Monday, January 27, 2025

భిన్న లైంగికత్వాల సాహిత్యం

- Advertisement -
- Advertisement -

కేరళలో జరిగిన ఒక సాహిత్య సమావేశానికి వెళ్ళినప్పుడు, మొదటిసారి రేవతిని చూశాను. చక్కటి నేత చీరలో, ఎత్తుగా గంభీరంగా కనిపిస్తున్న ఆమె కొంచెం బిడియంగా కూడా ఉంది. మొదటి రోజే భోజనాల బల్ల దగ్గర మేము కలిసి భోజనం చేస్తున్నప్పుడు మా మధ్య మాటలు కలిసాయి. ఆ మూడు రోజుల సదస్సులో మేము కలిసి తిరుగుతున్నప్పుడు, కష్టభరితమైన తన జీవితం గురించి చెబుతూ, ఆమె సాహిత్యంలోకి అనుకోకుండా ఎలా వచ్చిందో కూడా చెప్పింది.
ఆమె జీవన సంక్లిష్టత మెల్లిగా అర్థం అవుతూ, నా కళ్ళు చెమర్చాయి. ఎంత హింసను, వేదనను తను, తన లాంటి వాళ్లు భరించారో, ఇంకా భరిస్తున్నారో చెప్పేందుకు మనకి భాష లేదు ఇంకా. రేవతి ఇప్పుడు తన ఆత్మకథని, ఇలాంటి వాళ్ళ జీవితాలను జనానికి అర్థం చేయించడానికి ధియేటర్‌ను మాధ్యమంగా ఎంచుకుంది. ఆమె ఆంగ్ల పుస్తకం ద ట్రూత్ అబౌట్ మీ: ఏ హిజ్రా లైఫ్ స్టోరీ, ఆ సమావేశంలోనే నాకు ఇచ్చింది. అది చదువుతున్నప్పుడు ఉద్వేగం, కన్నీళ్లు కలిసిన చెప్పరాని బాధ ఏదో నాకు కలిగింది.
ఎవరికీ చెందని మానవులు అనే ముద్ర వేయబడిన వాళ్ళు కూడా ఉంటారు ఈ లోకంలో. పోనీ, వాళ్ళని వాళ్ళ మానాన వదిలేసి వూరుకోని, హింసించే మహా క్రూరులు కూడా ఈ లోకంలోనే ఉంటారు. తమ శరీరానికీ, తమ జెండర్ స్పృహకి పొంతన కుదరక, అసలు తమ లోలోపల ఏం జరుగుతుందో అర్థం కాని గందరగోళం ఒక పక్కనైయితే, మరో పక్క చుట్టూ ఉన్న మనుషులు పెట్టే హింస, అవమానాలు మరో పక్కన.
దక్షిణాది రాష్ట్రాలకు చెందిన హిజ్రా కమ్యూనిటీ నిజజీవిత కథల్ని రేవతి 2004 లోనే ‘ఉనర్వుమ్ ఉరువముమ్’ (Unarvum Uruvamum) (మా జీవితాలు -మా మాటలు) అని పేరుతో సంకలనంగా తీసుకువచ్చింది. ఆ పుస్తకం చాలామందిని ప్రభావితం చేసింది. ఆ ప్రభావంతోనే ప్రియభాను ‘నాన్ సర్వన్న అల్లాను, విద్య ‘ఐయాం విద్య’ పుస్తకాల్ని ప్రచురించారు. రేవతి తన స్వీయ అనుభవాలతో తన ఆత్మకథని ‘ద ట్రూత్ ఎబౌట్ మీ ఎ హిజ్రా లైఫ్ స్టోరీ ‘పుస్తకాన్ని 2010 లో తమిళంలో రాస్తే, వి. గీత దానిని ఇంగ్లీషులోకి అనువదించారు. తరువాత అది 2011లో ‘వెల్లయి మోజి (Velliai Mozhi)గా తమిళంలోకి అనువదించబడింది. ఆ తరువాత ఇతర భారతీయ భాషల్లోకి కూడా వెళ్లిందా పుస్తకం. తెలుగు లో నిజం చెబుతున్నా- ఒక హిజ్రా ఆత్మకథ అనే పేరుతో పి. సత్యవతి అనువాదం చేశారు.
