Thursday, January 23, 2025

అందరికీ గజదొంగ… ఆ ఊరి వారికి మంచిదొంగ!

- Advertisement -
- Advertisement -

జూబ్లీ హిల్స్ పోలీసులు మొన్న ఓ దొంగను పట్టుకున్నారు. వాడు అలాంటి ఇలాంటి దొంగ కాదు. కొండవీటి దొంగ. పెద్దలను కొట్టి పేదలకు పంచే మంచి దొంగన్నమాట. పైగా ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడు కూడాను. వాడి హిస్టరీ చూసి పోలీసులే ముక్కున వేలేసుకున్నారు!

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఒక ఇంట్లో ఈనెల 8న ఒక దొంగతనం జరిగింది. ఐదు లక్షల రూపాయల విలువైన రుద్రాక్షతోపాటు బంగారు గొలుసు చోరీ అయింది. పోలీసులు రంగంలోకి దిగి, 75 కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అయినా దొంగ ఆచూకీ దొరకలేదు. చివరికి వెంకటగిరి ప్రాంతంలోని సిసి కెమెరాల్లో ఆ దొంగ ఆనవాళ్ళు దొరికాయి. అదే దొంగ మళ్లీ నగరానికి వచ్చినట్లు తెలుసుకుని, వాడి కదలికలపై నిఘా పెట్టి, శుక్రవారనాడు యూసుఫ్ గుడా చెక్ పోస్ట్ వద్ద పట్టుకుని అరెస్ట్ చేశారు. వాడి గురించి తీగె లాగితే డొంకంతా కదిలింది.

ఆ దొంగ పేరు మహ్మద్ ఇర్ఫాన్. ముంబయిలో బ్యాగులు కుట్టడం వాడి వృత్తి. దొంగతనాలు చేయడం ప్రవృత్తి. ఇతని స్వగ్రామం బీహార్ లోని గర్హ సమీపంలో జోహియా. ఊళ్లో అందరూ అతన్ని రాబిన్ హుడ్ అంటారు. ఎందుకంటే దొంగతనాలు చేసి సంపాదించిన డబ్బును ఊళ్లో పేదలకోసం ఖర్చు చేస్తాడు. పైగా ఊళ్లో విద్యుత్ స్తంభాలు కూడా వేయించడంతో ప్రజలంతా అతనికి ఉజ్వల్ అని పేరు పెట్టారు.

ఇర్ఫాన్ కేవలం బంగారం, వజ్రాలే దొంగతనం చేస్తాడు. వెండి వస్తువులు ముట్టుకోడు. దొంగతనాలు చేయడంలోనూ ఇర్ఫాన్ స్టయిలే వేరు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చోరీలు చేస్తాడు. దొంగతనానికి దిగే ముందు రెక్కీ చేస్తాడు. ఎక్కడెక్కడ సిసి కెమెరాలు ఉన్నాయో చూసుకుని, వాటి కంట్లో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు.

మొదటి భార్య ఉన్నా, ముంబాయిలోని ఒక పబ్ లో బార్ గర్ల్ గా పనిచేసే గుల్షన్ ను పెళ్ళి చేసుకున్నాడు. కోల్ కతాకు చెందిన మరో అమ్మాయిని మూడో పెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్యనే పూజ అనే అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. పైగా ఆమె పేరును చేతి మీద పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు.

ఇర్ఫాన్ ను అరెస్టు చేసిన పోలీసులు అతనినుంచి రెండు స్క్రూ డ్రైవర్లు, జియో డాంగిల్, టెక్నో స్మార్ట్ సెల్ ఫోన్, మంకీ క్యాప్ ఉన్న చొక్కా స్వాధీనం చేసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News