Monday, January 20, 2025

సిద్ధాంతాలు లేని కమ్యూనిస్టులు!

- Advertisement -
- Advertisement -

ఆ పార్టీ పేర్లలో కమ్యూనిస్టు, మార్క్సిస్టు అనే పదాలు వాటి పుట్టుక నుండి ఉన్నాయి కాబట్టి వాటిని అలా పిలవడమే తప్ప ఆ పదాలతో, వాటి వెనుక ఉన్న సిద్ధాంతాలతో ఆ పార్టీలకు ఏ మాత్రం సంబంధం లేనట్లే అవి వ్యవహరిస్తున్న సందర్భాలెన్నో ఉన్నాయి. తెలంగాణలో ఆ పార్టీలు వేస్తున్న రాజకీయ కుప్పిగంతులు చూస్తుంటే ఏదో ఒక బలమైన పార్టీ తోక పట్టుకొని ఒకటో, రెండో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే చాలు అన్నట్లు ఆశగా వాటి వైపు చూస్తున్నట్లుగా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఇప్పటి వరకు కాంగ్రెస్ నుండి ఎలాంటి ఖచ్చితమైన మాట రాకున్నా ఆ పార్టీపైనే గంపెడు ఆశలు పెట్టుకొని ఎదురుచూడడం వాటి వంతైంది. రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థల మార్పుకోసం భూస్వామ్య, వ్యాపార, బూర్జువా వర్గాలపై కార్మిక, శ్రామిక సంఘటిత నాయకత్వంతో నిరంతరం పోరు సాగించాల్సిన కమ్యూనిస్టు పార్టీలు అసలు కార్యం మరిచిపోయి అసెంబ్లీ యావలో పడిపోవడం విడ్డూరంగా ఉంది. ఒక స్థిరమైన రాజకీయ దృక్పథం కలిగి ఉండడం ఏ పార్టీకైనా కనీస అవసరం. సైద్ధాంతిక పునాదిపై పుట్టి పెరిగిన పార్టీలకు అది మరీ ప్రధానం.

మునుగోడు ఉప ఎన్నికలో సహకారానికి ప్రత్యుపకారంగా భారాస తమవాళ్లను ఎంఎల్‌ఎగానో, ఎంఎల్‌సిగానో చట్టసభల్లోకి చెయ్యి పట్టుకొని తీసుకెళుతుందని విశ్వాసంతో ఇన్నాళ్లు ఆ పార్టీలు కాలం గడిపాయి. మునుగోలు ఫలితాల తర్వాత దాని ఊసే లేదు. కెసిఆర్ తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లు విడుదల చేయడంతో వీరి అంచనాలు తారుమారయ్యాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా భారాస, వామపక్షాల పొత్తు ఉంటుందని కెసిఆర్ చెప్పిన మాటలు నమ్మి రాజకీయంగా చాలా ముందుకు వెళ్లామని ఇప్పుడు వామపక్ష నేతలు పసిపిల్ల వాళ్ళలా మాట్లాడుతున్నారు. నిజానికి ఒక చిన్న మాటకే వారికివారే పెంచుకున్న ఆశలే ఎక్కువ. అసెంబ్లీ ఎన్నికల వేళ భారాస నుండి కమ్యూనిస్టులకు లభించేది రిక్తహస్తమే అని ఎవరైనా ఊహించగలరు. తలలు పండిన సిపిఐ నేతలు భవిష్యత్తును అంచనా వేయకుండా ఇప్పుడు బేలగా మాట్లాడడం వారి రాజకీయ పరిణతికి ప్రశ్నార్థకంగా ఉంది. భారాసపై ఆశలు సన్నగిల్లాక కాంగ్రెస్‌తో వారి రాయబారాలు మొదలయ్యాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భారాస ఓటమి లక్ష్యంగా పని చేయాలనీ సిపిఐ తమ శ్రేణులకు ఈ మధ్య పిలుపునిచ్చింది. భారాస సీట్లు ఇస్తే బిజెపి, కాంగ్రెస్‌ల ఓటమి కోసం కృషి చేయాలనీ పిలుపునిచ్చేవారేమో! ఎర్ర జెండాకు జతగా ఏ జెండాను ఎత్తమని నేతలు కోరితే ఆ రకమైన వేషం కట్టే స్థాయికి కార్యకర్తలు దిగిరాక తప్పడం లేదు.

