రష్యన్ బిలియనీర్ టింకోవ్ వ్యాఖ్యలు
మాస్కో : రష్యన్ బ్యాంకింగ్ దిగ్గజం, బిలియనీర్ ఒలేగ్ టింకోవ్ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నిష్ప్రయోజనమైనదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 55 రోజులుగా జరుగుతున్న నిరవధిక యుద్ధం కారణంగా ఇరు దేశాలూ తీవ్ర నష్టాలను చవి చూస్తున్నాయన్నారు. ఈమేరకు యుద్ధం వల్ల జరుగుతున్న నష్టాలను వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పోస్ట్ చేశారు. ఈ యుద్దంలో వేలాది మంది మృత్యువాత పడ్డారని, మిలియన్ల మంది ఉక్రెయిన్ వాసులు దేశం నుంచి పారిపోయి శరణార్థులుగా మారారన్నారు. 90 శాతం మంది రష్యన్లు ఈ యుద్దానికి వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొన్నారు. డజన్ల కొద్దీ విదేశీ వ్యాపార సంస్థలు రష్యా నుంచి నిష్క్రమించాయన్నారు. చివరికి యూరోపియన్ యూనియన్ గగనతలంలో రష్యన్ ఎయిర్‌లైన్స్‌ను నిలిపివేసిందని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా క్రెమ్లిన్ లోని అధికారులు తమ కుటుంబాలతో విలాసవంతమైన యాత్రకు మధ్యధరాసముద్రానికి వెళ్లారని , మానవత్వం మరిచారనడానికి ఇదొక నిదర్శనమన్నారు.