Sunday, December 22, 2024

మణిపూర్‌లో శాంతి భద్రతలే లేవు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మణిపూర్‌లో మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు నత్త నడకన సాగడంపై ఆందోళన వ్యక్తం చేసిన న్యాయస్థానం6 వేలకు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయితే కేవలం ఏడుగురినే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలే లేవని, అక్కడ రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిపోయిందని వ్యాఖ్యానించింది. కేసులను దర్యాప్తు చేసే సామర్థమూ మణిపూర్ పోలీసులకు లేదని పేర్కొంది. వీటిపై పూర్తి వివరాలతో రాష్ట్ర డిజిపి వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తూ కేసు విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది.

మణిపూర్ అమానుష ఘటనలపై వరసగా రెండో రోజూ వాదనలు విన్నప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పోలీసుల తీరుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది.‘ రాష్ట్ర పోలీసులు నియంత్రణ కోల్పోయారు.వారికి దర్యాప్తు చేసే సామర్థం లేదు.అక్కడ శాంతిభద్రతలు అసలే లేవు.ఒక వేళ శాంతిభద్రతల యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించలేకపోతే ప్రజలకు ఏం ప్రయోజనం?సాయుధ మూకకు ఆ మహిళలను అప్పగించిన వారిని( పోలీసులను) రాష్ట్ర పోలీసులు ప్రశ్నించారా? శాంతిభద్రతల పరిస్థితిపై రాష్ట్ర పోలీసులు నియంత్రణ కోల్పోయారు.గడచిన రెండు నెలలుగా అక్కడ శాంతిభద్రతలు, రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిపోయాయి.

దర్యాప్తు కూడా చాలా నెమ్మదిగా సాగుతోంది’ అని సుప్రీం ధర్మాసనం ఆక్షేపించింది.ఎఫ్‌ఐఆర్‌లలో ఎంతమంది నిందితులున్నారు. వారి అరెస్టుకు తీసుకున్న చర్యలేమిటి?అని సుప్రీంకోర్టు పేర్కొంది.మణిపూర్ హింసకు సంబంధించి దాఖలయిన విజ్ఞప్తులపై వచ్చే సోమవారం విచారణ జరుపుతామని, ఆ రోజు రాష్ట్ర డిజిపి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. మరో వైపు భారీ స్థాయిలో నమోదయిన ఎఫ్‌ఐఆర్‌లను ప్రస్తావిస్తూ దర్యాప్తునకు మౌలిక వసతులు ఏ మేరకు ఉన్నాయని సిబిఐని ప్రశ్నించింది. ఇదే విషయమై అంతకు ముందు కేంద్రం, రాష్ట్రప్రభుత్వం తరఫున సిలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ మహిళలను వివస్త్రలను చేసిన ఘటనలో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. మణిపూర్ హింసకు సంబంధించి ఇప్పటివరకు 6,523 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

వాటిలో 11 ఎఫ్‌ఐఆర్‌లు మహిళలను వివస్త్రలుగా చేసిన ఘటనకు సంబంధించినవని చెప్పారు.ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం కేవలం ఒకటి, రెండు కేసులు మినహా మిగతా కేసుల్లో అరెస్టుల మాటేమిటి?ఆరువేల ఎఫ్‌ఐఆర్‌లు నమోదయితే కేవలం ఏడుగురిని అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించగా సొలిసిటర్ జనరల్‌నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో సుప్రీంకోర్టు పోలీసుల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.దీనిపై సొలిసిటర్ జనరల్ స్పందిస్తూ దర్యాప్తులో ఎలాంటి జాప్యం జరగకుండా చూసుకుంటామని,11 ఎఫ్‌ఐఆర్‌లను సిబిఐకి బదిలీ చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News