Wednesday, January 22, 2025

దేవుడున్నాడు- అజ్ఞానం కూడా వుంది?

- Advertisement -
- Advertisement -

దేవుడున్నాడని నమ్మే భక్తులతో పాటు మనం కూడా వున్నాడనే నమ్ముదాం. ఎందుకంటే ప్రపంచంలో చీకటి వుంది. అజ్ఞానం వుంది. లేవని అనలేం కదా? అలాగే దేవుడు కూడా వున్నాడు. అజ్ఞానం వున్న చోట దేవుడుంటాడు. జ్ఞానం వెలుగులు ప్రసరించిన చోట మాయమైపోతాడు. ఇందులో మరో మాటకు తావు లేదు. ఊరికే దైవభక్తుల విశ్వాసాలతో గొడవ ఎందుకూ? దేవుడున్నాడు. అజ్ఞానం కూడా వుంది. ఆ రెండూ ఒకటే కాబట్టి అజ్ఞానం దేవుడున్నాడు! దైవభావనలో అజ్ఞానం వుంది!! యదార్థాన్ని ఒప్పుకోని వారితో మనకు పేచీ లేదు. ఈ రకంగా కూడా ఒకసారి ఆలోచించి చూడమని చెపుతున్నాం అంతే!!
పాలల్లో నెయ్యి కనబడదు.

ఈ విశ్వంలో దేవుడు కనబడడు. పాలల్లో నెయ్యి కనబడనంత మాత్రాన నెయ్యి లేనట్టు కాదు గదా? అని ఆస్థికులు వితండవాదం చేస్తుంటారు. వాళ్ళు ఆలోచించాల్సిందేమంటే పాలల్లో నెయ్యి తియ్యడానికి ఒక పద్ధతి వుంది. ఆ పద్ధతి ప్రకారం ఎవరు చూసినా, ఎప్పుడు చేసినా, ఎక్కడ చేసినా పాల నుండి నెయ్యి తియ్యొచ్చు. అలాగే విశ్వంలోని దేవుణ్ణి వెలికి తీయడానికి శతాబ్దాలుగా యోగులు, భక్తులు ప్రయత్నిస్తున్నారు. అయినా బయట పడడం లేదు. అన్ని మతాల భక్తులూ ప్రయత్నిస్తూనే వున్నారు. ఎవరేం చేసినా అంతా వృథా! ఏ దేవుడూ ఎక్కడా, ఎప్పుడూ ఎవరికీ కనబడలేదు. సింబాలిక్‌గా వ్యాఖ్యానాలు చేయడం సులభమేమో గాని, నిజంగా వెతికి చూపడం సాధ్యం కాలేదు.

ఇక ముందు కూడా కాదు. లేనిది చూపడం, శూన్యాన్ని ప్రదర్శించడం ఎవరివల్లా కాదు. అలా చూపిస్తామన్న వాళ్ళు మోసగాళ్ళవుతారు. అలాంటి వారికి చట్టప్రకారం శిక్షలు వేయాలే గాని, స్వేచ్ఛగా సభ్య సమాజంలో తిరగనీయరాదు. మెదళ్ళు లేని జనం అలాంటి వారి పాదాల మీద పడి దొర్లుతూ వుంటే, బుద్ధిలేని ప్రభుత్వాలు వారికి వసతులు కల్పిస్తున్నాయి. చూసి ఆనందిస్తున్నాయి!!

