Wednesday, January 22, 2025

సోషల్ మీడియాలో మంచితో పాటు చెడూ ఉంది

- Advertisement -
- Advertisement -

మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : గొంతులేని సామాన్యుల భావ వ్యక్తీకరణకు సోషల్ మీడియా వేదిక ఎంతో దోహదపడుతుందని, అయితే కొందరు ఇదే అదనుగా భావిస్తూ, హద్దు,అదుపు లేకుండా స్వేచ్ఛ పేరిట ఉచ్ఛరించడానికి వీలుకాని భాషను ఉపయోగిస్తున్నారని, ఇలాంటి వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో టియూడబ్ల్యూజే అనుబంధ సంస్థ అయిన ఫిల్మ్ క్రిటిక్స్ (సినిమా బీట్ జర్నలిస్టుల) అసోసియేషన్ నిర్వహించిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నీతి, నిజాయితీ, నిర్భీతితో పనిచేస్తూ ప్రజల గొంతుకగా నిలబడే మీడియా సంస్థలకు, జర్నలిస్టులకు తాత్కాలికంగా కష్టాలు ఎదురైనా, భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి రోజులే ఉంటాయని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మీడియాను తమ చేతుల్లోకి తీసుకుంటున్న బడా వ్యాపార, వాణిజ్య వేత్తలు వృత్తి ధర్మాన్ని విస్మరిస్తూ, ఇష్టానుసారంగా వ్యవహరించడం సహించరానిదన్నారు. దాదాపు ఆరు దశబ్దాల నుండి పనిచేస్తున్న ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కు నాటి నుండి నేటి వరకు తాము సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నట్లు శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

నాడు దేశోద్దారక భవన నిర్మాణానికి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అందించిన సహకారం చిరస్మరణీయమన్నారు. కాగా, రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని, ఎన్నికల నోటిఫికేషన్ ముగిసిన వెంటనే సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో తాను సమావేశమై, దశల వారీగా వీలైనంత తొందరలో వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రముఖ దర్శకులు తమ్మిరెడ్డి భరద్వాజా మాట్లాడుతూ నాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రెస్ అకాడమీకీ తొలి చైర్మన్ గా సమర్థవంతంగా సేవలను అందించి, నేడు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ గా శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం ద్వారా ఆ పదవికి మరింత గౌరవం పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీ మాట్లాడుతూ, తమ సంఘానికి ఎంత చరిత్ర ఉందో… ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కు అంతే చరిత్ర ఉందన్నారు. నాటి నుండి నేటి వరకు తమ సంఘానికి అనుబంధగా పని చేస్తూ, సినిమా బీట్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కృషి చేయడం అభినందనీయమన్నారు. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వీర శంకర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్, ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ, వయోధిక జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ రావు, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురేష్, లక్ష్మీనారాయణ, సహాయ కార్యదర్శి అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News