Tuesday, November 5, 2024

ఆర్‌టిసి బస్సుల్లో పండగ అదనపు ఛార్జీలుండవు

- Advertisement -
- Advertisement -

There are no extra charges for RTC buses run to Dasara

దసరాకు నడిపే స్పెషల్ సర్వీసుల్లో మొదటిసారిగా మామూలు ఛార్జీలు

మన తెలంగాణ/హైదరాబాద్ : బస్సు ప్రయాణికులకు ఆర్‌టిసి సంస్థ తీపి కబురు అందించింది. దసరా పండుగ సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సులపై ఎటువంటి అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. ప్రతియేటా పండుగలప్పుడు అదనపు బస్సుల పేరిట అదనపు రుసం వసూలు చేస్తున్న ఆర్‌టిసి… ఈ సారి మాత్రం తన పంథాను మార్చుకుంది. సాదరణ ఛార్జీలకే అదనపు బస్సుల్లోనూ ప్రయాణించే ఏర్పాట్లు చేసింది. ఈమేరకు ఆదివారం ఆర్‌టిసి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తగు ఆదేశాలు జారీ చేశారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఐపిఎస్ అధికారి సజ్జనార్ పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత సంస్థ పురోభివృద్ధి కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పండుగల సమయంలో ప్రయాణికులకు భారంగా మారిన అదనపు ఛార్జీలను ఈ సారి పూర్తిగా పక్కనపెట్టారు. మామూలు రోజుల్లో వసూలు చేస్తున్న ఛార్జీలతోనే అన్ని ప్రాంతాలకు బస్సులను నడిపే విధంగా చర్యలు తీసుకున్నారు. తద్వారా మరింత ఎక్కువ మంది ప్రయాణికుల ఆదారాభిమానాలను చూరగొనే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. కాగా సజ్జనార్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బస్సు ప్రయాణికులు ఆయనను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

ఇదిలా ఉండగా ప్రయాణికుల సౌకర్యం, భద్రతే ధ్యేయంగా ఆర్‌టిసి సంస్థ సేవలందిస్తుందని సజ్జనార్ వెల్లడించారు. ఇందులో భాగంగానే ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారం పడకుండా తగు చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. గడిచిన ఐదు రోజుల్లో కోటి 30 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేశామన్నారు. ప్రయాణికులు చూపించే ఆదరాభిమానాలే సంస్థ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌టిసి బస్సులో ప్రయాణం చేసి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ప్రస్తుతం పలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆర్‌టిసిని తిరిగి గాడిన పెట్టేందుకు అవసరమైన అన్ని అంశాలపై దృష్టి సారించామన్నారు. ఆ దిశగా తగు కసరత్తు కూడా మొదలుపెట్టామన్నారు. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌలభ్యం కోసం సంస్థ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడమే కాకుండా కాలనీలకే బస్సులు పంపే ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఆర్‌టిసిని ఆదరించండి!

సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం చేయడం కోసం ప్రయాణికులు టిఎస్ ఆర్‌టిసిని ఆదరించాలని సంస్థ ఎండి సజ్జనార్ కోరారు. త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్న కోరికతో ప్రైవేటు సంస్థల ప్రయాణాలపై మొగ్గుచూపవద్దన్నారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ప్రైవేటు సంస్థల యజమాన్యాల నుంచి ఎటువంటి సహకారం కూడా లభించదన్నారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రయాణాల కంటే ఆర్‌టిసి బస్సు అత్యంత సురక్షతమైనదని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే వాణిజ్య, రవాణా ప్రయోజనాల కోసం వైట్-ప్లేట్ వాహనాలను ఉపయోగించడం చట్టవిరుద్ధమన్నారు. విషయం మోటరు వాహన చట్టం (ఎంవి)లో కూడా పొందుపర్చారన్నారు. సెక్షన్ 66 ఎంవి చట్టం ప్రకారం రవాణా వాహనాలకు అనుమతులు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే సెక్షన్ 192 ఎ సెక్షన్ ప్రకారం నిర్దేశించిన శిక్ష ఉంటుందన్నారు.

ఈ మేరకు గత కొద్ది రోజుల నుంచి నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై ఆర్‌టిఎ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారన్నారు. డ్రైవర్, వాహన యజమానుదారుల వివరాలు సరిగా లేకపోవడంతో 20 వాహనాలను కూడా సీజ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సజ్జనార్ పేర్కొన్నారు. ఒకవేళ వైట్ ప్లేట్ ట్యాక్సీలలో ప్రయాణించే ప్రయాణీకులకు ఏదైనా జరిగితే, బాధిత వ్యక్తులకు ఎలాంటి బీమా పథకాలు వర్తించవన్నారు. ఈ విషయాన్ని గుర్తించి ప్రయాణీకులు స్వంత భద్రత కోసం ఆర్‌టిసి బస్సు సేవలను ఉపయోగించడం ప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News