సూర్యుడి కిరణాలు చర్మానికి స్పర్శ ద్వారా తెలుస్తున్నాయి. సూర్యుడు వున్నాడు అని అనడానికి ఆధారముంది. మరి దేవుడనే వాడు వుంటే అతడి కిరణాలేవీ? అతడి దయకు, చల్లని చూపుకి ఆధారాలేవీ? ఆస్థికులు మేజిక్కులు రాసుకొని తృప్తి పడుతుంటారు. జనమంతా ఆ మేజిక్కులకు గిమిక్కులకు పరవశించిపోవాలని ఆశిస్తుంటారు. దేవుడుంటే హత్యలు, అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? నేరాలని ఆపలేని దేవుడు నీ కష్టాలను తీరుస్తాడని ఎలా నమ్ముతున్నావ్? దేవుడుంటే తప్పు చేసిన వారికి ఎందుకు చంపడం లేదు? రాక్షసులు తప్పు చేస్తే దేవుడు వారిని శిక్షించాడని, శపించాడని, చంపాడని రకరకాలుగా కట్టు కథలు రాసుకుని శతాబ్దాలుగా ప్రచారం చేస్తున్నారు కదా? మరి ఇప్పుడు సమాజంలో కొందరు తప్పులు చేస్తున్నారు.

నేరాలకు, ఘోరాలకు పాల్పడుతున్నారు ‘సంభవామి యుగే యుగే’ అని చెప్పుకొన్న ఆ దేవుడు ఎందుకు రావడం లేదు? తన విధ్యుక్త ధర్మాన్ని మరిచిన వాడు దేవుడెలా అవుతాడు? ఏ పనీ చేతకానప్పుడు వున్నా, లేకున్నా ఒకటే కదా? అంటే అంతా అబద్ధమేనన్న మాట! కల్పించుకొన్న కట్టు కథలతో ఎంత కాలమని స్వాంతన పొందుతారు? వాస్తవాల నుండి ఎంత కాలమని పారిపోతారు? దేవుడు వున్నాడని ఘంటాపథంగా ప్రచారం చేసే పురాణాల విషయానికొద్దాం!

‘రామాయణ, మహాభారత, భాగవత గ్రంథాలన్నీ పుక్కిటి పురాణాలు కావు, ఇతిహాసాలు!’ అని గొప్పగా చెప్పుకొనేవారు ఒక ప్రశ్నకు సమాధానమివ్వాలి. ఇతిహాసం అంటే చరిత్ర! మరి ఈ పురాణ గ్రంథాలలో చారిత్రక అంశాలేవీ? బుద్ధుడి గురించి గాని, మౌర్య వంశం గురించి గాని, గుప్తరాజుల గురించి గాని హర్షుడి గురించి గాని ఎక్కడా ఏవీ లేవెందుకు? ఏడు వందల యాభై యేళ్ళ క్రితం బౌద్ధ విశ్వవిద్యాలయాలు తగులబెట్టి నాశనం చేసిన సంఘటనలు ఈ ఇతిహాసాల్లో లేవెందుకు? ఈ వివరాలన్నీ ఆనాటి చీనీ యాత్రికుల నోట్స్ నుండి సంగ్రహించుకోవాల్సి వచ్చింది కదా? చివరకు సింధూ నాగరికత గురించి ఈ ఇతిహాసాల్లో ఏమైనా వుందా? ఏదీ లేదే? మరి వీటిని ‘ఇతిహాసాలని’ ఎలా అంటారు? పుక్కిటి పురాణాలనే అనాలి? పైగా బుద్ధుడి కాలంలో ఏ సంస్కృతి వుంది? బుద్ధుడి తండ్రి ఏ ధర్మం పాటించేవాడు? అని ప్రశ్నిస్తూ అతి తెలివి ప్రదర్శిస్తారు.

ముందు విశ్వాసాల్ని, కట్టు కథల్ని, మహిమల్ని పక్కన పెట్టి యదార్థాన్ని అర్థం చేసుకోగలిగితే, అన్ని అర్థమవుతాయి. బుద్ధుడి కాలంలో విలసిల్లింది శ్రమన సంస్కృతి. అశోకుడి స్తంభాల గురించి ఈ బ్రాహ్మణవాదులకు తెలియదు. తెలుసుకోరు. పైగా అశోక స్తంభాన్ని ‘భీముడి గధ’ అని ప్రచారం చేస్తారు. ఆ స్తంభాల మీద చెక్కి వున్న శాసనాలు కూడా అర్థం చేసుకోరు. రామాయణ, మహాభారతంలోని అంశాలు అందులో చెక్కి వున్నాయని భ్రమపడతారు. జనానికి కూడా అదే భ్రమ కల్పిస్తారు. ముందు కాస్త చరిత్ర, భూగోళం, సైన్స్ చదువుకోండిరా బాబూ! రామాయణ, భారతాల్ని కావ్యాలనండి. సృజనాత్మక రచనలనండి. అందరూ ఒప్పుకుంటారు. ఇతిహాసాలంటారా? మీరు తప్పులో కాలేసినట్టే. చరిత్రకు ఆధారాలుంటాయి. కట్టు కథలకు ఆధారాలుండవు.

