ఐఎఎస్ ప్రొబేషనర్ పూజా ఖేద్కర్‌కు ఏడు శాతం లోకోమోటార్ వైకల్య సర్టిఫికేట్ జారీ చేసిన పుణె సమీపంలోని ఒక సివిక్ ఆసుపత్రి ఆ పత్రం నిబంధనలకు అనుగుణంగానే ఉన్నదని, దాని జారీలో ఎటువంటి అక్రమమూ జరగలేదని తమ అంతర్గత దర్యాప్తులో కనుగొన్నట్లు సీనియర్ అధికారి ఒకరు బుధవారం తెలియజేశారు. పుణె సమీపంలోని పింప్రి చించ్వాడ్ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని యశ్వంత్‌రావ్ చవాన్ స్మారక (వైసిఎం) ఆసుపత్రి 2022 ఆగస్టులో ఖేద్కర్‌కు ఆ సర్టిఫికేట్ జారీ చేసింది. యుపిఎస్‌సి పరీక్షలో ఉత్తీర్ణత కోసం శారీరక వైకల్యం, ఒబిసి కోటాలకు తప్పుడు పద్ధతులు అనుసరించినట్లు ఖేద్కర్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
యుపిఎస్‌సికి ఆమె సమర్పించిన వివిధ సర్టిఫికేట్ల సాధికారతపై దర్యాప్తు జరుగుతోంది. ఖేద్కర్‌కు దివ్యాంగ సర్టిఫికేట్ జారీలో ఏదైనా తప్పు జరిగిందేమో దర్యాప్తు నిర్వహించవలసిందని వైసిఎం ఆసుపత్రిని కోరుతూ జిల్లా కలెక్టరేట్ నుంచి లేఖ అందడంతో ఆసుపత్రి డీన్ డాక్టర్ రాజేంద్ర వాబ్లె ఆసుపత్రిలోని ఇంటర్నల్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ విభాగం నుంచి ఒక నివేదిక అడిగారు. ఆ విభాగం సోమవారం సమర్పించిన నివేదిక ప్రకారం ఏడు శాతం లోకోమోటార్ వైకల్య సర్టిఫికేట్‌ను నిబంధనలను అనుసరించి ఖేద్కర్‌కు జారీ చేసినట్లు డాక్టర్ వాబ్లె తెలిపారు. ‘అయితే, విద్య లేదా ఉద్యోగాల్లో ఏ సౌకర్యాన్నైనా పొందడానికి ఆ సర్టిఫికేట్ ఉపయోగపడదు. ఆ సర్టిఫికేట్‌కు ప్రాముఖ్యం ఏదీ లేదు’ అని ఆయన వివరించారు.