Thursday, January 23, 2025

కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారు

- Advertisement -
- Advertisement -

వచ్చే నెల 3వ తేదీ నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్న బృందం

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాష్ట్రంలో పర్యటించనున్నది. అక్టోబర్ 3వ తేదీ నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్న బృందం.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. ఎక్సైజ్, ఆదాయ పన్ను, జీఎస్టీ, రవాణా, తదితర నిఘా విభాగాల అధికారులు, బ్యాంకర్లతో సమావేశమై.. డబ్బు, మద్యం, ఉచిత కానుకల ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల నోడల్ అధికారులతో సమావేశమై.. భద్రతా పరమైన ప్రణాళిక, ఏర్పాట్లపై సమీక్షిస్తారు. రెండో రోజు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమావేశం కానున్న ఈసీ బృందం… జిల్లాల వారీగా ఎన్నికల ప్రణాళిక, ఏర్పాట్లను సమీక్షించనుంది. మూడో రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తారు. ఓటర్లకు అవగాహనా కార్యక్రమాలపైనా ఎన్నికల సంఘం బృందం దృష్టి సారిస్తుంది. ఓటర్ల జాబితా, పౌరుల భాగస్వామ్యానికి సంబంధించి ప్రచారం నిర్వహిస్తున్న ప్రముఖులు, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతోనూ కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమావేశం కానున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News