హాని కలిగించే పటాకులు వాడొద్దు ః సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బాణాసంచా(పటాకులు)పై పూర్తి నిషేధం ఏమీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెంగాల్‌లో కాళీపూజ, దీపావళి సందర్భంగా బాణాసంచాపై పూర్తి నిషేధం అమలు చేయాలంటూ ఇటీవల కలకత్తా హైకోర్టు తీర్పు ఇవ్వగా, దాని అమలును నిలిపివేస్తూ పక్కన పెట్టింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బాణాసంచా వ్యాపారులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా సోమవారం ఈ ఆదేశాలిచ్చింది. ఇదే కోర్టు అక్టోబర్ 29న ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే మరింత స్పష్టత ఇస్తున్నామని జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, జస్టిస్ అజయ్స్త్రోగీ ధర్మాసనం తన తీర్పులో పేర్కొన్నది. గత తీర్పులో బేరియం లవణాలతో తయారైన బాణాసంచాను వాడొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే బాణాసంచాను వాడొద్దని తెలిపింది.
అయితే, తమ ఆదేశాలు బాణాసంచాపై పూర్తి నిషేధం విధిస్తున్నట్టు కాదని పేర్కొన్నది. గత తీర్పును గుర్తు చేస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు అందుకు విరుద్ధంగా ఉన్నదని బెంగాల్ వ్యాపారుల తరఫున సుప్రీంకోర్టులో మరోసారి వాదనలు వినిపించారు. దాంతో, తాజా ఆదేశాలను సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చింది. తమ ఆదేశాలకు అనుగుణంగా బెంగాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ధర్మాసనం సూచించింది. నిషేధిత బాణాసంచా రాష్ట్రంలోకి రాకుండా కట్టడి చేయాలని ఆదేశించింది. అధికార యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని తెలిపింది. ఈ అంశంలో ఎవరి దగ్గరైనా తగిన ఆధారాలుంటే కలకత్తా హైకోర్టును ఆశ్రయించవచ్చునని కూడా సూచించింది.