న్యూఢిల్లీ: ఢిల్లీలో అంజలీసింగ్ అనే యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఘటనలో దర్యాప్తు కొనసాగుతుండగా, మృతురాలి ఇంట్లో విలువైన వస్తువులు చోరీ కావడం కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి తమ నివాసం లోకి కొందరు ఆగంతకులు చొరబడి విలువైన వస్తువులను కాజేసినట్టు అంజలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కరన్ విహార్ లోని తమ ఇంటి తాళాలు పగులగొట్టి ఎల్‌సిడి టివితోసహా విలువైన వస్తువులను కాజేశారని, ఈ చోరీ వెనుక అంజలి స్నేహితురాలు నిధి హస్తం ఉండవచ్చని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈరోజు ఉదయం 7.30 గంటల సమయంలో పొరుగింటివారు ఫోన్ చేసి చోరీ గురించి సమాచార మిచ్చారని, వెంటనే తాము వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉందని, ఎల్‌సిడి టీవీ, బెడ్ కింద దాచి పెట్టిన ఇతర విలువైన వస్తువులు కనిపించలేదని అంజలి సోదరి సోమవారం ఉదయం మీడియాకు వెల్లడించింది. టీవీ కొత్తదని, రెండు నెలల క్రితమే కొన్నామని వివరించింది. మరో కుటుంబ సభ్యుడు ఢిల్లీ పోలీసుల పాత్ర గురించి ప్రశ్నించారు.
ఆ ఇంటి ముందు గత ఎనిమిది రోజులుగా పోలీస్‌ల నిఘా ఉండేదని, నిన్న మాత్రం ఎందుకు పోలీసులు లేరో తెలియడం లేదని ప్రశ్నించారు. దీనివెనుక అంజలి స్నేహితురాలు నిధి హస్తం ఉన్నట్టు అనుమానంగా ఉందన్నారు. ఈ చోరీపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. కొత్త సంవత్సరం రోజున ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అంజలి సింగ్‌ను ఓ కారు బలంగా ఢీకొట్టి, 20 కిమీ దూరం ఈడ్చుకెళ్లిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అంజలితోపాటు ఆమె స్నేహితురాలు నిధి కూడా ఉన్నట్టు తరువాత బయటపడింది. ప్రమాదం చూసి తాను భయపడడంతో పోలీసులకు చెప్పలేక పోయానని నిధి పేర్కొంది.
అంతేగాక అంజలి మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడిపినట్టు నిధి అరోపించింది. కానీ అంజలి మృతదేహం పోస్ట్‌మార్టమ్ నివేదికలో మద్యం ఏవించినట్టు ఆధారాలు కనిపించలేదు. దీంతో నిధి వ్యాఖ్యలపై అనుమానాలు తలెత్తాయి. అంజలి మేనమామ దీనిపై మాట్లాడుతూ మొదట నిధి రహస్యంగా దాగుండి, అంజలి అంత్యక్రియలు తరువాత బయటకు వచ్చిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు పోలీసులకు కానీ, లేదా కుటుంబీకులకు కానీ సమాచారం చెప్పవలసిన మానవత్వం ఆమెకు లేదా అని ప్రశ్నించారు. దీని వెనుక నిధి కుట్ర ఉందని ఆరోపించారు.