2050 నాటికి భారత్ తీవ్ర జల సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ది వరల్డ్ వాటర్ డెవలప్‌మెంట్ రిపోర్టు 2023 వెల్లడించింది. అయితే ప్రభుత్వం మాత్రం అదేమంత భయంకరమైన సంకేతం కాదని ఉదాసీనంగా చెబుతోంది. అంతేకాదు గత మార్చి నెలలో పార్లమెంట్‌లో పాత లెక్కలనే వల్లెవేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ డేటా ప్రకారం 2021లో దేశంలో తలసరి నీటి లభ్యత 1486 ఘనపు మీటర్లు ఉండగా, 2031 నాటికి 1367 ఘనపు మీటర్లకు తగ్గుతుందని అంచనా వేసింది. 1951 జనాభా లెక్కల ప్రకారం తలసరి నీటి లభ్యత 5000 ఘనపు మీటర్లు ఉందని వెల్లడించింది. అయితే నీటి లభ్యత తగ్గిపోడానికి జనాభా పెరుగుదల, భౌగోళిక, జల వాతావరణ మార్పులు కూడా కారణంగా చెబుతోంది. జనాభా పెరుగుదల ముఖ్యమైన పాత్ర వహించడమే కాకుండా, తలసరి నీటి లభ్యత బాగా పడిపోవడానికి నీటివనరులను విపరీతంగా వినియోగించడం, నీటిని నిల్వచేసుకునే సామర్ధం లోపించడం తీవ్ర సంక్షోభానికి దారి తీస్తున్నాయి.
ప్రపంచ జనాభాలో 18 శాతం జనాభా భారత్‌లోనే ఉంది. అయితే భూమిపై నీటి వనరులు నాలుగు శాతం మాత్రమే ఉన్నాయి. 2022 లో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ (సిసిడబ్లుబి) భూగర్భ జల వనరుల ఆవర్తన అంచనా ప్రకారం 15 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించిన తిరిగి నీటితో నింపబడే సామర్ధం ఉన్న 7089 మదింపు యూనిట్లలోని 1006 యూనిట్లలో మితిమీరిన వినియోగం జరుగుతోందని అంచనా వేసింది. అంటే ఏటా భూగర్భ జలవనరులు తిరిగి పరిపుష్టి చెందడం కన్నా విచ్చల విడిగా తోడివేయడమే చాలా ఎక్కువగా జరుగుతోంది. 260 యూనిట్లు మితిమీరిన తోడి వేయడంగా వర్గీకరించారు అంటే భూగర్భ జలవనరులు తిరిగి నిండడం కన్నా 90 నుంచి 100 శాతం పూర్తిగా తోడివేయడమే అవుతోంది. అయితే 2020 సంవత్సరం నుంచి కొంత అభివృద్ధి కనిపిస్తున్నా నిపుణులు మాత్రం క్షేత్రస్థాయి వాస్తవాలకు ఈ లెక్కలు విరుద్ధంగా ఉన్నాయని, నీటి వనరుల అంచనాకు సరైన పద్ధతిని అవలంబించడం లేదని తప్పుబడుతున్నారు.
