- పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ఏర్పాట్లు
- జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య
వరంగల్ ప్రతినిధి: రానున్న ఎన్నికలలో జిల్లాలో సీనియర్ సిటిజన్ల ఓటింగ్ శాతం పెరగాలని వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. అంతర్జాతీయ వయో వృద్దుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం స్వీప్ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటుచేశారు.
ముఖ్య అతిధిగా కలెక్టర్ మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికలలో జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో 90 శాతం ఓటింగ్ జరిగితే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాత్రం 73 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారని గుర్తు చేశారు. నర్సంపేట నియోజకవర్గ ఓటర్లను ఆదర్శంగా తీసుకొని ఈసారి ఎన్నికలలో వరంగల్ తూర్పు, వర్థన్నపేట నియోజకవర్గ ప్రజలు పూర్తి స్థాయి ఓటింగ్‌లో పాల్గొనేందుకు కృషి చేయాలని కోరారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సిసి వాలంటీర్లను ఏర్పాటుచేసి వృద్దులు, దివ్యాంగ ఓటర్లకు సహాయ, సహకారాలు అందించనున్నట్లు తెలిపారు.
ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో వృద్దులకు వీల్ చైర్ ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈసారి హోమ్ ఓటింగ్‌ను ఎన్నికల నియమ నిబంధనలలో పొందుపరిచినట్లు కలెక్టర్ వెల్లడించారు. అంగవైకల్యం 40 శాతం కంటే ఎక్కువగా ఉన్న వాళ్లు, 80 సంవత్సరాలు పై బడిన వృద్దుల కోసం హోం ఓటింగ్ ఏర్పాటుచేయడం జరుగుతుందని తెలిపారు. ఓటింగ్‌కు 5 రోజుల ముందుగానే 12 డిఫాం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, అధికారులు పరిశీలించిన మేరకు వారు ఇంటి నుండి ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు.
18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులకు ఓటుపై అవగాహన కల్పించి ఓటరుగా నమోదు చేయించాలని సీనియర్ సిటిజన్లను కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్లు గత ఓటింగ్‌లో వారి వారి అనుభవాలను పాలు పంచుకున్నారు. సీనియర్ సిటిజన్లను పలు సలహాలు, సూచనలు చేశారు. ఎలక్ట్రాన్ ఓటింగ్ యంత్రం ద్వారా సీనియర్ సిటిజన్లకు ఓటింగ్‌పై అవగాహన కల్పించారు.
అనంతరం సీనియర్ సిటిజన్లను కలెక్టర్ పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్, స్వీప్ నోడల్ అధికారి నర్సింహామూర్తి, జిల్లా సంక్షేమాధికారి శారద, ఎన్నికల విభాగం సూపరింటిండెంట్ విశ్వ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.