పాక్ ప్రధాని సలహాదారుడి అభిప్రాయం
లాహోర్: జమ్మూ కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన అనంతరం 2019 ఆగస్టులో పాకిస్తాన్‌తో భారత్ నిలిపివేసిన వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకోవలసిన అవసరం ఉందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి వాణిజ్య వ్యవహారాలలో సలహాదారుడైన అబ్దుల్ రజాక్ దావూద్ అభిప్రాయపడ్డారు. ఆదివారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భారత్‌తో వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించుకోవడం తక్షణ అవసరమని, ఇది ఉభయ దేశాలకు ప్రయోజనకరమని అన్నారు. తమ మంత్రిత్వ శాఖకు సంబంధించినంతవరకు భారత్‌తో వాణిజ్యాన్ని కొనసాగించాలన్నదే తమ వైఖరని, భారత్‌తో వాణిజ్య సంబంధాలను వెంటనే పునరుద్ధరించుకోవాలన్నదే తాను అభిప్రాయపడుతున్నానని ఆయన చెప్పారు. అబ్దుల్ రజాక్ తాజా వ్యాఖ్యల దరిమిలా ఉభయ దేశాల మధ్య వాణిజ్య సంబంధాల పునరుద్ధరణపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయని ది డాన్ దినపత్రిక వ్యాఖ్యానించింది. అయితే 2021 మార్చిలో భారత్ నుంచి చక్కెర, పత్తి దిగుమతిపై నిషేధాన్ని పాకిస్తాన్‌కు చెందిన ఆర్థిక సమన్వయ కమిటీ ఎత్తివేయగా విదేశీ వ్యవహారాల శాఖ అనుమతి లేకుండా ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకుందన్న కారణంతో ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్ ఉపసంహరించుకుంది.