Wednesday, January 22, 2025

ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో విస్తృత చర్చ జరగాలి

- Advertisement -
- Advertisement -

మోర్తాడ్ : ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో విస్తృత చర్చ జరగాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజక వర్గం మోర్తాడ్ మండలంలో సుమారు రూ. 10 కోట్ల వ్యయంతో చేపట్టే బిటి రోడ్డు నిర్మాణ పనులకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. 2.90 కోట్లతో తక్కురూవాడ నుండి కుకునూర్ లింక్ వరకు బిటి రోడ్ నిర్మాణం పనులకు మోర్తాడ్ పెద్దవాగు రోడ్డు పై శంకుస్థాపన 6.80 కోట్ల వ్యయంతో మోర్తాడ్ నుండి బషీరాబాద్ వయా వడ్యాట్ బిటి రోడ్ డబుల్ లైన్ పనులకు మోర్తాడ్ మార్కెట్ వద్ద, వడ్యాట్ గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈసందర్భంగా రైతులను, ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో బాల్కొండ నియోజక వర్గంలో అభివృద్ధ్ది పనుల పరంపర నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు. మోర్తాడ్ ప్రాంత రైతులకు ప్యాకేజీ 21 ద్వారా ప్రతి 3 ఎకరాలకు ఒక ఔట్లెట్ పెట్టి, మిషన్ భగీరథ లాగా ఇంటింటికి నల్లా నీరు ఇచ్చినట్లు వ్యవసాయ పొలాలకు నీరు అందించే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వర్షాలు రాకున్నా సాగు నీరు అందించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.

కెసిఆర్ రైతుబంధు, రైతు బీమా. 24 గంటల ఉంచిత విద్యుత్, కరువు కాలంలో కూడా కాళేశ్వరం నీళ్లు ఇస్తూ రైతులకు భరోసాగా నిలబడితే కాంగ్రెస్ పార్టీ వాళ్లేమో రైతులకు హాని తలపెట్టే మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ అనవసరంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నాడు. మేమొస్తే 3 గంటల కరెంటు ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు అన్యాయంగా, దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రిపూట 3 గంటల కరెంటు ఇచ్చి రైతులను గోసపెట్టిన పాత రోజులు మళ్ళీ మనకు కావాలా? కాంగ్రెస్ రేవంత్‌రెడ్డి మాటలపై రైతులు ఆలోచన చేయాలని మంత్రి కోరారు. డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్‌రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు కోటపాటి నర్సింహ నాయుడు, ఎంపిపి శివ లింగు శ్రీనివాస్, జెడ్పిటిసి బద్దం రవి, స్థానిక సర్పంచ్ బోగ ధరణి ఆనంద్, పిఎస్‌సిఎస్ చైర్మన్ కల్లెం ఆశోక్, డిసిసిబి డైరెక్టర్ మోత్కు భూమన్న, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కల్లెదా ఏలియా, ప్రజాప్రతినిధులు, మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News