Tuesday, November 5, 2024

సిడిఎస్ బిపిన్‌రావత్ హెలికాప్టర్ ప్రమాదం వెనుక కుట్ర లేదు

- Advertisement -
- Advertisement -

There is no conspiracy behind CDS Bipin Rawat helicopter crash

వాతావరణంలో మార్పు వల్ల పైలట్ నియంత్రణ కోల్పోయారు : ఐఎఎఫ్

న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌స్టాఫ్(సిడిఎస్) జనరల్ బిపిన్‌రావత్, ఆయన భార్యసహా 14మంది దుర్మరణానికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదంపై త్రివిధ దళాల కోర్టు ఆఫ్ ఎంక్వైరీ నివేదికలో పేర్కొన్న అంశాలను భారత వైమానిక దళం(ఐఎఎఫ్) వెల్లడించింది. ప్రమాదం వెనుక కుట్రకోణంగానీ, సాంకేతికలోపంగానీ లేవని నివేదిక పేర్కొన్నది. వాతావరణంలో అనుకోకుండా చోటు చేసుకున్న మార్పుల వల్ల పైలట్ అయోమయానికి గురి కావడంవల్లే ప్రమాదం జరిగిందని తెలిపింది. హెలికాప్టర్ ప్రమాదంపై ఎయిర్ మార్షల్ మాన్వేంద్రసింగ్ నేతృత్వంలో త్రివిధ దళాల కోర్టు ఆఫ్ ఎంక్వైరీ జరిగిన విషయం తెలిసిందే. కమిటీ తమ ప్రాథమిక నివేదికను ఈ నెల మొదటివారంలో రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సమర్పించింది.

లోయలోని వాతావరణంలో ఏర్పడ్డ అనూహ్య మార్పుల వల్ల సిడిఎస్ బిపిన్‌రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ17వి 5 హెలికాప్టర్ మేఘాలలో చిక్కుకోవడంతో హెలికాప్టర్‌పై పైలట్ నియంత్రణ కోల్పోయారని నివేదికలో పేర్కొన్నారని ఐఎఎఫ్ తెలిపింది. ఈ ప్రమాదానికి ఎలాంటి సాంకేతిక, యాంత్రిక లోపాలు కారణం కాదని స్పష్టం చేసింది. హెలికాప్టర్ ప్రమాదంపై నియమించిన కమిటీ స్థానిక ప్రత్యక్ష సాక్షుల నుంచి సమాచారం సేకరించిందని తెలిపింది. హెలికాప్టర్ ఫ్లైట్ డేటా రికార్డర్‌తోపాటు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను విశ్లేషించింది. గతేడాది డిసెంబర్ 8న బిపిన్ రావత్‌సహా 14మంది ప్రయాణిస్తున్నహెలికాప్టర్ తమిళనాడులోని కూనూర్ సమీపంలో కూలిపోయిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News