సైద్ధాంతిక ఆచరణ తెలిసిన పార్టీ సేవకులు ఈనిర్ణయాల వల్ల విస్మయపడక తప్పదు. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే నిన్న మునుగోడులో భారాస జీపులు ఎక్కి ముందు వరుసలో నిలబడి జై కొట్టిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్ జీపులు ఎక్కాలి. నైతికంగా ఎంతో దిగజారుడు తనానికి ఈ చర్యలు సాక్ష్యంగా నిలుస్తాయి. ఈ రెండు జెండాల ధోరణితో తమ ఓటర్లకు సిపిఐ ఏమి సందేశాన్ని ఇస్తున్నట్లో, ఎన్ని సందేహాలను కల్పిస్తున్నట్లో ఆ నాయకులకే తెలియాలి. ఒకటి, రెండు సీట్ల ఆశకు రంగులు మారుస్తుంటే పార్టీ పేరులో కమ్యూనిజం పదం నేతిబీరకాయ చందమే అవుతుంది. ఇలా కమ్యూనిజాన్ని నవ్వులపాలు చేసే కన్నా ఉన్న నలుగురు నేతలు ఏదో ఒక బలమైన పార్టీలో చేరిపోతే ఈ ఎదురు చూపులు, శృంగభంగాలు ఉండవు. కార్యకర్తలు కూడా గందరగోళ పడరు. నిజంగా కమ్యూనిజంపై చిత్తశుద్ధి ఉన్నవారెవరైనా మిగిలితే వారే ఎర్రజెండాకు వారసులుగా పార్టీని ముందుకు తీసుకుపోవచ్చు. జనంలో బలాబలాలు ఎలా ఉన్నా పార్టీ ప్రాథమిక సైద్ధాంతిక విలువలను కాపాడవలసిన ధర్మం నాయకులపై ఉన్నది. ఏదో పార్టీ తోక పట్టుకొని అసెంబ్లీలో అధ్యక్షా అనాలని కాంక్ష పూర్తిగా వ్యక్తిగతమైనదే. ఒకరిద్దరు సిపిఐ లేదా సిపిఎం నేతలు చట్టసభల్లో గొంతెత్తినంత మాత్రాన ప్రజలకు ఒరిగేదేమి లేదు. అంతకన్నా గొప్ప ఫలితాలు రోడ్డెక్కి ఉద్యమాల, నిరసనల, ఆందోళనల ద్వారా సాధించవచ్చు. దీనికి వారి చరిత్రనే సాక్ష్యం.

