న్యూఢిల్లీ : దేశంలో ఇంతవరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసు ఏదీ బయటపడలేదని ప్రభుత్వ అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఇండియన్ సార్స్ కొవి 2 జీనోమిక్ కన్సార్టియా (ఇన్సాకాగ్) ఈ పరిస్థితిని చాలా లోతుగా పరిశీలిస్తోందని, అంతర్జాతీయ ప్రయాణికుల పాజిటివ్ నమూనాల జన్యు విశ్లేషణ ఫలితాలను వేగవంతం చేస్తోందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. చాలా దేశాలకు ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించడంపై కేంద్ర ప్రభుత్వం ఆదివారం రిస్కున్న దేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలపై నిబంధనలను మరింత కట్టుదిట్టం చేసింది. ఈమేరకు రాష్ట్రాలకు కూడా కరోనా పరీక్షలు, పర్యవేక్షణ ప్రమాణాలు వేగంగా నిర్వహించాలని ఆదేశాలు పంపింది. అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించే విషయం సమీక్షించాలని నిర్ణయించింది. ఐరోపా దేశాలు బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోత్సానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంగ్‌కాంగ్, ఇజ్రాయెల్ దేశాలు రిస్కున్ను దేశాలుగా పరిగణిస్తున్నారు.