పావులు కదుపుతున్న బిసిసిఐ!
ముంబై: భారత గడ్డపై ఈ ఏడాది జరగాల్సిన పురుషుల ప్రపంచకప్ ట్వంటీ-20 టోర్నమెంట్‌ను విదేశాలకు తరలించాలనే నిర్ణయానికి భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మిగిలిన మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. తాజాగా భారత్‌లో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ను కూడా యుఎఇకి మార్చాలని పావులు కదుపుతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. టోర్నీని విదేశాలకు తరలిస్తున్న విషయాన్ని బిసిసిఐ ధ్రువీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. భారత్‌లో ప్రస్తుతం కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ పరిస్థితుల్లో షెడ్యూల్ ప్రకారం వరల్డ్‌కప్‌ను భారత్‌లోనే నిర్వహిస్తారని అందరూ భావించారు. అయితే కరోనా పూర్తిగా తగ్గక పోవడం, మూడో వేవ్ ప్రమాదం పొంచి ఉండడం తదితర కారణాలను దృష్టిలో పెట్టుకుని వరల్డ్‌కప్‌ను భారత్ నుంచి తరలించడమే మంచిదనే నిర్ణయానికి బిసిసిఐ వచ్చినట్టు తెలిసింది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలలో భారత్ వేదికగా పొట్టి ప్రపంచకప్ జరగాల్సి ఉంది.
కానీ అదే సమయంలో కరోనా మూడో వేవ్ విజృంభించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి స్థితిలో వరల్డ్‌కప్ కొనసాగడం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. దీంతో ముందు జాగ్రత్తగా వరల్డ్‌కప్‌ను విదేశాల్లో నిర్వహించడమే మంచిదని బిసిసిఐ పెద్దలు భావిస్తున్నారు. ఇక ఈ వరల్డ్‌కప్ యుఎఇతో పాటు ఒమన్‌లో నిర్వహించాలని బిసిసిఐ ప్రణాళికలు రచిస్తోంది. 16 దేశాలు పోటీ పడుతున్న వరల్డ్‌కప్‌ను రెండు దేశాల్ల నిర్వహిస్తే సజావుగా సాగే పరిస్థితి ఉంటుందని బిసిసిఐ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఇక వరల్డ్‌కప్‌ను భారత్ నుంచి విదేశాలకు తరలించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి కూడా అంగీకరించే అవకాశం ఉంది. భారత్ కంటే యుఎఇలో ప్రపంచకప్ నిర్వహిస్తే విదేశీ క్రికెటర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండక పోవచ్చు. అంతేగాక ఐపిఎల్ కూడా గల్ఫ్‌లోనే జరుగుతుండడం, దీనిలో పాల్గొనే విదేశీ క్రికెటర్లు కూడా నేరుగా వరల్డ్‌కప్ హాజరయ్యే అవకాశం ఏర్పడుతోంది.
త్వరలోనే స్పష్టత..
మరోవైపు టి20 వరల్డ్‌కప్ ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై త్వరలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచకప్‌పై నిర్ణయాన్ని ప్రకటించేందుకు ఐసిసి డెడ్‌లైన్ కూడా ప్రకటించింది. దీంతో త్వరలోనే బిసిసిఐ దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ఈ నేపథ్యంలో వారం రోజులలోపే ప్రపంచకప్ నిర్వహణ విషయంలో బిసిసిఐ తుది ప్రకటన చేయడం ఖాయమనే చెప్పాలి. కరోనా కేసులు తగ్గుతున్నా మూడో వేవ్ ప్రమాదం పొంచి ఉండడంతో భారత క్రికెట్ బోర్డు యుఎఇలోనే వరల్డ్‌కప్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి ఐసిసి కూడా సానుకూలంగా ఉండడంతో అధికారిక ప్రకటన చేయడం లాంఛనమేనని చెప్పాలి.