ప్రజల భద్రతే ముఖ్యం
థియేటర్ యజమానులతో సమావేశం
సినిమా హాళ్ల యజమానులకు సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర ఆదేశం
హైదరాబాద్: సినిమా థియేటర్ల యజమానులు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆదేశించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని థియేటర్ల యజమానులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిపి స్టిఫెన్ రవీంద్ర మాట్లాడుతూ థియేటర్ల యజమానులు తప్పనిసరిగా లైసెన్స్‌లు రెన్యూవల్ చేసుకోవాలని అన్నారు. సినిమా థియేటర్లలో భద్రతా ప్రామాణాలు పాటించకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రజల భద్రత ముఖ్యం కాబట్టి తప్పనిసరిగా నిబంధనల మేరకు లైసెన్స్‌నులను వెంటనే రెన్యువల్ చేసుకోవాలన్నారు. ఆర్ అండ్ బి, ఫైర్, ఎలక్ట్రికల్, జిహెచ్‌ఎంసి నుంచి అనుమతులు తీసుకోవాలని అన్నారు. లైసెన్స్‌లు లేకుండా థియేటర్లను నడిపిస్తున్న వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని తెలిపారు.
థియేటర్ల యజమానులు లైసెన్స్‌లు రెన్యూవల్ చేసుకోకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రద్దీగా ఉంటే రోడ్లపై టైం షెడ్యూల్‌ను పాటించాలని, ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనాల సంఖ్యకు అనుగుణంగా పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించాలని అన్నారు. సినిమా హాళ్ల నిర్వహణ కోసం రూపొందించిన నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జాయింట్ సిపి అవినాష్ మహంతి, డిసిపిలు శ్రీనివాస రావు, శిల్పవల్లి, సందీప్, జగదీశ్వర్‌రెడ్డి, ఇందిరా, ఎసిపిలు, డిఎఫ్‌ఓలు సుధాకర్‌రావు, శ్రీధర్ రెడ్డి, పూర్ణచందర్, ఆర్ అండ్ బి, ఫైర్ డిపార్ట్‌మెంట్, ఎలక్ట్రికల్, జిహెచ్‌ఎంసి సిబ్బంది పాల్గొన్నారు.