నీటి ఎద్దడిని తెచ్చిపెట్టే వరి, చెరకు వంటి పంటలను సాగు చేయడాన్ని విడిచిపెట్టి నీటిని పొదుపుగా ఉపయోగించే పంటలను సాగు చేసే పద్ధతిని అనుసరించడం మేలని సూచిస్తున్నారు. ఉదాహరణకు ఎకరం వరి సాగుకు 55 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుందని అంచనా. దీన్ని బట్టి నీటి ఎద్దడి కొన్ని పంటల సాగు వల్ల ఎలా ఏర్పడుతోందో తెలుసుకోవచ్చు. మన దేశంలో వరి సాగు కోసం భూగర్భ జలాలను అతిగా వినియోగించడం పరిపాటి అయింది. తక్కువ నీటిని వాడుకుని త్వరగా చేతికి అందొచ్చే పంటలను సాగు చేస్తే చాలా వరకు నీటిని ఆదా చేయవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తక్కువ నీరు అవసరమయ్యే వరి వంగడాలను అందుబాటులోకి తేవడంలో తెలంగాణ ముందుంది. దేశ వ్యాప్తంగా గత మూడేళ్లలో 17 రకాల వరి వంగడాలను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
దేశ వ్యాప్తంగా వరితో పాటు ఇతర పంటలకు సంబంధించి తక్కువ నీరు అవసరమయ్యే, కరవును తట్టుకునే 69 రకాల వంగడాలను రూపొందించినట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. అయితే నీటి ఎద్దడిని తెచ్చిపెట్టే పంటల సాగును ఇప్పటికిప్పుడే తిరస్కరించడం సాధ్యం కాదు. సెంట్రల్ వాటర్ కమిషన్ డేటా ప్రకారం భూగర్భ జలాల్లో 89 శాతం నీటిని పొలాల సాగు కోసం తోడివేస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం, ధరల నిర్ణయంలో రాష్ట్ర ప్రభుత్వాల విధానాల్లో మార్పు అవసరమని నిపుణులు చెబుతున్నారు. జల సంక్షోభాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవలసిన అగత్యం ఉన్నప్పటికీ ఇంతవరకు అలాంటి చొరవేమీ కనిపించడం లేదు. కనీస నీటి వినియోగంతో గరిష్ఠ స్థాయిలో పంటలను పండించడానికి అవలంబించే “పెర్ డ్రాప్ మోర్ క్రాప్” లేదా మైక్రో ఇరిగేషన్ విధానం, క్రిషి సంచాయీ యోజన విధానం వంటివి చాలా ఎక్కువగా ప్రోత్సహిస్తేనే కానీ సాగు నీటి వినియోగంలో పొదుపు కుదరదు. ఈ విధానాలు ఎంత వేగంగా అమలులోకి వస్తే అంత వేగంగా రానున్న దశాబ్దాల్లో తీవ్ర జల సంక్షోభ సమస్యలు పరిష్కారమవుతాయి.
దేశంలో నాలుగు మాసాల వ్యవధిలో 80 శాతం వర్షపాతం ద్వారా నీరు సమకూరుతుంది. అయితే వాతావరణ మార్పుల కారణంగా రుతు పవనాల సమయంలో చాలా తక్కువ వ్యవధిలోనే ఎడతెరిపి లేని వర్షపాతం సంభవించి వరదలు ముంచెత్తుకు రావడం లేదా దుర్భిక్షం నెలకొనడం వంటి జంట సమస్యలు ఎదురవుతున్నాయి. దేశంలో ఎంత వర్షం కురిసినా ఆ వర్షం నీటిని నిల్వ చేసుకునే తగిన సదుపాయాలు మాత్రం సమకూరకపోవడం మరో సమస్య. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించక తప్ప దు. సిడబ్లుసి డేటా ప్రకారం పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా స్థూల, ప్రత్యక్ష నిల్వ సామర్ధం 325 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బిసిఎం) నుంచి 257 బిలియన్ క్యూబిక్ మీటర్ల వరకు ఉంటోంది. అంటే 32,500 కోట్ల ఘనపు మీటర్ల నుంచి 25,700 ఘనపు మీటర్ల వరకు నిల్వ సామర్ధం ఉంటోందని తెలుస్తోంది. సగటు వార్షిక వర్షపాతం 3880బిలియన్ క్యూబిక్ మీటర్లుగా పరిగణిస్తే దాదాపు 2000 బిలియన్ క్యూబిక్ మీటర్ల వరకు