మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ
మనతెలంగాణ/ హైదరాబాద్ : అంగన్‌వాడీ సూపర్‌వైజర్ గ్రేడ్-2 ఉద్యోగ పరీక్ష నిర్వహణను పూర్తిగా జెఎన్‌టియు జరిపిందని, ప్రశ్నపత్రం బయటకు వచ్చిందన్న వార్తలు అవాస్తవమని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ తెలిపింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు దయచేసి ఎటువంటి వదంతులు, అవాస్తవ ప్రకటనలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. పరీక్షకు సంబంధిత సిలబస్‌ను జెఎన్‌టియూకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అందజేసిందని, పరీక్ష పత్రం తయారీ, పరీక్షనిర్వహణ కట్టుదిట్టమైన భద్రతల మధ్య జెఎన్‌టియూ ఆధ్వర్యంలో జరిగిందన్నారు.
ఓ పత్రికలో ప్రచురించిన విధంగా పరీక్ష పత్రం బయటకు రావడం పూర్తిగా అవాస్తవమని తెలిపారు. అభ్యర్థుల మార్కులను, పరీక్ష పత్రం ఓఎంఆర్ పత్రాలను శాఖ వెబ్‌సైట్‌లో ఉంచామని తెలిపారు. ఏ విధమైన అక్రమాలు జరగకుండా ఇడబ్ల్యూఎస్ పత్రాలను జిల్లా కలెక్టర్‌ల ధ్రువీకరణ తరువాతే వాటిని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. విద్యా, రెవెన్యూ, వైద్య శాఖలకు సంబందించిన పత్రాలను ఆయా శాఖల ధ్రువీకరణ తరువాతే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఏమైనా అక్రమాలు జరిగినట్లు అభ్యర్థుల దృష్టికి వచ్చినట్లయితే తగిన ఆధారాలతో అభ్యర్థులు మహిళాభివృది శిశు సంక్షేమ శాఖ కు తెలియజేయాలని కోరారు. అభ్యర్థులు తమ సందేహలను మహిళాభివృది శిశు సంక్షేమ శాఖ హెల్ప్ లైన్ నెంబర్ 91-6304147961 కు ఫోన్ చేయాలని కోరారు.