భారతీయ సాహిత్యంలో ఎల్‌జిబిటి కమ్యూనిటీ గురించి రాయడం కొత్తదేమీ కాదు. సాహిత్యం జీవితాన్ని ప్రతిఫలిస్తుంది అని అనుకున్నప్పుడు, ఈ నేలపైన మానవుల పుట్టుకతో పాటు, ఇతర లైంగికత్వాలు కలిగిన ఎల్‌జిబిటి సమూహాలు కూడా జన్మించి, మానవులు జీవిస్తూ ఉన్నప్పుడు, వాళ్ల జీవితాలు కూడా సాహిత్యంలో ఎక్కడో చోట ప్రతిఫలించక తప్పదు. అస్పష్టంగాను, అనేక ప్రతీకలతోనూ, కొన్ని సందర్భాలలో సూటిగానూ ఆ కమ్యూనిటీ గురించి భారతీయ సాహిత్యంలో మాట్లాడారు. మహాభారతంలో అర్జునుడు శాపవశాత్తూ బృహన్నలగా మారడం, విష్ణువు మోహినిగా మారడం, అర్ధనారీశ్వర శివతత్వాలు, ఇవన్నీ మన పురాణాల్లో, ఇతిహాసాల్లో ఊరికే రాలేదు. వాటిల్లో మనం చూడ నిరాకరించే జీవితాల గురించి ప్రముఖ ఫెమినిస్ట్‌లు రూత్ వనిత, సలీం కిద్వాయ్ పరిశోధన చేసి మహాభారతం, కామసూత్రాలలోని ఇలాంటి కథల్ని ‘సేమ్ సెక్స్ లవ్ ఇన్ ఇండియా ‘పుస్తకంగా ప్రచురించారు. అలాగే మరో ప్రముఖ మైథాలజీ స్కాలర్ దేవదత్త ఫణిక్కర్ కూడా పౌరాణికాలను ఆధారం చేసుకుని ఈ కమ్యూనిటీకి సంబంధించిన వారి జీవితాల గురించి పుస్తకం రాశారు. నిజానికి భారతీయ పురాణాల్లో ఈ సమూహాల ప్రస్తావన వాళ్ల గురించి ఆనాడు రాయడం నిషిద్ధ కాదు. అయితే విక్టోరియన్ మొరాలిటీ, మనల్ని పాలించిన బ్రిటిష్ వారి పరిశుద్ధ మత భావాలు మన సమాజంలో ఒక సెన్సార్ షిప్‌ని తెచ్చిపెట్టాయి. అది సాహిత్యంలోనూ చోటు చేసుకుంది. ఇలాంటి విషయాలు, భిన్న సెక్సువాలిటీల గురించి మాట్లాడటం, రాయడం అసభ్యం, నేరం అనే దాకా వెళ్ళింది సామాజిక నైతికకత.
మన దేశంలోనే కాదు, యూరప్, ఇంకా అనేక దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఇప్పటికి కూడా కొనసాగుతూనే వుంది. సాహిత్యం పైన, సమాజం పైన ఇటువంటి భావాలు, నియంత్రణ ఎటువంటి పరిణామాలకు దారి తీసింది అనేది మరింత లోతుగా, సమగ్రంగా చర్చించాల్సిన విషయం. మొదటి, రెండవ వేవ్ ఫెమినిస్టు ఆలోచనలు, భావ సంఘర్షణ, జరిగిన 1970ల కాలంలో అనేక అస్తిత్వాలు వాటిదైన చోటు కోసం, సమాజంతో సంఘర్షించటమే కాక, విక్టోరియన్ విలువలను తీవ్రంగా ప్రశ్నించడం ప్రారంభించాయి. మన దేశంలో 1978లోనే శకుంతలా దేవి ‘ద వరల్ద్ ఆఫ్ హోమో సెక్స్ వాలిటీ’ అనే ఒక పుస్తకం రాశారు. అలాగే ఇటీవలి కాలంలో అరుంధతి రాయ్, ద మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్, అమృత పాటిల్ ‘కారి’ (Kair), నీలా ముఖర్జీ ‘ఎ లైఫ్ ఎ పార్ట్’, మంజు కపూర్ ‘ఎ మారీడ్ ఉమెన్’, కునాల్ ముఖర్జీ ‘మై మ్యాజికల్ ప్యాలెస్’, ఆర్. రాజారావు ‘హాస్టల్ రూమ్ 131’ తెలుగులోకి అనువాదం అయిన వసుదేంద్ర ‘మోహనస్వామి, రేణుక అయోల తెలుగులోనే రాసిన దీర్ఘకావ్యం ‘మూడో మనిషి’, బండి నారాయణ స్వామి నవల అర్ధనారి ఇలా ఈ సాహిత్యమంతా భిన్న సెక్సువాలిటీల జీవితాల గురించి మాట్లాడింది. మీనూ, శ్రుతి ఎడిట్ చేసిన ‘క్లోజ్, టూ క్లోజ్ : ద ట్రాంక్వి బార్ ‘పుస్తకం ఎల్‌జిబిటి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ జీవితాలపై వచ్చిన ఒక సంకలనం. వినపడకుండా, కనబడకుండా చేసిన ఈ స్వరాలని ఇప్పుడు సాహితీలోకం, సమాజం వినితీరాలి.
