న్యూఢిల్లీ: వక్ఫ్ బిల్లుకు మెజారిటీ వర్గాల మద్దతు ఉందని.. వక్ఫ్ బిల్ల అంశంపై విపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. వక్ఫ్ బిల్లుపై మైనార్టీల్లో అపోహలు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వక్ఫ్ బిల్లు అతిపెద్ద సంస్కరణ అని ఆయన పేర్కొన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగబద్ధమే అని చెప్పారు. కొన్ని పార్టీలు మైనార్టీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నాయని దుయ్యబట్టారు.
తెలంగాణ, హరియాణా, యూపి వంటి అనేక రాష్ట్రాల్లో వక్ఫ్ భూములపై కేసులు ఉన్నాయని తెలిపారు. వక్ఫ్ ఆస్తులను ప్రార్థన, ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తే.. ఎలాంటి ఇబ్బంది లేదు కానీ.. అక్రమాలకు ఉపయోగిస్తేనే.. చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వక్ఫ్ ఆస్తులను అడ్డుపెట్టుకొని కొందరు వందల కోట్లు సంపాదిస్తున్నారని అన్నారు. వక్ఫ్ ఉన్నది పేద ముస్లింల కోసమని.. దొంగల కోసం కాదని పేర్కొన్నారు. వక్ఫ్ బిల్లు ముస్లింలకు మేలు చేసేదే తప్ప కీడు చేసేది కాదని అన్నారు. ఈ బిల్లులో ముస్లిమేతరులకు చోటు లేదని.. వక్ఫ్ ఆస్తుల సక్రమ వినియోగానికి తోడ్పడుతుందని.. వక్ఫ్‌లో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తుందని స్పష్టం చేశారు.