మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదీయాజమాన్యబోర్డు తరలింపు నిర్ణయాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బోర్డును హైదరాబాద్‌నుంచి తరలించి విశాఖ పట్నంలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. విశాఖలో బోర్డు ఏర్పాటుకు అవసరమైన కార్యాలయ వసతిని కూడా సిద్దం చేసేప్రయత్నాల్లో ఉంది. ఈ ఏడాది మార్చిలోపు హైదారాబాద్ నుంచి కృష్ణాబోర్డు కార్యాలయాన్ని విశాఖకు తరలించాలని ప్రభుత్వం ఇప్పటికే తన ప్రయత్నాలు ప్రారంభించింది. ఏపి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తెలుగు రా్రష్ట్రాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కృష్ణానదికి ఏమాత్రం సంబంధం లేని విశాఖ పట్నంలో కృష్ణాబోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం పట్ల బోర్డులోని ఉన్నత స్థాయి అధికారులు సైతం సుముఖంగా లేరు. బోర్డును ప్రస్తుతం ఉన్న హైదరాబాద్‌లోనే కొనసాగించాలని వారు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి అధికారులు సైతం ఇదే విధమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణాబోర్డు కార్యాలయాన్ని విశాఖకు తరలించటం తమకు ఏమాత్రం ఇష్టం లేదని చెబుతున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో బోర్డును ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసుకోవచ్చిన వెసులు బాటు కల్పించినప్పటికీ, హైదరాబాద్ నుంచి బోర్డు కార్యాలయాన్ని ఏపికి తరలించాల్సి వస్తే తెలంగాణ రాష్ట్రానికి కూడా అందుబాటు ఉండే విధంగా ఏపిలోని అనువైన ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కర్నూలు నగరం లేదా నంద్యాలలో బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు జిల్లా కేంద్రాలే కావటం , అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం కృష్నానదిపై వంతెన నిర్మించి సిద్దేశ్వరం మీదుగా జాతీయ రహదారిని ఏర్పాటు చేస్తున్నందున రెండు ప్రాంతాలు హైదరాబాద్‌కు 200కిలో మీటర్ల దూరంలోనే ఉంటాయి. హైదరాబాద్ నుంచి వెళ్లి నీటి అవసరాలు , సమావేశాలు , సమీక్షలు తదితర కార్యక్రమాలకు హాజరయ్యేందుకు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుందని నీటిపారుదల శాఖకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు చెబుతున్నారు.
అలా కాకుండా కృష్ణాబోర్డును విశాఖ పట్నంలో ఏర్పాటు చేస్తే ఇక్కడి నుంచి సుమారు 700కిలోమీటర్లు ప్రయాణించాలని, బోర్డు సమావేశాలకు హాజరు కావటం ఎక్కువ సమయంతోపాటు వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారంగా మారుంతుంది. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని బోర్డును విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని , తరలింపు తప్పని సరి అయితే కర్నూలు లేదా నంద్యాలకే తరలించాలన్న డిమాండ్లు పెరగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానదీ జలాలకు సంబంధించిన నీటి వాటాలు , శ్రీశైలం , నాగార్జున సాగర్ తదితర ప్రధానడ్యాంల నిర్వహణ,రిజర్వాయర్లలో నీటి నియంత్రణ, రెండు రాష్ట్రాలకు ఖరీఫ్ ,రీజ సీజన్లలో సాగు నీటి అవసరాల అంచనాలు, వేసవిలో తాగునీటి అవసరాలు, నీటి విడుదల , ప్రధాన కాలువల్లో నీటి ప్రవాహలను టెలిమెట్రీల ద్వారా లెక్కింపు, ప్రాజెక్టుల భద్రత తదితర అంశాలకు అజమాయిషీ, పర్యవేక్షణ కోసొం కేంద్ర ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్యబోర్డును ఏర్పాటు చేసింది.
2014లో ఏపిపునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన కృష్ణాబోర్డును కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోనే ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. ఇదే చట్టంలో గోదావరి బోర్డును తెలంగాణకు కేటాయించింది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌నే నిర్ణయించటం వల్ల కృష్ణాబోర్డును కూడా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశాయి. జలసౌధలో ఏర్పాటయిన బోర్డుకార్యాలయం అప్పటినుంచి ఇక్కడే తన కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తోంది. అప్పటిముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపి ప్రభుత్వ పరిపాలను ఆకస్మికంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. సచివాలయంలోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను హైదరాబాద్‌నుంచి తరలించారు. అయితే కృష్ణాబోర్డును మాత్రం తరలించకుండా ఇక్కడే ఉంచారు.
బోర్డును తరలింపుపై సీమలో అందోళనలు:
కృష్ణానదీయాజమాన్యబోర్డును విశాఖకు తరలింపు నిర్ణయాన్ని నిరసిస్తూ ఆంధప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంత రైతులు , ప్రజాసంఘాలు ఆందోళన బాట పట్టాయి. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్వర్యంలో ఈనెల 18న జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధార్నాలు , ధర్మధీక్షలకు పిలుపు నిచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం 4గంటల వరకూ కలెక్టరేట్ పాలనను స్థంబింప చేయనున్నట్టు సాగునీటి సాధన సమతి అధ్యక్షుడు బొజ్జా దశరధ రామిరెడ్డి వెల్లడించారు. శ్రీశైలం ప్రాజెక్టు నంద్యాల జిల్లా పరధిలో ఉన్నందున కృష్ణాబోర్డు కార్యాలయం నంద్యాల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు కూడా బోర్డు కార్యాలయం నంద్యాలలోనే ఏర్పాటు చేయాలని తీర్మానించారు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఇటీవల జలసౌధలో కృష్ణాబోర్డు చైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్‌ను కలిసి బోర్డు కార్యాలయం కర్నూలు లేదా నంద్యాలలో ఏర్పాటు చేయాలని విజ్ణప్తి చేశారు. రాయలసీమలోని రైతు సంఘాలు , ప్రజాసంఘాలు రైతుల పక్షాన నిలిచి కృష్ణాబోర్డు తరలింపుపై ఆందోళనలు ఉధృతం చేస్తున్నాయి.