Sunday, December 22, 2024

పరిశీలకుల డేగ కళ్లు

- Advertisement -
- Advertisement -

నేతల మాట, తీరు, ఖర్చులు…అన్నీ ఈసీ లెక్కలోకే
పరిశీలకుల నివేదికలే ఈసీకి ఆధారం
నేతల ప్రసంగాలన్నీ రికార్డు చేస్తున్న అబ్జర్వర్లు
పోలీసులను కూడా వదిలిపెట్టని ఈసీ
పోస్టల్ బ్యాలెట్‌లు ఇవ్వడం లేదని ఫిర్యాదులు
అన్నీ లెక్కలేస్తున్న పరిశీలకులు

మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సమరంలో కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన పరిశీలకుల బృందాలు డేగ కళ్ళతో అన్నింటినీ గమనిస్తున్నారనే విషయాన్ని రాజకీయ పార్టీల నాయకులు విస్మరించినట్లున్నారనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. అబ్జర్వర్లు (పరిశీలకులు) తమను, తమ వ్యవహార శైలి, సభలు, సమావేశాల్లో మాట్లాడుతున్న తీరుతెన్నులను క్షుణ్ణంగా రికార్డు చేస్తున్నారనే విషయాలను మరచిపోయి వ్యవహరిస్తున్నారని, అందుకే సాధారణ కార్యకర్త నుంచి పార్టీల అధిష్టానం పెద్దల వరకూ ఈసీ నుంచి నోటీసులు అందుకుంటున్నారనే విమర్శలున్నాయి. బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్ షోలు, శాంతిభద్రతలు, మద్యం పంపిణీ, వాహనాల లెక్కలు, రాజకీయ పార్టీల విందులు, డబ్బు వెదజల్లుతున్న వైనం దగ్గర్నుంచి అన్ని అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్లు, స్కాడ్‌లు, ఈసీ ఇంటెలిజెన్స్ వర్గాలు అత్యంత లోతుగా, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని ఎన్నికల సంఘానికి చెందిన కొందరు సీనియర్ నాయకులు వివరించారు.

ఈ ఎన్నికల్లో ప్రత్యేకత ఏమిటంటే పోలీసు శాఖపైన కొన్ని ఫిర్యాదులు అందాయని, చివరకు పోలీసుల పనితీరుపైన కూడా ఈసీకి చెందిన లా అండ్ ఆర్డర్ పరిశీలకులే కాకుండా ఫ్లయ్యింగ్ స్కాడ్ అధికారులు ఆమూగ్రం పరిశీలిస్తూనే ఉన్నారని వివరించారు. పోలీస్ స్టేషన్లనే అడ్డాగా చేసుకొని కొందరు సబ్-ఇన్‌స్పెక్టర్లు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల నేతృత్వంలోనే డబ్బు పంపిణీ జరుగుతోందని ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదులు అందాయని వివరించారు. ఈ ఎన్నికల్లో మరో సంచలనం ఏమిటంటే గత మూడు రోజులుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలు ఇవ్వడంలేదని కొందరు ఉద్యోగులు కూడా కొందరు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు ఫిర్యాదులు కూడా చేశారని, ఈ విషయాన్ని నేరుగా న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు సమాచారాన్ని చేరవేశారని ఆ అధికారులు వివరించారు. అందుకే ఈసారి ప్రత్యేకంగా పోలీసుల పనితీరు పరిశీలనకు, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల పనితీరును పరిశీలించేందుకు ఉత్తర భారత రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను పురమాయించినట్లు తెలిసింది.

కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ ప్రత్యేక పరిశీలకులు రెండు కళ్ళు, చెవులు, ముక్కుగా పనిచేస్తున్నారని వివరించారు. ఒక రాజకీయ పార్టీపైన మరొక ప్రత్యర్ధి రాజకీయ పార్టీ నాయకులు ఎదుటి వారి లోపాలను ఎత్తిచూపుతూ ఫిర్యాదులు చేయడం సర్వసాధారణమని, అయితే ఎన్నికల సంఘం అధికారులు విపక్షాల ఫిర్యాదులనే కాకుండా ఆయా అంశాలపై పరిశీలకులు ఇచ్చిన నివేదికలను కూడా ఈసీ పెద్దలు మొదటి ప్రాధాన్యతగా పరిగణనలోకి తీసుకుంటారని, ప్రస్తుతం రాష్ట్రంలో రైతుబంధుకు అనుమతులు ఇవ్వడంగానీ, ఇచ్చిన అనుమతులను ఉపసంహరించు కోవడానికి దారితీసిన పరిణామాలు కూడా అలాంటివేనని ఆ అధికారులు వివరించారు. రైతుబంధుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులు ఒక పద్దతిలో ఉంటే ఎన్నికల సంఘం ఇచ్చిన అనుమతిని రద్దు చేయడానికి పొందుపరిచిన అంశాలు వేరని, ఈ చర్య ఎన్నికల సంఘం ఎంత లోతుగా, సూక్ష్మంగా సభలు, సమావేశాలను, నేతల ప్రసంగాలను రికార్డు చేస్తుందో అర్ధంచేసుకోవాలని కోరారు.

మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, చివరకు ప్రధానమంత్రి ప్రసంగాలను సైతం కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్లు రికార్డు చేశారని వివరించారు. అందుకే ఈసీ పరిశీలకుల కళ్ళుగప్పి స్టార్ క్యాంపెయినర్లు తప్పించుకోలేరని అంటున్నారు. ఎటొచ్చీ గ్రామీణ ప్రాంతాల్లో, బస్తీలల్లో, తాండాల్లో జరుగుతున్న మద్యం పంపిణీ, నగదు పంపిణీలను మాత్రం ఎంత మంది పరిశీలకులు వచ్చినా, ఎంతలా జల్లెడపట్టి వెదికినా నగదు, మద్యం పంపిణీలను నూటికినూరు శాతం అరికట్టలేరని ఆ అధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. అంతేగాక రాష్ట్రంలో ఓటుకు అయిదు వేల రూపాయల నుంచి డిమాండ్‌ను బట్టి, స్థానిక పరిస్థితులను బట్టి ఆరు వేలు, ఏడు వేలు నుంచి చివరకు పది వేల రూపాయల వరకూ ఓట్ల కొనుగోళ్ళు జరుగుతున్నాయని, ఈ విషయాలు ఎన్నికల సంఘం అబ్జర్వర్ల దృష్టికి కూడా వచ్చిందని, అయితే వాటిని నిరూపించడానికి సాక్షాధారాలు లభించడంలేదని, కేవలం నోటి మాటలు మాత్రమే పరిశీలకుల దృష్టికి వచ్చాయని వివరించారు. అంతేగాక కొందరు ఎమ్మెల్యేల సహకారంతో పోస్టింగ్‌లు తీసుకొన్న సబ్-ఇన్‌స్పెక్టర్లు, మరికొందరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు పోలీస్ స్టేషన్లనే అడ్డాగా చేసుకొని డబ్బులు పంచుతున్నారని అబ్జర్వర్లకు స్పష్టంగా తెలిసిందని, కాకుంటే ఇప్పటి వరకూ పోలీస్ స్టేషన్లపై నిఘా పెట్టలేదు గనుక ఎవ్వరినీ ఆధారాలతో పట్టుకోలేకపోయామని, ఇప్పుడు నిఘా పెట్టామని, మైక్రో కెమెరాలతో పోలీస్ అధికారుల పనితీరును పరిశీలిస్తున్నామని, ఈ అక్రమాల్లో దొరికిపోయి ఏ పోలీస్ అధికారి అయినా సస్పెండ్ కావడమే కాకుండా రిటైర్ అయ్యే వరకూ లూప్‌లైన్‌లలోనే కొనసాగాల్సిందే తప్ప ఒంటిపైకి యూనిఫాం రాదని, అంతటి తీవ్రంగా శిక్షించడానికి ఎన్నికల సంఘానికి విస్తృతాధికారాలు ఉన్నాయని వివరించారు.

పోస్టింగ్‌లు ఇప్పించిన గాడ్‌ఫాదర్‌లను ఎమ్మెల్యేలుగా గెలిపించుకొనేందుకు కొందరు పోలీస్ అధికారులు పడరాని పాట్లు పడుతున్నారని, కానీ ఎన్నికల అక్రమాలకు పాల్పడుతూ ఈసీకి దొరికిపోతే మాత్రం తమతమ గాడ్‌ఫాదర్‌లు కూడా తమను కాపాడలేరనే విషయాన్ని ఆ పోలీస్ అధికారులు తెలుసుకోలేకపోతున్నారని ఆ అధికారులు వివరించారు. వీటికితోడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవిఎం)లను ట్యాంపరింగ్ చేస్తున్నారా? ఇది సాధ్యమా? కాదా? అనే అంశాలపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు కూడా జరుగుతున్న విషయాలు ఎన్నికల పరిశీలకుల దృష్టికి వచ్చాయని, నలుగురైదుగురు కలిసి చోట్ల ఈ విషయాలపైన ఓటర్లు (ప్రజలు) చర్చించుకొంటున్నారని, వాటిని కొందరు పరిశీలకులు విన్నారని వివరించారు. ఎందుకంటే ఈ పరిశీలకులు సభలు, సమావేశాలు, రచ్చబండ చర్చలు, రోడ్ షోలు కూడా వెళుతుంటారని, అంతేగాక ఈ పరిశీలకులే విలేకరులుగా అవతారమెత్తి స్థానికులతో మాటలు కలిపి డబ్బు, మద్యం పంపిణీలే కాకుండా కోళ్ళు, గొర్రెలు, చేపలు, ఇతర బంగారు ఆభరణాలు, వెండి వస్తువుల పంపిణీలు ఎలా జరుగుతున్నాయనే అంశాలపైన ఆరా తీస్తున్నారని వివరించారు. ఇలా ఏ పార్టీ నాయకులు ఏం చేసినా ఆయా అక్రమాల చిట్టాలన్నీ ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్ధులుగా ఎవ్వరైతే బరిలో ఉన్నారో వారి ఖాతాలోకే వెళతాయని, ఇందులో దొంగ దొరికితే మాత్రం వివరణ కూడా తీసుకోకుండానే ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటుందని, అంతటి తీవ్రంగా అబ్జర్వర్ల నివేదికలను ఈసీ సీరియస్‌గా తీసుకుంటుందని ఆ అధికారులు కూలంకషంగా వివరించారు. ఇకనైనా రాష్ట్రంలో ఎన్నికల సమరంలో తలమునకలైన వివిధ పార్టీల రాజకీయ నాయకులు జాగరూకతతో వ్యవహరిస్తార? లేదో? చూడాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News