న్యూఢిల్లీ : నీట్, జేఈఈ, సీయూఈటీ, వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను విలీనం చేసే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. రాజస్థాన్ లోని కోట శిక్షణ కేంద్రంలో విద్యార్థులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నుంచి మొదలు పెట్టిన సీయూఈటీ లోకే నీట్, జేఈఈ మెయిన్‌ను విలీనం చేయాలని యోచిస్తున్నట్టు యూజిసీ ఛైర్మన్ ఎం. జగదీశ్‌కుమార్ ఇటీవల చెప్పారు. ప్రస్తుతం ఈ మూడు పరీక్షలనూ ఎన్‌టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) నిర్వహిస్తోంది.
మూడు వేర్వేరు పరీక్షలను ఒకే పరీక్ష కిందికి తెస్తే ఎన్‌టీఏ దాన్ని మరింత సమర్ధంగా నిర్వహించడానికి వీలవుతుంది. విద్యార్థులు ఒకే పరీక్ష రాసి తమకు వచ్చిన మార్కుల ఆధారంగా ఏదో ఒక కోర్సును ఎంచుకోడానికి వీలవుతుంది. అందుకే ఈ కొత్త విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నాం.” అని ఆయన అన్నారు. అయితే ఈ తరహా నిర్ణయాలను తొందరపడి తీసుకోకూడదని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. దీంతో ఈ నిర్ణయంపై విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఒకింత ఆందోళనకు గురయ్యాయి. ఈ క్రమం లోనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నుంచి స్పందన వచ్చింది. ప్రస్తుతానికి విలీన ప్రతిపాదనేదీ లేదన్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు.