మన తెలంగాణ/హసన్‌పర్తి: ప్రతీ ఒక్కరూ ప్రతీ రోజు ఉదయం కనీసం రెండు గంటల పాటు వ్యాయామానికి కేటాయించినట్లయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని.. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదని హసన్‌పర్తి సిఐ తుమ్మ గోపి అన్నారు. మంగళవారం హసన్‌పర్తి పెద్ద చెరువులో యువకులతో కలిసి సిఐ ఈత కొట్టారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. యువకులను ప్రోత్సహించడానికి వారితో కలిసి చెరువులో గంట సేపు ఈత కొట్టారు.
యువత మానసిక, శారీరక దృఢత్వం కోసం కృషి చేయడం లేదని వ్యసనాలకు, సెల్‌ఫోన్‌కు బానిసవుతున్నారని దాని వల్ల వారు చిన్న చిన్న విషయాలకే భావోద్వేగాలకు లోనై భవిష్యత్‌ను కోల్పోతున్నారని హెచ్చరించారు. ప్రతీ రోజు ఒక గంట సేపు నడక, పరుగు, ఈత, సైక్లింగ్ ఏదైనా ఒక వ్యాయామం చేసినట్లయితే విద్యార్థులు, యువత మానసికంగా, శారీరకంగా ఉండి భవిష్యత్‌లో వచ్చే సవాళ్లను ఎదుర్కో గల్గుతారన్నారు. ప్రతీ రోజు గంట సేపు వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో స్విమ్మర్స్ వేల్పుల పెద్దలు, పెద్దమ్మ శ్రీనివాస్, అనుమాండ్ల విద్యాసాగర్, బరుపటి జగదీశ్వర్, రాజు, ఉమేష్, కర్ణాకర్, శ్రీనివాస్, రమేశ్ పాల్గొన్నారు.