వర్షపాతం నీరు నిల్వ కాకుండా వృథాగా పోతోందని చెప్పవచ్చు. వార్షిక వర్షపాతంలో దాదాపు 50 శాతం ఆవిరైపోవడం లేదా తరిగిపోవడం వంటివి జరుగుతున్నప్పటికీ నీటి నిల్వ సామర్ధాన్ని బాగా విస్తరించే అవకాశం ఉంది. ఏదిఏమైనా సిడబ్లుసి అధ్యయనం ప్రకారం వార్షిక నీటి నిల్వ అవసరం 3000 బిలియన్ క్యూబిక్ మీటర్ల వరకు ఉండవచ్చని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్ నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవడం, నేడు ఉపయోగపడే నీటిని దేశం ఏ విధంగా పరిరక్షించి, అభివృద్ధి చేస్తుందో దానిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచ మంచినీటి సదస్సు
దాదాపు 50 ఏళ్ల తరువాత ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో గత మార్చి 22 24 తేదీల్లో ప్రపంచ మంచి నీటి సదస్సు జరిగింది. వరదలు, దుర్భిక్షం, తీవ్రమైన వాతావరణ మార్పులు, ఆహార సంక్షోభం తదితర సమస్యల నేపథ్యంలో ఈ సదస్సు జరగడం గమనార్హం. 2018 నుంచి 2028 వరకు ఈ దశాబ్ద కాలంలో తీసుకుంటున్న, తీసుకోబోతున్న ప్రణాళికలపై మధ్యంతర సమీక్ష ఈ సదస్సులో జరిగింది. ప్రస్తుతం అమలులో ఉన్న కార్యక్రమాలు, ప్రాజెక్టులను మరింత బలోపేతం చేసి 2030 నాటి అజెండాను సాధించడానికి ఇంకా ముందుకెళ్ల వలసిన అవసరంపై చర్చించారు. ముఖ్యంగా సుస్థిర అభివృద్ధి ఆరో లక్షాన్ని (ఎస్‌డిజి 6) సాధించడమే ప్రధాన అంశం. ఈ సదస్సు నుంచి వచ్చిన ప్రధాన ప్రతిపాదన అంతర్జాతీయ నీటి నిర్వహణ ప్రణాళిక. ఆయా ప్రభుత్వాలు, బహు పాక్షిక సంస్థలు, వాణిజ్యాలు, ప్రభుత్వేతర సంస్థలు, ఇవన్నీ నీటి సంరక్షణ, భద్రత కోసం తాము నెరవేర్చాలనుకుంటున్న కార్యాలతో కూడిన దాదాపు 670కు పైగా తమ ప్రతిపాదనల ఒప్పందాలు సమర్పించాయి. దాదాపు 164 ప్రభుత్వాలు, 75 బహు పాక్షిక సంస్థలు ఈ మేరకు తమ ప్రతిపాదనలు సమర్పించగలిగాయి. ఇవన్నీ నీటి సంరక్షణ కార్యాచరణ ప్రణాళికతో ముడిపడి ఉన్నవైనప్పటికీ, ఇవి స్వచ్ఛందంగా పాలు పంచుకోవలసినవి తప్ప చట్టపరంగా కట్టుబడి ఉన్నవికావు.
సదస్సులో చర్చించిన ఈ ప్రతిపాదనలు ఎంతవరకు కార్యాచరణలోకి వస్తాయో, అందరికీ సమానంగా ఎంత వరకు నీరు అందుతుందో ఇవన్నీ పరిశీలించవలసి ఉంటుం ది. 2030 నాటికి ఈ లక్షాలని సాధించాలంటే ఏటా 114 బిలియన్ డాలర్లు వరకు ఖర్చు పెట్టవలసి వస్తుందన్న అంచనా తేలింది. నీటి సంరక్షణ, నాణ్యత, పరిశుభ్రత తదితర పదేపదే సేవలకు వెచ్చిస్తున్న వ్యయం 2030 నాటికి ఏటా దాదాపు 4 బిలియన్ డాలర్ల నుంచి 30 బిలియన్ డాలర్ల వరకు పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అంటే ప్రాథమిక వాటర్ అండ్ శానిటేషన్ సర్వీస్ (డబ్లుఎఎస్‌హెచ్) పెట్టుబడి వ్యయం కన్నా పదేపదే పెట్టే ఖర్చు ఎక్కువగా ఉంటుందని తెలియజేసింది. ఆయా దేశాలు వెల్లడించిన ఒప్పందాలు, అవకాశాలుగా, ఆశయాలుగా కనిపిస్తున్నా, వాటికి తగిన ఆర్థిక వనరులు, లక్షాలు లోపిస్తున్నాయని వరల్డ్ రీసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (డబ్లుఆర్‌ఐ) అభిప్రాయపడింది. ఈ మేరకు లక్షాల సాధనకు ముందుగా నీటి నాణ్యత, సరఫరా, వ్యవస్థల యాజమాన్య నిర్వహణలో పటిష్టమైన యంత్రాంగం, జవాబుదారీతనం అవసరం.
