Monday, December 23, 2024

ఐక్యరాజ్యసమితిని సంస్కరించాల్సిందే

- Advertisement -
- Advertisement -

కాలానికి అనుగుణంగా మార్పుచెందకపోతే ప్రాధాన్యం కోల్పోతాం

న్యూఢిల్లీ: భారత్ అధ్యక్షతన జరిగిన రెండు రోజుల జి20 శిఖరాగ్ర సమావేశం ఆదివారం ముగిసింది. గ్రూపు తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ అ ధ్యక్షుడు లూయిజ్ ఇనాసియా లూలాడ సల్వాకు భారత ప్రధాని నరేంద్ర మోడీ అప్పగించారు. ఈ మేరకు అధికారికంగా చిన్న సుత్తివంటి గవెల్‌ను ఆయ న చేతికి అందించారు. అనంతరం సదస్సు తీర్మానాలను ప్రధాని మోడీ ప్రకటించారు. మరో వైపు భారత్ అధ్యక్షతన జరిగిన సమావేశంఫలితాలను ర ష్యా, అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాలు ప్రశంసించాయి. సమావేశం ముగింపు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తుకు సంబంధించి విజన్‌పై చేస్తున్న కృషికి జి20 సదస్సు ఒక వేదికగా మారడం నాకెంతో సంతృప్తినిచ్చింది’ దీంతో పాటుగా ఐక్యరాజ్య సమితిలో చేపట్టాల్సిన సంస్కరణలపైనా ప్రధాని మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి సహా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అ త్యవసరమని ప్రధాని ఉద్ఘాటించారు. సభ్య దేశాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్య మారడం లేదన్నారు. 51 దేశాలతో ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పటి పరిస్థితులు వేరన్న ఆయన.. ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 200కు చేరువైన విషయాన్ని గుర్తు చేశారు. కాలానికి అనుగుణంగా ఎవరైతే మార్పు చెందరో వారు ప్రాధాన్యతను కోల్పోతారని ఈ సందర్భంగా మోడీ గుర్తు చేశారు. సంస్కరణల ఆవశ్యకతను నొక్కి చెబుతూ, అందుకనే 55 దేశాలకు ప్రాతినిధ్యం వహించే ఆఫ్రికన్ యూనియన్‌కు జి20 కూటమిలో శాశ్వత సభ్యత్వం కల్పించడం ద్వారా చారిత్రక నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక సామాజిక భద్రత, ద్రవ్య, ఆర్థిక స్థిరత్వం వంటి వాటికి ఈ సారి క్రిప్టో కరెన్సీ కొత్త అంశంగా తోడయిందని మోడీ అన్నారు. క్రిప్టోను నియంత్రించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
నవంబర్‌లో జి20 వర్చువల్ సమావేశం
ఈ సందర్భంగా ప్రధాని ఓ కీలక సూచన చేశారు.ప్రస్తుత సదస్సులో చేసిన సిఫార్సులు, తీర్మానాలను అంచనా వేయడానికి నవంబర్ చివర్లో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించాలని ఆయన సభ్య దేశాలకు సూచించారు. నవంబర్ 30 వరకు జి20కి భారత నాయకత్వమే కొనసాగుతుందనే విషయాన్ని ప్రస్తావించారు. బృందం అధ్యక్ష హోదాలో మరో రెండు నెలలు కొనసాగనున్నందున మరిన్ని కార్యకలాపాలు పూర్తి చేయవచ్చని అభిలషించారు. ‘ గత రెండు రోజుల్లో మీరు మీ అభిప్రాయాలను వెల్లడించారు. అనేక ప్రతిపాదనలు అందించారు. వాటిని నిశితంగా పరిశీలించడం, వేగవంతం చేయడం మా బాధ్యతగా భావిస్తున్నాం’ అని ప్రధాని అన్నారు. దానిపై ఎలా ముందుకు వెళ్దామనే విషయాన్ని భారత బృందాలు వివరిస్తాయన్నారు. మీరందరూ ఆ సమావేశంలో పాల్గొంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. దీంతో జి20 విఖరాగ్ర సదస్సు ముగిసినట్లు ప్రకటిస్తున్నానని అన్నారు. ముగింపు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆశలు చిగురించి శాంతి నెలకొనాలని ప్రార్థిస్తూ ఆయన ఓ సంస్కృత శ్లోకాన్ని చదివారు. ఆ తర్వాత గ్రూపు తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వాకు అప్పగించారు.
అమెరికా, రష్యా, ఫ్రాన్స్ ప్రశంసలు
కాగా, జి20 కూటమి ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సమస్యలకు సైతం అది సమాధానాలను సాధించగలదని న్యూఢిల్లీ సదస్సు నిరూపించిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. భారత పర్యటన ముగించుకుని వియత్నాం బయలుదేరి వెళ్లే ముందు ఎక్స్( ట్విట్టర్)లో ఉంచిన పోస్టులో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా భారత అధ్యక్షతన జరిగిన జి20 శిఖరాగ సదస్సు అనేక విషయాల్లో ఒక చరిత్రాత్మక సమావేశమని, ఎందుకంటే ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను అధిగమించి ముందుకు వెళ్లగలదని నిరూపించిందని, అలాగే గ్లోబల్ సౌత్ శక్తిని, ప్రాధాన్యతను చాటి చెప్పిందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ అన్నారు. కాగా ముక్కలు చెక్కలుగా మారిన ప్రస్తుత వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుంటే జి20 అధ్యక్షురాలిగా భారత్ గొప్పగా పని చేసిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో విందు సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఘర్షణ కాదు.. శాంతి సహకారం అవసరం : లూలా
కాగా కొత్తగా జి20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్న బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ముగింపు సమావేశంలో మాట్లాడుతూ, భౌగోళిక రాజకీయ అంశాలు జి20 సమావేశ చర్చలను హైజాక్ చేయకూడదని అభిప్రాయపడ్డారు. జి20 చీల్చడంలో కూటమికి ఆసక్తి లేదని, ఆ సమయంలో ఎదురయ్యే సమస్యలను ఉమ్మడి కార్యాచరణ ద్వారానే ఎదుర్కోవాలని ఆయన అన్నారు. మనకు ఘర్షణకు బదులుగా శాంతి, సహకారం అవసరం’ అని ఆయన అన్నారు. న్యూఢిల్లీనుంచి రియోడిజనిరో దాకా సాగడానికి ప్రతి ఒక్కరినుంచి బోలెడంత అంకితభావం, కృతనిశ్చయం అవసరమని ఆయన చెప్పారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల ప్రయోజనాల అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి కృషి చేసినందుకు ఆయన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి జి20 శిఖరాగ్ర సమావేశం 2024 నవంబర్‌లో రియోడిజనిరోలో జరుగుతుంది. కాగా తాను అధ్యక్షుడిగా ఉన్నంత వరకు బ్రెజిల్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అరెస్టు జరగదని ఆయన అన్నారు. తమ దేశంలో 2024లో జరిగే జి20 సదస్సుకు పుతిన్ హాజరవుతారని, అక్కడ పుతిన్ అరెస్టయ్యే అవకాశమే లేదని లూలా స్పష్టం చేశారు. తాను అరెస్టవుతాననే భయంతోనే పుతిన్ ఢిల్లీ జి20 విఖరాగ్ర సమావేశానికి డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News