గత ఏడు, ఎనిమిది వందల ఏళ్ళ క్రితం తీరిగ్గా కూచుని రాసుకున్న ఈ కల్పిత గాథల్ని ఆ దేవదేవుడే దిగి వచ్చి మానవుడికి అందించిపోయాడని మరో కట్టుకథ అల్లి చెప్పుకోండి సాధారణ శకానికి ముందు (అంటే క్రీ.పూ.) నాలుగైదు వేల యేళ్ళ క్రితం నాటి చరిత్ర అంతా పరిశోధకులు వెలికి తీశారు కదా? మీ దేవదేవుడు ఎక్కడా కానరాలేదు. ఆయన వేదాలు, పురాణాలు ఎక్కడ, ఎప్పుడు ఇచ్చాడో తేదీ, సమయం గట్రా ఆధారాలు తీసి చూపండి. ఉట్టి విశ్వాసాలు ఇప్పుడు నడవ్వు. విశ్వాసాల యుగం అంతమైపోయింది. ఇది ప్రతిదీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి తెలుసుకొనే యుగం ప్రారంభమైంది. ఇంకా చచ్చు పుచ్చు కథలు చెపుతామంటే జనం నమ్మరు.

కాలం మారింది. తరం మారింది. వైజ్ఞానిక అవగాహన పెరిగింది. “విజ్ఞానం ద్వారా బలమైన తాత్వికత, నిజాయితీ, బుద్ధి కుశలత లభిస్తాయి. శ్రమ పట్ల గౌరవం ఏర్పడుతుంది. పెరుగుతుంది” అని అన్నారు ప్రసిద్ధ రష్యన్ రచయిత మాక్జిమ్ గోర్కీ. అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవడానికి ఒకటి రెండు మెతుకులు చూస్తే చాలునన్నట్లు పురాణాల్ని అసంబద్ధమైన, తలాతోకా లేని కట్టుకథలని తేల్చడానికి ఒకటి రెండు విషయాలు విశ్లేషించుకుంటే చాలు! రాముడు హనుమంతుడి ఆరాధ్య దైవం. అలాంటి దేవుడి గుప్తాంగాల వివరాలు భక్తుడికి ఎలా తెలుస్తాయీ? వాల్మీకి రామాయణం, సుందరకాండ, 35వ, 17వ శ్లోకం చదివిన వారికి కరెంటు షాక్ తప్పదు. 1927 నాటి ప్రతి నుండి, ఇటీవలి ముద్రణ వరకు (గీతా ప్రెస్ గోరక్‌పూర్) విషయం అంతా ఒకటే. మార్పు లేదు.

రాముడి గుప్తాంగాల వర్ణన హనుమంతుడు చేయడం అదీ సీతకు వినిపించడం ఏమిటో మనబోటి వారికి అర్థమే కాదు. “పురాణాల్లో బూతు పురాణాలు వేరయా అని కాదు, పురాణాలంటే బూతు పురాణా లేనయా’ అని అనుకోవాల్సి వస్తోంది. విజ్ఞులు ఆలోచించాలి. ఎవరి దగ్గరైనా గీతా ప్రెస్ వారు ముద్రించిన మహాభారతం వుంటే, అందులో అనుశాసన పర్వం తిరగేయండి.

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News