Tuesday, November 5, 2024

ప్రీ లాంచ్ ఆఫర్ల గందరగోళం

- Advertisement -
- Advertisement -

There is no news of pre-launch offers cheating customers in Hyderabad

 

ఈ రోజుల్లో సొంత ఇంటి కోసం తపించని వారుండరు. ఎవరైనా వారి ఆర్థిక స్తోమతను బట్టి చిన్నదో. పెద్దదో నివాసాన్ని సమకూర్చుకునే పనిలో ఉంటారు. ఎందుకంటే ఆదాయంలో ఇంటి కిరాయి సింహభాగమై జీతం రాగానే చేతులు ఖాళీ అయినట్లు అనిపిస్తుంది. సొంత ఇల్లుంటే ఖర్చులు, కష్టాలు సగం దాకా తగ్గినట్లే. ఈ క్రమంలో ఇళ్ల స్థలాలకు, ఇళ్లకు, అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లకు ఎక్కడ లేని డిమాండ్ వచ్చింది. ధరలు చుక్కలను దాటాయి. సొంతమైన చిన్న గూడైన పర్వాలేదు సర్దుకుబతుకుదాం అనే స్థితిలో చాల కుటుంబాలున్నాయి. దీని వల్ల గృహ నిర్మాణ రంగం రెక్కలు చాచి విస్తరిస్తోంది. కట్టినాక ఎల్‌ఆర్ ఎస్, బిఆర్‌ఎస్ ఏదో కాపాడకపోతుందా అనే భరోసాతో నగరాల్లోని ఖాళీజాగాల్లో భవంతులు లేస్తున్నాయి. ఎవరిదీ, ఎక్కడిది, ఎలా వచ్చింది అనేది పట్టించుకోకుండా కొంటున్నారు, ఉంటున్నారు, అవసరానికి అమ్ముకుంటున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు. తమతో పాటు వేలాది మంది ఉన్నారు. అందరికి కష్టమొస్తే తమకు వస్తది. గుంపుగా ఏ నాయకుడు దగ్గరికెళ్ళినా నిబంధనలను పక్కన పెట్టి కాపాడుతాడు. తర్వాత ఎన్నికలప్పుడో, మరెప్పుడో గట్టి హామీ రాకపోతుందా అనే నమ్మకం. ఏది ఏమైనా ఇల్లు పోదనే ధీమా మాత్రం ఉంటోంది.

ఇదే విధంగా మధ్య తరగతి జీవులు కనీసం నగర శివారు అపార్ట్‌మెంట్‌లలో ఓ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుక్కోవాలని ఆశ పడుతుంటారు. ఆశతో పాటు చదరపు అడుగుకి ధర ఎంత తగ్గితే అంత భారం తగ్గుతుంది అనే ఆలోచన కూడా వెంటాడుతుంది. ఇప్పుడు ఐదు లక్షలిస్తే ఫ్లాట్ బుక్ అవుతుంది. నిర్మాణం అవుతున్న కొద్దీ మిగితాది వాయిదాల్లో ఇవ్వవచ్చు. అన్ని హంగులు పూర్తయి ఫ్లాట్ అప్పగించేందుకు రెండేళ్లు పడుతుంది. ఇప్పుడైతే చదరపు అడుగుకి రూ. ౩౦౦౦/-, వెంచర్ పూర్తయ్యాక తీసుకుంటే రూ. 4500 /- నుండి 5000/- దాకా ఉంటుంది. కోరుకున్న ఫ్లాట్ ఇప్పుడైతేనే దొరుకుతుంది.

