న్యూఢిల్లీ: ఢిల్లీలో కారు ఢీకొని ఘోరంగా చనిపోయిన అంజలి ఇంట్లో సోమవారం దొంగతనం జరిగింది. అంజలి కుటుంబ సభ్యులు దొంగలు కరణ్ విహార్‌లోని తమ ఇంటి తాళాలు పగులగొట్టి వస్తువులు దోచుకెళ్లారని తెలిపారు. పోయిన వస్తువుల్లో ఎల్‌సిడి టివి కూడా ఉందన్నారు. దొంగతనం వెనుక అంజలి స్నేహితురాలు నిధి హస్తం ఉండొచ్చని వారనుమానిస్తున్నారు.
అంజలి సోదరి సోమవారం మాట్లాడుతూ ‘మా పొరుగింటి వారు ఉదయం 7.30 గంటలకు దొంగతనం విషయం చెప్పారు. మేము ఇంటికి వచ్చాక తాళం పగటకొట్టబడి ఉండింది. ఎల్‌సిడి టివి, ఇతర వస్తువులు, పరుపు కింద దాచినవి మాయమయ్యాయి. పోయిన టెలివిజన్ కూడా కొత్తదే. అది కొని రెండు నెలలే అయింది’ అని తెలిపారు.
మరో కుటుంబ సభ్యుడు ‘నిన్న మా ఇంటి ముందు పోలీసువారెందుకు లేరు. గత ఎనిమిది రోజులుగా ఉన్నారు కదా. ఈ దొంగతనం వెనుక నిధి ఉండి ఉంటుంది’ అన్నారు. కాగా దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా అంజలి మేనమామ మాత్రం అంజలి స్నేహితురాలు నిధిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ ఘటన జరిగిన రోజున అంజలి తాగి ఉందని నిధి మీడియాకు చెప్పడాన్ని ఖండించారు. ‘నిధి ఇంత వరకు దాక్కొని ఉంది. అంజలి అంత్యక్రియలు జరిగిపోయాక బయటికొచ్చి మాట్లాడుతోంది. ఆ దుర్ఘటన జరిగాక ఆమె పోలీసులకు, కనీసం అంజలి కుటుంబ సభ్యులకు కూడా ఏమి చెప్పలేదు. అప్పుడు భయపడ్డ ఆమెకు ఇప్పుడు భయం వేయడం లేదా? ఇదంతా నిధి కుట్ర’ అని అంజలి మేనమామ తెలిపారు. ‘నా మేనకోడలు అంజలికి తాగుడు అలవాటు అసలు లేదు. ఒకవేళ నిధి చెప్పినట్లు ఆ దుర్ఘటన రోజున అంజలి తాగే ఉంటే ఆ విషయం పోస్ట్ మార్టం రిపోర్టులో ఉండేది కదా?’ అన్నారు. ఇదిలావుండగా అంజలి కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి ఢిల్లీ పోలీసు కస్టడీలో ఉంచారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు మొత్తం 18 మంది బృందాలను ఏర్పాటు చేశారు.