పొగతాగే అలవాటున్నవారిలో కొవిడ్ ముప్పు తీవ్రత 50 శాతం ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అందుకే పొగాకు వ్యసనాన్ని విడిచిపెట్టడమే శరణ్యమని పిలుపునిచ్చింది. ఈమేరకు భారత్‌తోపాటు 29 దేశాల్లో ప్రత్యేక కార్యాచరణను ప్రతిపాదించింది. పొగాకు వినియోగం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఏటా 82 లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనావేసింది. ప్రపంచంలో 110 కోట్ల మంది ధూమపాన ప్రియులుండగా, భారత్‌లో వారి సంఖ్య 10.6 కోట్ల వరకు ఉంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ధూమరహిత పొగాకు ఉత్పత్తుల వాడకం దారులు దాదాపు 37 కోట్ల మందిలో 20 కోట్ల మంది భారత్ లోనే ఉన్నారు. నికొటిన్‌తోపాటు ఏడు వేల రకాల విషతుల్యాలకు నెలవైన పొగాకు వినియోగం వల్ల క్యాన్సర్లు, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు చెలరేగుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యాధుల జాబితాకు కొవిడ్ రిస్కు తోడవుతోంది. 2030 నాటికి పొగాకు సంబంధిత మరణాలు అత్యధికంగా భారత్ లోనే నమోదవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కరోనా మహమ్మారి కన్నా భారీ సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలిగొంటున్న నమిలే పొగాకు ఉత్పత్తులను నిషేధించాల్సిందేనని ఏడాది క్రితం తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఉద్ఘాటించింది. ఆహార భద్రత ప్రమాణాల చట్టం కింద పొగాకు ఉత్పత్తులను గత ఎనిమిదేళ్ల నుంచి దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిషేధిస్తున్నా గుట్కా వినియోగం మాత్రం తగ్గడం లేదు.
పొగరాయుళ్లలో కొవిడ్ ముప్పు
- Advertisement -
- Advertisement -
- Advertisement -