రాష్ట్రంలో ఒంటరిగా 17 స్ధానాల్లో పోటీ చేస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఒంటరిగానే పోటీ చేస్తోందని, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పార్టీతో జత కట్టమని కుండ బద్దలు కొట్టారు. పార్లమెంట్ ఎన్నికల వేళ బిజెపి, బిఆర్‌ఎస్ పొత్తు టాపిక్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టేందుకు లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి, బిఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటాయని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ఈ క్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను నిలువునా దోచుకున్న బిఆర్‌ఎస్ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని ఖరాఖండింగా చెప్పారు. ఆపార్టీ మునిగిపోయే నావ అని అలాంటి పార్టీతో పొత్తు ఏ విధంగా పెట్టుకుని ప్రశ్నించారు. తెలంగాణలోని 17 ఎంపి స్థానాల్లో తమ పార్టీ బరిలోకి దిగుతోందని తెలిపారు. కేంద్రంలో మూడోసారి ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టబోతున్నట్లు, దేశ వ్యాప్తంగా ప్రజలు బిజెపి గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇండియా కూటమితో తమ పార్టీకి ముప్పులేదని, వాటిలో బేధాభిప్రాయాలు ఉన్నాయని, చివరకు ఎవరికి వారే పోటీ చేస్తారని ఎద్దేవా చేశారు.