అందుకు చోటును సాహిత్యంలో కల్పించి తీరాలి. ప్రధాన స్రవంతిలో, సాహిత్యంలో సమానమైన చోటు కోసం ఎల్‌జిబిటి కమ్యూనిటీ చేస్తున్న ఆందోళన చిన్నది ఏమీ కాదు. ఏనాటి నుండో భిన్న సెక్సువాలిటీలు సమాజంలో ఉన్నాయన్న విషయాన్ని గుర్తించటమే కాక, ఆ రచనల్ని పాఠ్యాంశాల్లో కూడా భాగం చేయక తప్పలేదు. ఇప్పుడు ప్రధాన స్రవంతి అనుకునే వాళ్ళకి కూడా. చివరగా ఒక మాట చెప్పి ముగిస్తాను. సాహిత్య అకాడమీ ప్రచురించే బై మంత్లీ ఇండియన్ లిటరేచర్ మార్చి- ఏప్రిల్ 2024 సంచికలో, సాహిత్య అకాడమీ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా ‘ట్రాన్స్ జెండర్ అండ్ బైనరీ రైటింగ్స్’ అని ఆ సంచికలో ప్రధాన భాగం చోటుని వారి రచనల కోసం కేటాయించారు. ఎల్‌జిబిటి కమ్యూనిటీ పట్ల మన ఆలోచనలు, దృక్పథంలో ఎంతో మార్పు రావాల్సిన అవసరం ఉంది. సమాజం సెన్సిటైజ్ కావాలి అనే మాట జెండర్ విషయంలో మాట్లాడుతూ ఉంటాం.
అలాగే ఈ సెన్సిటైజేషన్ క్రమాన్ని సమాజంలో తీసుకురావాలి అని అంటే, ఈ కమ్యూనిటీకి చెందిన వాళ్ళ జీవితాలు, వాళ్ళ సంఘర్షణ మరింత ఎక్కువగా సమాజంలోకి, చొచ్చుకొని రావాలి. ఇప్పటి దాకా విధించిన సెన్సార్ షిప్ సంకెళ్లను తెంచుకొని మరీ. తమ అస్తిత్వం గురించిన సాహిత్యాన్ని తమకు తాము సృష్టించాలి. అంతేకాదు, ఇతర సాహితీవేత్తలు కూడా తమ వంతు సంఘీభావాన్ని ఈ కమ్యూనిటీకి తెలపడమే కాక, వాళ్ళుకూడా ఈ విషయాలపై రాయాలి, అపుడే విస్తృతంగా వాళ్ళ జీవితాలు పాఠకుల్లోకి వెళతాయి అని ఒక ట్రాన్స్‌జెండర్ ఉద్యమకారిణి నాతో అన్నప్పుడు, ఇంత దుర్మార్గమైన సమాజంలో, అణిచివేయబడుతున్న స్వరానికి, ఇతరుల స్వరాలు కూడా జత చేయాల్సిన అవసరం నిజంగానే ఉంది అని నాకు అనిపించింది.

అనంత చంద్ర
అనువాదం : సలీం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News