పూర్తయ్యాక కొనాలంటే అప్పటికే అమ్ముడుపోగా మిగిలినవి తీసుకోవలసి వస్తుంది అనగానే ఇప్పుడే బుక్ చేసుకుంటాని అనేవారు ఎక్కువ. అందుబాటులో ధర, వాయిదాల సదుపాయం, ఓ రెండేళ్లు బయట ఎలాగో గడిపితే డబ్బును ఆదా చేసినట్లవుతుంది అని ఎవరికైనా అనిపిస్తుంది. డబ్బుకి, ఇల్లు కట్టిస్తాడని ఏమి భరోసా అంటే ఇంత మందిని ముంచుతారా.. అందరు కలిసి నిలదీయరా.. అనే విశ్వాసం నిలబెడుతుంది. అన్న సమయానికి కాకున్నా కొంత అటో ఇటో నిర్మాణాలు జరుగుతున్నాయి. అప్పగింతలు, నివాసాలు కొనసాగుతున్నాయి. ఇలా ప్రీ లాంచ్ ఆఫర్లు ఏనాటి నుంచో నడుస్తున్నాయి. ఇది చట్టబద్ధమా, కదా అనే కన్నా ఇలా కొనకపోతే రెండు విధాలా నష్టపోతామనే భావన కొనుకోలుదారుల్లో ఉంది.

రియల్ ఎస్టేట్ వెబ్ సైట్లలోకి వెళితే వందల్లో ప్రీ లాంచ్ ఆఫర్ల వివరాలుంటాయి. రేరా అనుమతి ఉన్నవి, లేనివి అన్నీ కనిపిస్తాయి. రెండున్నర కోట్ల విలువైన రెండు వేలచదరపు గజాల వాణిజ్య చోటు కూడా ఇందులో ఉంది. ఇలాంటి ఆఫర్లను లోధా, డి ఎల్‌ఎఫ్, గోద్రెజ్, ఎల్ అండ్ టి కంపెనీలు కూడా ఇస్తున్నట్లు 360 రియల్ టైమ్, స్క్వెర్ యార్డ్ సైట్లలో చూడచ్చు. ప్రీ లాంచ్ ఆఫర్ వల్ల బిల్డర్‌కి కట్టడానికి కావలసిన మూలధనం తేలిగ్గా లభిస్తుంది. బిల్డర్ తన సొమ్మునో లేదా ఫైనాన్స్ ద్వారానో నిధులు సమకూర్చుకునే కన్నా ఇది సులభ మార్గమని, ఏ వెంచర్ సొమ్ములు దానికే వినియోగిస్తే సరిపోతుందని అనుకుంటాడు.

బిల్డర్లు ప్రీ లాంచ్ ఆఫర్ పేరిట బిల్డర్లు వందల కోట్ల మోసాలకు పాల్పడుతున్నారు అని ఈ మధ్య ఓ తెలుగు టివి ఛానల్ ఎవరికీ తెలియని విషయాన్ని తామే బయటపెట్టినట్లు వరుస కథనాలు ప్రసారం చేసింది. బిల్డర్లు భూమి కొనకుండానే, ప్లాన్ అప్రూవల్ కాకుండానే బ్రోచర్లపై రంగుల హంగుల బొమ్మలేసి అమాయకుల నుండి డబ్బులు దండుకుంటున్నారు.. ఏదేని కారణాల వల్ల అనుమతులు దొరక్కపోయినా, నిర్మాణం మొదలు కాకున్నా కొనుగోలుదారుల నష్టానికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నిస్తోంది. విధి విధానాలను పక్కనపెడుతున్నందున వాటి చర్యలు చట్ట విరుద్ధమని, ఇలాంటి వాటిలో వేలు పెట్టి నష్టపోకండని జాగ్రత్తలు చెప్పింది. శాస్త్ర ప్రకారం చూస్తే ఎలాంటి అనుమతులు లేని ప్రీ లాంచ్ ఆఫర్లు రిస్కుతో కూడుకున్నవే. అయితే ఎర్లీ బర్ద్ బెనిఫిట్ ఆశతోనో, ఫస్ట్ కమ్ ఫస్ట్ సెర్వ్ అనో అనేక మంది వచ్చే లాభాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రీ లాంచ్‌లో పెట్టుబడులు పెడుతున్నారు.

