Wednesday, January 22, 2025

ఎన్నికల్లో అభ్యర్థుల లావాదేవీలపై నిరంతరం నిఘా పెట్టాలి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్:  లోక్‌సభ ఎన్నికల్లో డబ్బు ప్రభావానికి అడ్డుకట్ట వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల నుంచి రూ.లక్ష దాటిన లావాదేవీలపై నిఘా ఉంచాలని రాష్ట్రాలకు ఇసి లేఖ రాసింది. బ్యాంకు ఖాతాల నుంచి విత్‌డ్రా, డిపాజిట్ల వివరాలపై ఆరా తీయాలని అధికారులు సూచించారు. దేశవ్యాప్తంగా లోక్ సభతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లేఖ రాశారు. జిల్లా ఎన్నికల అధికారులు అన్ని బ్యాంకుల నుంచి రూ.లక్షకు పైగా లావాదేవీల వివరాలను తీసుకురావాలి. వాటిని విశ్లేషించే బాధ్యత సంబంధిత సిబ్బందికి అప్పగించాలని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఒకే బ్యాంకు శాఖ నుంచి వివిధ బ్యాంకులకు నగదు బదిలీ అవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.

ఓటర్లను ప్రభావితం చేసేందుకు వివిధ మార్గాల ద్వారా నగదు లావాదేవీలు చేపట్టే అవకాశం ఉందని, రాజకీయ పార్టీల ఖాతాల నుంచి తీసుకునే లావాదేవీలను పర్యవేక్షించాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి బ్యాంకు ఖాతాల నుంచి అతని భార్య, అభ్యర్థిపై ఆధారపడిన వ్యక్తి లక్షకు పైగా లావాదేవీలను అఫిడవిట్‌లో నమోదు చేయాలన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌లో వివరాలను అందుబాటులో ఉంచాలని, ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రెండు నెలల ముందు జరిగిన లావాదేవీలను నిశితంగా పరిశీలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. రూ. 10 లక్షల కంటే ఎక్కువ నగదు ఉపసంహరణ, డిపాజిట్‌ను ఖచ్చితంగా పర్యవేక్షించాలి. సంబంధిత వివరాలను ఆదాయపు పన్ను శాఖ నోడల్ అధికారులకు అందజేయాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో ఇసి పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News