యాదాద్రి భువనగిరి:కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి పని చేస్తున్న యాజమానికే కన్నం వేయాలని ప్లాన్ వేశాడు. పోలీసులకు యజమాని ఫిర్యాదు చేయడంతో నిందితుని కథ అడ్డం తిరిగింది. డబ్బులు కాజేయాలని ప్లాన్ వేసి 14 లక్షలు డబ్బులు చోరీ చేసిన నిందితున్ని రాచకొండ పరిధిలోని యాదాద్రి భువనగిరి జోన్ పోలీసులు 24 గంటల్లో ఛేదించి, నిందితుని అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ రాజేష్ చంద్ర గురువారం భువనగిరిలో వెల్లడించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం బొమ్మలరామా రం మండలం మల్యాల గ్రామానికి చెందిన దొమ్మాట శంకర్ బొమ్మలరామారం ఎమ్మార్వో ఆఫీస్‌లో ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అతని వద్ద మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన తుడుం వెంకష్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. వెంకష్ ప్రతిరోజూ శ్రీకాంత్ ఇంటికి వెళ్లి భోజనం తీసుకురావడం వంటి పనులు చేస్తుంటాడు. ఇటీవల శంకర్ తన భూమిని సిటీలో ఉండే శ్రీకాంత్ అనే వ్యక్తికి అమ్మగా శ్రీకాంత్ ఈనెల 26వ తేదీన ఉదయం సమయంలో వచ్చి ఆ భూమి అమ్మకానికి సంబంధించి రూ. 14 లక్షల రూపాయలను శంకర్‌కు ఇచ్చాడు.
శంకర్ తన డబ్బులను కార్యాలయ ఆవరణలోని తన కారులో పెట్టి కారుకు తాళం వేశాడు. ఇదంతా గమనించిన వెంకష్ శంకర్ వాళ్ళ ఇంటికి వెళ్లి మధ్యాహ్నం భోజనంతో పాటు ఆ కారుకు సంబంధించిన డూప్లికేట్ తాళాన్ని తీసుకువచ్చి భోజనం ఇచ్చిన అనంతరం కారును డూప్లికేట్ కితో ఓపెన్ చేసి అందులోనే డబ్బులను తీసుకొని తన స్కూటీలో వేసుకొని వెళ్లిపోయాడు. అయితే తన నగదు అపహరణకు గురైందని తెలుసుకున్న శంకర్ బొమ్మలరామారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వెంటనే రంగంలోకి దిగిన ఎస్ హెచ్ ఓ, ట్రైన్ ఐపీఎస్ శివం ఉపాధ్యాయ ఆధ్వర్యంలోని టీం విచారణ ప్రారంభించి నిందితుడిని రంగాపురం క్రాస్ రోడ్ వద్ద నగదుతో సహా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్న రూరల్ సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డి, జనార్ధన్, సురేందర్ రెడ్డి, రవి, ఉదయ్ రెడ్డిలను డిసిపి రాజేష్ చంద్ర అభినందించారు.