ప్రీ లాంచ్ ఆఫర్‌కు ఎలాంటి చట్టపర హామీ లేకున్నా కస్టమరు బిల్డర్ల చరిత్ర చూస్తున్నాడు. ఇది వరకు ఆ బిల్డరుతో గాని, వారి ఏజెంట్‌తోగాని ఉన్న నమ్మకమైన సంబం ధం, క్రితం లావాదేవీల్లో ఎలాంటి మోసం, తప్పుడు పని లేకపోవడంతో లెక్క, పత్రం లేకుండా లక్షల రూపాయలు ఎవరి బ్యాంకు ఖాతాలో వేయమంటే వారి ఖాతాలో వేసేస్తున్నారు. చాలా మంది రియల్టర్లు, బిల్డర్లు విలువైన కస్టమర్లను కాపాడుకునే దిశగా, వారి సంతృప్తే పెట్టుబడిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇందులో లెక్కకు రాని సంపాదన ఓ వైపు, లెక్కలు చూపని వ్యాపారం మరో వైపు ఉన్నాయి. ఇరువైపులా సొంత పబ్బాలు గడుపుకుంటూ ఉంటాయి. ఇందులో కొందరు మిడిల్ క్లాస్ జీవులుంటారు. భారీగా కనబడుతూ వందల కోట్ల వ్యాపారం చేస్తున్నవారు తమనొక్కరిని ముంచుతారా అని వీరు నమ్ముతుంటారు. ఇలా ఆలోచించకపోతే ఊహించిన భయం కన్నా జరిగే నష్టం ఎక్కువ. నిజానికి పరిస్థితి అంత మోసకారకంగా, నికర నష్టంగా ఉంటే వేలల్లో ఉన్న ప్రీ లాంచ్ ఆఫర్లలో డబ్బులు పెట్టినవారు ఈ పాటికి బిల్డర్ల ఆఫీసుల ముందు ధర్నా చేసేవారు, మా డబ్బులు మాకీయ్యండని నిలదీసేవారు. ఇప్పటికైతే ఈ టివి ప్రసారాలకు ఎవరు బెంబేలెత్తినట్లు లేదు. వారు తమ బిల్డర్లను నమ్ముతున్నట్లే ఉంది.

ప్రస్తుతానికి హైదరాబాద్‌లో కస్టమర్లను నిండా ముంచిన ప్రీ లాంచ్ ఆఫర్ల వార్తలేమి లేవు. క్రమంగా అన్ని అనుమతులు, నియమాలు దాటి తమకు ఫ్లాట్ అప్పగిస్తాడనే నమ్మకంతోనే ఆఫర్ పొందిన వారిలో ఉంది. ఏది ఏమైనా అనుమతుల రహితంగా ప్రీ లాంచ్ వ్యాపారం చేయడం చట్టపర నేరమే. అయితే అది ఇరువైపులా ఆమోదయోగ్యంగా, పరస్పరం నమ్మకంగా, అధిక శాతం విజయవంతంగా సాగుతోంది. బిల్డర్లు నిర్మాణ రంగాన్ని దెబ్బ తీయకుండా, కస్టమర్ల విశ్వాసం కాపాడే విధంగా వారి సంఘం ట్రెడా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉద్దేశపూర్వకంగానో, కాలం కలిసిరాకనో కొందరు బిల్డర్లు తమ ప్రీ లాంచ్ ఆఫర్ కస్టమర్లను మోసగించినా ఆ భూతాన్ని పెద్దగా చూపితే దేశ పరిశ్రమల్లో ప్రధాన రంగం కుదేలు అయ్యే ప్రమాదముంది. జాగ్రత్తలు చెప్పడం అవసరమే కాని కొండ నాలిక మందేస్తే ఉన్న నాలుకపోయేలా భయభ్రాంతులకు తావీయకూడదు. మరోమాట.. ఎంతో కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో ఇంటి కల సాకారం చేసుకునేవారు ఇలాంటి సాహసాలు చేయకపోవడమే శ్రేయస్కరం. ఇక పెట్టుబడిదారుల విషయానికొస్తే అన్ని గుడ్లు ఒకే బుట్టిలో పెట్టకూడదు అనే ఇంగ్లీష్ సామెత ప్రకారం వైవిధ్యంతో రియల్ ఎస్టేట్ ఒక రంగం మాత్రమే అనుకోవాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News