై దృష్టి కేంద్రీకరించాలని, 2019లో కన్నా ప్రతి పోలింగ్ కేంద్రంలో పార్టీ కి కనీసం 370 సీట్లు అధికంగా వచ్చేలా కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.

రానున్న లోక్‌సభ ఎన్నికలు ఆ 100 రోజుల్లోగా పూర్తి అయ్యే అవకాశం ఉందని ఆయన ఉద్దేశం. మోడీ ప్రసంగంపై విలేకరులకు బిజెపి ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్‌డే వివరిస్తూ, ప్రతిపక్షాలు ‘తు తు మై మై’ (క్షుద్ర వాగ్వాదం), అవాంఛిత, విభజనవాద సమస్యలను లేవదీయవచ్చునని, కాని పార్టీ కార్యకర్తలు తమ దృష్టి మరల్చకుండా అభివృద్ధి అజెండానే ప్రధానంగా ప్రస్తావించాలని స్పష్టం చేశారని తెలియజేశారు. ‘370 బిజెపికి కేవలం ఒక సంఖ్య కాదు. అది ప్రగాఢ సెంటిమెంట్‌కు ప్రతీక. మన దేశం సమైక్యతను, సమగ్రతను పరిరక్షించేందుకు 370 అధికరణం రద్దు కోసం ముఖర్జీ ప్రాణ త్యాగం చేశారు. ఆయనకు నిజమైన నివాళిగా బిజెపి 370 సీట్లలో విజయం సాధించాలి’ అని మోడీ చెప్పారు. పూర్వపు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేసిన 370 అధికరణాన్ని మోడీ ప్రభుత్వం రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 ఆగస్టులో రద్దు చేసిన విషయం విదితమే. లోక్‌సభలో 543 సీట్లు ఉన్నాయి.

బిజెపి 2014లో 282 సీట్లు, 2019లో 303 సీట్లు గెలుచుకున్నది. బిజెపి సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) 400 పైచిలుకు సీట్లు గెలుపొందాలని మోడీ లక్షం నిర్దేశించారు. ‘బిజెపి ఫర్ ఇండియా జాతీయ ఆఫీస్ బేరర్లను ఉద్దేశించి ప్రసంగించాను. ప్రజల సేవకు వారు సాగిస్తున్న అసాధారణ కృషికి ప్రతి పార్టీ కార్యకర్తను అభినందించా. సమాజంలోని అన్ని వర్గాలకు మా పార్టీ దిగువ స్థాయి కార్యకర్తల అనుసంధానానికి మార్గాలను చర్చించా. గడచిన దశాబ్దిలో బిజెపి అభివృద్ధి, సత్పరిపాలన పార్టీగా ఒక ముద్ర వేసింది. మా పథకాలు, చొరవలు, సంస్కరణలు పలు జీవితాలను మార్చివేశాయి’ అని మోడీ ఆ తరువాత ‘ఎక్స్’ పోస్ట్‌లో వివరించారు. మోడీ 12 ఏళ్లకు పైగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండడంతో పాటు సుమారు 23 ఏళ్లు ప్రభుత్వ అధినేతగా ఉన్నారని, అవినీతి ఆరోపణలు ఒక్కటీ రాలేదని తావ్‌డే గుర్తు చేశారు. ‘అది ఆరోపణల రహిత, వికాస సహిత కాలం’ అని తావ్‌డే ప్రధానిని ఉటంకిస్తూ పేర్కొన్నారు. రాజ్యాంగ పదవులలో అంత సుదీర్ఘ కాలం ఉన్నవారు ఎవరూ ఎటువంటి కళంకానికీ గురి కాని సందర్భం లేదు అని తావ్‌డే అన్నారు.

ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరగవచ్చునని భావిస్తున్నందున ఎన్నికల కోసం తమ అభ్యర్థులను బిజెపి రానున్న వారాలలో ప్రకటించే అవకాశం ఉండడంతో పార్టీ పోటీ చేసే ప్రతి స్థానంలో ‘కమలం’ తమ అభ్యర్థి అన్నది పార్టీ సభ్యులు దృష్టిలో పెట్టుకుని, విజయం కోసం కృషి చేయాలని మోడీ కోరారు. ఈ నెల 25 నుంచి మార్చి 5 వరకు వివిధ కేంద్ర పథకాల లబ్ధిదారులకు అందుబాటులో ఉండేలా ఒక ప్రచార కార్యక్రమాన్ని పార్టీ ప్రారంభిస్తుందని తావ్‌డే తెలియజేశారు. మోడీ నాయకత్వానికి అభివృద్ధి పట్ల అంకితభావం, భావోద్వేగ మదుపు, అకుంఠిత దీక్ష సంకేతాలని ఆయన పేర్కొన్నారు. మోడీ సారథ్యం వహించిన ‘పరివర్తనాత్మక’ విధానాలు, కార్యక్రమాలు మొత్తం జాతికి గర్వకారణమని తావ్‌డే అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News