సరస్సులు, నదులు, భూములు, నీటి వనరులకు సంబంధించి పరిమాణం, ప్రవాహం, నాణ్యతలకు కొన్ని పరిమితులున్నాయి. నీటి వినియోగం డేటాకు సంబంధించి కొన్ని లోపాలున్నాయి. నీటి వినియోగానికి మీటర్ల విధానం అనుసరించాలనే విషయంలో భారత్ నుంచి ఐర్లాండ్ వరకు వ్యతిరేకత కనిపిస్తోంది. సమానంగా నీటి లభ్యతలో, సమర్థతలో ఆందోళనకరమైన విషయాలు ఉండడమే దీనికి కారణం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వనరుల నుంచి నిధులు వెచ్చించడంలో నీటి యాజమాన్య సర్వీస్‌ల కన్నా కొత్త నీటి యాజమాన్య మౌలిక సౌకర్యాలకే దేశాలు ప్రాధాన్యం ఇస్తుంటాయని ప్రపంచ బ్యాంకు అధ్యయనం చెబుతోంది. ఫలితంగా నీటి వినియోగదారులకు సర్వీస్‌లు క్షీణిస్తున్నాయి. వాతావరణ మార్పులతో పోలిస్తే అత్యవసరంగా మంచినీటి సమస్యను పరిష్కరించాలన్న అవసరం కానీ దీనికి తగిన నిధులు వెచ్చించాలన్న లక్షం కానీ ఎవరికీ కలగడం లేదు. గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ ( ప్రపంచ పర్యావరణ సౌకర్యం జిఎఫ్‌ఎఫ్ ) అనే అంతర్జాతీయ నిధుల వ్యవస్థ ఒక్కటే 300 వాటర్ షెడ్‌లను, అంతకన్నా ఎక్కువ సంఖ్యలో జలధారలను, నిర్వహించ గలుగుతోంది. రెండు మూడు దేశాల రాజకీయ సరిహద్దుల్లో వాటిని తన నిధులలతో రాయితీలతో చేయగలుగుతోంది.
భారత్ పాత్ర ….
ఈ సదస్సులో భారత్ తన లక్షాలను వివరించింది. నీటి రంగంలో భూగర్భ జలాల స్థాయిని 240 బిలియన్ డాలర్ల వరకు వెచ్చించి పునరుద్ధరిస్తానని వెల్లడించింది. అయితే 2021 కాగ్ నివేదిక ఏం చెప్పిందంటే భారత్‌లో 2004 నుంచి 2017 మధ్య కాలంలో భూగర్భజలాలను తోడివేయడం 58 శాతం నుంచి 63 శాతం వరకు పెరిగిందని వెల్లడించింది. వాతావరణ మార్పుల వల్ల అడపాదడపా వర్షాలు పడడంతో ఈ సమస్య మరింత తీవ్రమైందని పేర్కొంది. దాంతో భూగర్భ జలాలు తిరిగి భర్తీ కాక, మరింత అడుగంటి పోయాయని వెల్లడించింది. నీటి కేటాయింపుల నిర్వహణ, ఇతర సంబంధిత అంశాలతో కొన్ని నిబంధనలు పొందుపరుస్తూ సవరించిన భూగర్భ జలాల చట్టం రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది.
అయితే రాష్ట్రస్థాయి బోర్డుల్లో తక్కువ సిబ్బంది, నైపుణ్యం లోపించడం, భూగర్భ జల వనరులపై సామాజిక రాజకీయ సంఘర్షణలే ప్రాథాన్యం వహిస్తున్నాయి. ప్రపంచ స్థాయి వాతావరణ సదస్సుల్లో హరిత వాయువులను నివారించడానికి చాలా దేశాలు ఒడంబడికలు ప్రతిపాదించి ముందుకు వెళ్తున్నా భూగర్భజలాలు, ఇతర నీటి వనరుల సంరక్షణలో మాత్రం ప్రపంచ స్థాయిలో దేశాల మధ్య అంత చొరవ కనబడడం లేదు. 1997లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యాన జలసదస్సు జరిగింది. అంతకు ముందు 1992 లో కూడా ఐక్యరాజ్యసమితి ఎకనామిక్ కమిషన్ ఫర్ యూరప్ ఆధ్వర్యాన కూడా జలసదస్సు జరిగింది. ఈ సదస్సులో చట్టపరమైన కట్టుబాట్లుతో ఒడంబడికలు జరగకపోయినా ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి.
కె. యాదగిరి రెడ్డి
9866789511