Monday, December 23, 2024

ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కెసిఆర్
బిఆర్‌ఎస్ దుబ్బాక ఎంఎల్‌ఎ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై
హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించిన సిఎం

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజాతీర్పును ఎదుర్కోలేక భౌతిక దాడులు,హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటని సిఎం పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇటువంటి సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు బిఆర్‌ఎస్ నేతలకు, కార్యకర్తలకు అధినేత పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్ నాయకులపై, కార్యకర్తలపై ఎవరు దాడులకు పాల్పడ్డా సహించేది లేదని అన్నారు. నియోజకవర్గాల పర్యటనలో ఉన్న సిఎం కొత్త ప్రభాకర్‌రెడ్డి హత్యాయత్నం దుర్ఘటనపై మంత్రి హరీశ్ రావుతో ఫోన్‌లో మాట్లాడి ఆరా తీశారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు.
ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు : గవర్నర్ తమిళిసై
సిద్దిపేట జిల్లా దౌల్తాపూర్ మండలం సూరంపల్లిలో మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ డిజిపికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదకమని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేసే సమయంలో వారి భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వేఛ్చాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం శాంతియుత వాతావరణం ఉండేలా చూడటం చాలా అవసరమని గవర్నర్ పేర్కొన్నారు.
ప్రభాకర్‌రెడ్డిపై కాంగ్రెస్ గుండాల దాడిని ఖండిస్తున్నా : కెటిఆర్
ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ గుండాలు చేసిన భౌతిక దాడిని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి కాంగ్రెస్ పార్టీ తమ నాయకులపై భౌతిక దాడులకు దిగి, వారిని అంతమొందించాలని చూస్తుందని ఆరోపించారు. దుర్మార్గుడైన ఒక నేరస్తుడు రేవంత్ రెడ్డిని టిపిసిసి అధ్యక్షుడిగా చేసినందునే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ఈ దాడిపై ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
ప్రభాకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం : మంత్రి హరీశ్‌రావు
మెదక్ ఎంపీ,దుబ్బాక బిఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి అత్యంత గర్హనీయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు అని, ఈ ఘటనను ప్రభుత్వం, బిఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు. ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికిత్స అందించేందుకు సికింద్రాబాద్ యశోధ ఆస్పత్రికి తరలించామన్నారు. ప్రభాకర్ రెడ్డికి కత్తిపోటుతో కడుపులో గాయాలయ్యాయని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు,బిఆర్‌ఎస్ కేడర్ ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని, అధైర్య పడవద్దని అన్నారు. ప్రభాకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నంలో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలకు తావులేదు : మంత్రి నిరంజన్ రెడ్డి
ఎన్నికల ప్రచారం సందర్భంగా దుబ్బాక బిఆర్‌ఎస్ అభ్యర్థి, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఖండించారు. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలకు తావులేదని, బాధ్యులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
హత్యా రాజకీయాలను తిరస్కరిద్ధాం : దాసోజు శ్రవణ్
దుబ్బాక బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌పై జరిగిన హత్యాయత్నాన్ని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ తీవ్రంగా ఖండించారు. రాజకీయాలలో వాదాలు, సంవాదాలు ఉండాలి కానీ కక్షలు, కార్పన్యాలు, హత్యలు ఉండకూడదని అన్నారు. ఇది తెలంగాణ సంస్కృతికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పెడధోరణి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి హత్యా రాజకీయాలను తిరస్కరిద్దామని పేర్కొన్నారు. ఈ హత్యా ప్రయత్నం వెనుక ఎంతటి పెద్దవాళ్ళు ఉన్నా సరే వారందరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఓడిపోతున్నామనే అక్కసుతో ప్రతిపక్షాలు దాడులకు తెగబడుతున్నాయి : గంగుల
మెదక్ ఎంపి, బిఆర్‌ఎస్ దుబ్బాక ఎంఎల్‌ఎ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి గర్హనీయమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడిని మంత్రి ఖండించారు. ఓడిపోతున్నామనే అక్కసుతో ప్రతిపక్షాలు దాడులకు తెగబడుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటులేదని, ప్రజాతీర్పే అంతిమం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో సిఎం కెసిఆర్ జన రంజక పాలనతో రాబోయే ఎన్నికల్లో వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు దాడులకు పాల్పడడం దారుణమని అన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేయడం అత్యంత తీవ్ర ఘటన అంటూ మండిపడ్డారు. నీచ రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాల వైఖరిని ప్రజలు గమనించాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News