న్యూఢిల్లీ: సినిమా హాళ్లలోకి బయటినుంచి తినుబండారాలను అనుమతించడంపై మంగళవారం సుప్రీంకోర్టులో ఆసక్తికరమైన చర్చ జరిగింది. సినిమా హాళ్లలోకి బయటినుంచి తినుబండారాలను తీసుకు రావడాన్ని నిషేధించాలన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన బెంచ్ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. థియేటర్లలోకి బయటినుంచి తినుబండారాలు, కూల్‌డ్రింక్స్‌ను తీసుకు రాకుండా నిషేధించే అధికారం సినిమాహాళ్లు, మల్టీప్లెక్స్‌లకు ఉందని ఈ సందర్భంగా బెంచ్ స్పష్టం చేసింది.
థియేటర్లకు వచ్చే వారు తమ వెంట తినుబండారాలు, కూల్‌డ్రింక్స్ తీసుకు రావచ్చంటూ జమ్మూ, కశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ థియేటర్ల యజమానులు, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. సినిమా హాలు ప్రైవేటు ఆస్తి అని, సినిమా హాళ్లలోపల తినుబండారాలు, కూల్‌డ్రింక్స్ విక్రయాలకు సంబంధించి నిబంధనలను నిర్ణయించే హక్కు థియేటర్ యజమానులకే ఉంటుందని, వారు నిర్ణయించిన ధరలకే వాటిని ప్రేక్షకులు కొనుగోలు చేయాల్సి ఉంటుందని బెంచ్ స్పష్టం చేసింది. అయితే థియేటర్లలో ఉచితంగా మంచినీరు సరఫరాను మాత్రం కొనసాగించాలని బెంచ్ స్పష్టం చేసింది.
థియేటర్ జిమ్ కాదని, అది ఎంటర్‌టైన్‌మెంట్ చోటు అనికూడా బెంచ్ స్పష్టం చేసింది. ఏ థియేటర్‌లో తాను సినిమా చూడాలని నిర్ణయించుకునే హక్కు ప్రేక్షకుడికి ఉన్నట్లే నిబంధనలు రూపొందించుకునే హక్కు థియేటర్‌కు ఉంటుందని స్పష్టం చేసింది. ‘అలా లేకపోతే థియేటర్ లోపలికి జిలేబిలను తీసుకెళ్తారు’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ‘ప్రేక్షకుడు తనచేతికున్న జిడ్డు, బంకను సీట్లకు తుడిచేస్తే దాన్ని శుభ్రం చేసే బాధ్యత ఎవరిది? జనం తండూరి చికెన్‌ను కూడా లోపలికి తీసుకెళ్లడం ప్రారంభిస్తారు. అప్పుడు హాలులోపల ఎముకలున్నాయంటూ ఫిర్యాదులు కూడా రావచ్చు ’అని బెంచ్ వ్యాఖ్యానించింది.
ఈ సందర్భంగా తాను బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న సందర్భంలో రాత్రి 11 గంటల తర్వాత టీవీలో పెద్దల సినిమాలను చూపించడానికి సంబంధించిన కేసును విచారించిన విషయాన్ని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గుర్తు చేసుకున్నారు. ‘ పిల్లలు నిద్ర పోయిన తర్వాత పెద్దలు ఈ సినిమాలు చూడడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు’ అని ఆయన అన్నారు.