ముంబై: గతంతో పోల్చితే ప్రస్తుతం టీమిండియాలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన విషయం స్పష్టంగా కనిపిస్తోందని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి సారథ్యంలోని భారత జట్టులో సరైన స్పష్టత లేదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉందన్నాడు. జట్టును ఎంపిక చేసే విషయంలో విరాట్‌కు ఒక స్పష్టత లేదనే విషయం చాలా సార్లు బహిర్గతమైందన్నాడు. దీని ప్రభావం జట్టుపై పడుతుందన్నాడు. తుది జట్టు ఎంపికలో కోహ్లి వ్యవహరించే తీరును కైఫ్ తప్పుపట్టాడు. ఒక మ్యాచ్‌లో ఆడిన ఆటగాడికి తర్వాతి మ్యాచ్‌లో అవకాశం ఉంటుందా లేదా అనే భయం వెంటాడుతుందన్నాడు.
దీంతో ఆ ఆటగాడిపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుందన్నాడు. దీంతో అతను తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోతున్నాడని పేర్కొన్నాడు. ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ కైఫ్ ఈ విషయాలు వెల్లడించాడు. రానున్న ఇంగ్లండ్ సిరీస్ కోహ్లి కెప్టెన్సీ పరీక్షలాంటిదేనన్నాడు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడంతో పాటు జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొందన్నాడు. ఇక తుది జట్టులో ఎవరిని తీసుకోవాలనేది కూడా కోహ్లికి అంత తేలికేం కాదన్నాడు. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒత్తిడిని తట్టుకుని ముందుకు సాగే కోహ్లిని తక్కువ అంచన వేయలేమని కైఫ్ పేర్కొన్నాడు.
There Is No Clarity In Current Indian Team Says Mohammad Kaif