Sunday, December 22, 2024

కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి

- Advertisement -
- Advertisement -

బిసిల అభివృద్ధికి రూ. రెండు లక్షల కోట్లు కేటాయించాలి
దేశవ్యాప్తంగా పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్‌కు సిఫార్స్ చెయ్యాలి
జాతీయ బిసి కమిషన్ చైర్మన్‌కు బిసి నేతల వినతి

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. బిసి డిమాండ్లను పరిష్కరించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని బిసి నేతలు, జాతీయ బిసి కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో ప్రతినిధి బృందం శుక్రవారం ఢిల్లీలో జాతీయ బిసి కమిషన్ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బిసిల సంక్షేమానికి రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి ఆర్థిక, విద్య, ఉద్యోగ, శిక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని బిసి కమిషన్ చైర్మన్ హంసరాజ్ గంగారాంను కోరినట్లు తెలిపారు. 56 శాతం జనాభా ఉన్న బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ కులాల అభివృద్ధి జరగడం లేదని అన్నారు.

సామాజిక వర్గాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉన్నా, బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని 75 కోట్ల మంది బిసిలకు రూ. 2 వేల కోట్లు కేటాయించి 56 శాతం జనాభా ను అవమానించారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ 45.50 లక్షల కోట్లు ఉంటే 56 శాతం జనాభా గల బిసిలకు కేవలం 2 వేల కోట్లు కేటాయించారన్నారు. ఇది ఏ మూలకు సరిపోతుందని కృష్నయ్య ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన మండల్ కమిషన్ బిసి అభివృద్ధికి 40 సిఫార్సులు చేస్తే అందులో ఆర్థికాభివృద్ధికి 16 సిఫార్సులు చేశారని వాటిలో ఇంతవరకు ఒక్క సిఫార్సు కూడా అమలు చేయలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బిసిలకు విద్యా ఉద్యోగ రంగాలలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించి వీటికి అనుబంధంగా ఆర్థికపరమైన రాయితీలు స్కాలర్ షిప్ లు, ఫీజు మంజూరు, హాస్టల్స్, గురుకుల పాఠశాలలు, నవోదయ పాఠశాలలు, మంజూరుకు బడ్జెట్ కేటాయించడం లేదన్నారు.

అత్యంత వెనుకబడిన బిసిలకు ఆర్థికంగా చేయూతనిచ్చి ప్రతి కుటుంబానికి 10 లక్షల నుండి 50 లక్షల వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. రాజీవ్ ఫెలో షిప్ పథకం కింద అర్హులైన పిహెచ్‌డి స్కాలర్స్ అందరికీ స్టైఫండు మంజూరు చేయాలని, గురుకులపాఠశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు బడ్జెట్ కేటాయించాలని కోరారు. పారిశ్రామిక పాలసీలలో, కాంట్రాక్టుల కేటాయింపులో బిసిలకు 50 శాతం కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అమలు చేసే బిసి పథకాలకు 60 శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని కోరారు.

కేంద్రానికి సిఫార్సు చేస్తా
బిసిల డిమాండ్లు న్యాయమైనవని ఈ డిమాండ్లు పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని చైర్మన్ హంసరాజ్ గంగారాం హామీ ఇచ్చినట్లు ఆర్. కృష్ణయ్య తెలిపారు. చైర్మన్‌ను కలిసిన వారిలో ఆర్.కృష్ణయ్యతో పాటు జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ , డా. మరేష్, మహేందర్, కర్రీ వేణుమాధవ్, నీలా వెంకటేష్, అనంతయ్య, అంగిరేకుల వరప్రసాద్, పేసాగర్, వేముల రామకృష్ణ, పృథ్వి గౌడ్, డా. పద్మలత, కృష్ణ మూర్తి, ఉదయ్ నేత, రవీందర్, శివ, కిరణ్ భాషయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News