కమ్యూనిజం సిద్ధాంత స్థిరీకరణలను ఆచరించే వారే నిజమైన కమ్యూనిస్టులు. కమ్యూనిటీ అనగా అందరికీ చెందినది అని అర్థం. భూమ్మీది వనరులన్నీ ఉమ్మడి యాజమాన్య ఆస్తిగా పరిగణించేదే కమ్యూనిజం. నడుస్తున్న సమాజంలో సాంఘిక, ఆర్థిక, రాజకీయ మార్పు కోసం పని చేసేది, దాని ఆచరణ ద్వారా సామాజిక అసమానతలు తొలగిపోవాలి. కార్ల్ మార్క్ తన దాస్ క్యాపిటల్ ద్వారా చెప్పిన శ్రమ దోపిడీ వివరణల ఆధారంగా వస్తు ఉత్పత్తిలో శ్రామికుడి కృషికి సరి సమానంగా లాభాల్లోనూ భాగముండాలని, శ్రామికుడు, పెట్టుబడిదారుడు అనే రెండు వర్గాలు కలిసిపోయి వర్గరహిత సమాజం ఏర్పడాలి అనేది అంతిమ లక్ష్యం. అయితే అలాంటి సమాజాన్ని స్థాపించేందుకు శ్రామికులంతా ఒక్కటై దోపిడీ వ్యవస్థను కూలదోయాలి. ఆ సంఘటిత శక్తి ద్వారా ఏర్పడేదే కమ్యూనిస్ట్ పార్టీ. అందులో సభ్యత్వముండగానే ఆ వ్యక్తి కమ్యూనిస్టు అయిపోడు. సిద్ధాంతాన్ని ఆచరణబద్ధంగా అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో పాటించలేకపోతే తాను కమ్యూనిస్టును అని కాకుండా ఆ పార్టీ సభ్యున్ని అని మాత్రమే చెప్పుకోవాలి. కమ్యూనిజం గమనానికి భిన్నంగా మరో వైపు 20వ శతాబ్దం ఆరంభం నుండి పారిశ్రామిక దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ మరింత పెరిగింది. క్రమంగా ఆధునిక మధ్యతరగతి ఆర్థికంగా బలపడింది. యంత్రాల ఆవిష్కరణతో కార్మికుల చేతుల్లోంచి ఉత్పత్తి జారిపోతోంది. మనిషికి ఇచ్చే కూలి కన్నా తక్కువ వ్యయంతో పనిచేసే రోబోలు వచ్చాయి. అభివృద్ధిలో పోటీ పడేందుకు కమ్యూనిస్టు దేశాలు కూడా పెట్టుబడి బాటలో నడుస్తున్నాయి.

అయితే ఈ మార్పులన్నీ ఆయా దేశాల్లో పాలకుల ప్రాబల్యంతో వచ్చినవే తప్ప కమ్యూనిజం సిద్ధాంతానికి, సూత్రాలకు ఎలాంటి సంబంధం లేదు. పుస్తకాల్లో ఉన్న సిద్ధాంతం అలాగే ఉంది. కమ్యూనిస్టు అనే పదానికి అర్థం మారలేదు. ఏనాటికైనా శ్రామిక శ్రేయోరాజ్య దిశగా జరిగే ఉద్యమంలో పాల్గొనేవాడే కమ్యూనిస్టు. స్థితిమంతులైన అగ్రకుల ఆధిపత్య రాజ్యాన్ని, దోపిడీ వర్గాలకు కొమ్ముకాసే వారి పాలనా నియమాలను నిర్ద్వంద్వంగా నిలదీసేవాడే కమ్యూనిస్టు. ఈ లెక్కన మన కమ్యూనిస్టుల సిద్ధాంతం ఎంత పలుచబడి పోయిందో అర్థమవుతోంది.బిజెపికి వ్యతిరేకంగా ఏర్పడ్డ జాతీయ స్థాయి కూటమి ‘ఇండియా’లో కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్, తదితర పార్టీలతో కలిసిపోయినందున దేశ మంతటా సిపిఐ, సిపిఎంలు కాంగ్రెస్‌తో జత కట్టవచ్చని ఓ స్థూల సూత్రీకరణ ఏర్పడవచ్చు. ఇందుకోసమైనా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల ప్రాబల్యమున్న స్థానాలను కొన్నిటిని వారికి కేటాయించవచ్చు. ఇప్పుడు రాష్ట్రంలో పార్టీల పరిస్థితి కప్పల తక్కెడలా ఉంది. చివరి రోజు దాకా ఎవరు ఏ పార్టీ నుండి నామినేషన్ వేస్తారో తెలియదు. భారాసలో బెర్తు లభించనివారు కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు. ప్రధాన పార్టీల్లోంచి ఎన్నికల్లో నిలబడే అవకాశం దొరికేవారిలో అగ్రకులాలవారే ఎక్కువ. ఈ పరిస్థితుల్లో వద్దన్న పార్టీపై కక్ష కట్టి చేరదీసిన పార్టీకి జై కొట్టడం ఏ కమ్యూనిస్టు సిద్ధాంతసారమో ఆ నేతలే చెప్పాలి.ఏదో ఒక ప్రధాన పార్టీకి మిత్రపక్షంగా అసెంబ్లీలో అడుగుపెడితే కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాన్నే కాదు గొంతుకను కూడా వదులుకున్నట్లే.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News